జల శక్తి మంత్రిత్వ శాఖ

జల జీవన్ మిషన్ కింద మధ్య ప్రదేశ్ కు రూ. 5,117 కోట్లు కేటాయించి రూ. 1,185 కోట్లు విడుదల చేసిన కేంద్రం

Posted On: 29 MAY 2021 6:58PM by PIB Hyderabad

     మధ్యప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అన్ని కుటుంబాలకు  తాగటానికి యోగ్యమైన సురక్షితమైన నీటిని అందించేందుకు వీలుగా మొదటి విడత రూ. 1,184.86 కోట్ల మొత్తాన్ని రాష్ట్రానికి  కేంద్ర ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న జాతీయ జల జీవన్ మిషన్ విడుదల చేసింది.   2023 నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా చేయాలన్న ప్రతిపాదనకు  రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.  తదనుగుణంగా జల జీవన్  మిషన్ అమలు కోసం  2021-22 సంవత్సరంలో  మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి   ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం  రూ. 5,116. 79  కోట్ల ఆర్థిక సహాయం మంజూరుకు  నిర్ణయించింది.  2019-20 సంవత్సరంలో  కేంద్ర ప్రభుత్వం రూ. 571.60 కోట్లు కేటాయించింది.   2020-21 సంవత్సరంలో ఆ మొత్తాన్ని రూ. 1,280.13 కోట్లకు పెంచారు.    ప్రతి గ్రామీణ కుటుంబానికి  కుళాయిల ద్వారా మంచినీరు సరఫరాకు వీలుగా జల జీవన్  మిషన్  పనులకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రం సమకూర్చగలదని  కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్  షెకావత్ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి  శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తో  భోపాల్ లో   రెండుసార్లు  జరిగిన సమావేశాలలో  తెలిపారు.    జల జీవన్   మిషన్ కార్యక్రమం  ప్రణాళిక,  అమలు  గురించి క్రమం తప్పకుండా  తాను స్వయంగా సమీక్షిస్తానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ రాజ్ సింగ్ హామీ ఇచ్చారు.  అంతేకాక ప్రధానమంత్రి ప్రకటించిన విధంగా  ప్రతి గ్రామీణ కుటుంబానికి తాగయోగ్యమైన మంచినీటిని కుళాయిల ద్వారా 2024 నాటికి  కాకుండా 2023 సంవత్సరంలోనే సరఫరా చేసేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోగలదని  ముఖ్యమంత్రి తెలిపారు.   ఫలితంగా  2020-21 సంవత్సరంలో  కోవిడ్ - 19 మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేసినప్పటికినీ మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మంచి పనితీరును కనబరచి 19.89 లక్షల గ్రామీణ కుటుంబాలకు  కొత్తగా మంచినీటి కుళాయి కనెక్షన్లు సమకూర్చింది.  

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో  మొత్తం 1.23 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి.   వాటిలో  ఇప్పుడు 38.29 లక్షల కుటంబాలకు (31.1%)  కుళాయిల ద్వారా మంచి నీటి సరఫరా జరుగుతోంది.   మరో 22 లక్షల కుళాయి కనెక్షన్లు సమకూర్చడం ద్వారా 2022 మార్చి నాటికి  కనీసం సగం గ్రామీణ కుటుంబాలకు నీరు అందించాలని  రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.   అంతేకాకుండా 7 జిల్లాలలో  3,731 గ్రామాలను పైపులైన్ల ద్వారా నీటి సరఫరా చేసే గ్రామాలుగా మార్చడంపై దృష్టి కేంద్రీకరించడానికి  పథకాలు రూపొందించింది.  అందులో భాగంగా ప్రతి గ్రామంలో సగటున 150 కన్నా తక్కువ కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా  ఈ గ్రామాలు  'ఇంటింటికీ నీరు'  ఉన్న గ్రామాలుగా మారిపోతాయి.  

2021-22 వార్షిక కార్యాచరణ ప్రణాళికపై జరిగిన చర్చ సందర్బంగా  మరింత వేగంగా ఈ పనిని చేపట్టాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు.  తద్వారా ఇప్పటికీ కుళాయి కనెక్షన్లు లేని  42% గ్రామాలకు  నీటి సరఫరా ఏర్పాటు చేయడం ఉద్దేశం.   ఈ పనిని తొందరగా పూర్తిచేయవచ్చు ఎందుకంటే ప్రస్తుతం కుళాయిల ద్వారా నీటి సరఫరా జరుగుతున్న గ్రామాలలో ఇంకా కనెక్షన్లు ఇవ్వవలసిన కుటుంబాల సగటు సంఖ్యతో పోలిస్తే నీటి సరఫరా లేని గ్రామాలలో ఇవ్వవలసిన సగటు కనెక్షన్ల సంఖ్య తక్కువ.
ఎస్సీ / ఎస్టీ లు ఎక్కువగా ఉండే ఆవాసాలు,  నీటి నాణ్యత సరిగాలేని గ్రామాలు,  కరువు పీడిత ప్రాంతాలు,  ఆకాంక్షాపూరిత జిల్లాలు,  ప్రధానంగా దుర్బల గిరిజన తెగలు నివసించే ఆవాసాలు మొదలగు ప్రాధాన్యతా ప్రాంతాల్లో తాగ యోగ్యమైన నీటి సరఫరాకు ఏర్పాట్లను పెంచాలని  రాష్ట్రప్రభుత్వానికి సూచించడం జరిగింది.  

జల జీవన్  మిషన్  ఆదర్శం మేరకు  రాష్ట్ర ప్రభుత్వం  'భాగస్వామ్యాలను స్థాపిస్తూ ,  జీవితాల్లో మార్పు తెస్తోంది'   సామాజిక సమీకరణకు,  స్థానిక సమాజాలు, గ్రామ పంచాయతీలకు చేయూతను ఇచ్చేందుకు ప్రభుత్వం  స్వచ్ఛంధ  సంస్థల  సేవలను తీసుకుంటున్నది.   సామాజిక,  వ్యక్తిగత ప్రవర్తనలో మార్పు తేవడానికి అవసరమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో వారు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు.   అందరికీ 'సురక్షితమైన తాగు నీరు'  అందేలా నిశ్చయం చేసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నీటి నాణ్యతకు సంబంధించిన వివిధ అంశాలపై దృష్టిని కేంద్రీకరించడం ప్రారంభించింది.  ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 155  నీటి నాణ్యతను పరీక్షించే ప్రయోగశాలలు ఉన్నాయి.   వాటిలో 32 ప్రయోగశాలలకు జాతీయ బోర్డు గుర్తింపు ఉంది. తాగు నీటిలో  సూక్ష్మ జీవులు, రసాయనాల మలినాలు లేకుండా వాటిని పరీక్షించడాన్ని  గురించి రాష్ట్రం ఉద్ఘాటిస్తోంది.  అందుకే  2021-22 సంవత్సరంలో  51 జిల్లా ప్రయోగశాలలో 23 ప్రయోగశాలలకు గుర్తింపు పొందాలని భావిస్తోంది.  
     ప్రతి గ్రామంలో ఐదుగురికి  ప్రధానంగా  అంగన్ వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్ ,  స్వయం సహాయక బృందాల సభ్యులు, వార్డు సభ్యులు ,  స్కూల్ టీచర్లు మొదలైన  మహిళలకు మంచినీటి నాణ్యత పరీక్షలు జరపడంలో శిక్షణ ఇస్తారు.  దానితో పాటు  నీటి నాణ్యత, పరిశుభ్రత,  సురక్షితమైన నీటికి సంబంధించిన అనేక అంశాలపై వారిని జాగృతం చేస్త్తారు.   నీటి ప్రాప్తి స్థానం వద్ద
మరియు పంపిణీ జరిగే చోట వారికి ఇచ్చిన  కిట్ల సహాయంతో పరీక్షలు జరుపుతారు.  ఒక వేళ నీటి నాణ్యత బాగా లేకపోతే వారు ఆ విషయాన్ని గ్రామ సర్పంచుకు  మరియు /లేక  ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ అధికారులకు తెలియజేసి నీటి నాణ్యత మెరుగుపరచాల్సిందిగా కోరుతారు.  

అన్ని పాఠశాలలు,  అంగన్వాడి కేంద్రాలు,  ఆశ్రమశాలలు వంటి వాటిలో  పైపులైన్ల ద్వారా నాణ్యమైన నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవలసిందిగా ఇటీవల జరిగిన చర్చలో జాతీయ జల జీవన్ మిషన్  అధికారులు   రాష్ట్ర ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులను కోరారు.  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం  పాఠశాలలు ,   శిశు సంరక్షణ కేంద్రాల పనులను యుద్ధప్రాతిపదిక పైన పూర్తి చేయడానికి పూనుకున్నది.  తద్వారా వాటిలో మంచినీటి  సౌకర్యంతో పాటు ,  మధ్యాహ్న భోజనం వండేందుకు ,  మరుగుదొడ్లలో ఉపయోగానికి అవసరమైన నాణ్యమైన నీరు లభ్యమవుతుంది.  


కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో ఇచ్చే గ్రాంటు రూ.   5,116.78 కోట్లకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇంకా ఖర్చుకాకుండా ఉన్న  రూ. 191.61  కోట్లతో  పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.  5,392.50 కోట్లు కలిపితే  జల జీవన్  మిషన్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.  10,700 కోట్లు ఉంటాయి.  నిధులు అందుబాటులో ఉన్నందువల్ల   రాష్ట్ర ప్రభుత్వం వీటితో అనుకున్న విధంగా  ఈ ఏడాది  త్వరితగతిన  గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు,   పైపులైన్ల ద్వారా నీటి సరఫరా పనులు చేపట్టవచ్చు.  

2019  ఆగస్టు 15వ తేదీన ప్రధానమంత్రి  ప్రకటించిన 'జల జీవన్ మిషన్' కార్యక్రమం ద్వారా దేశంలోని  గ్రామీణ ప్రాంతాలలో ప్రతి కుటుంబానికి  2024 నాటికి  కుళాయి కనెక్షన్  ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం.  ఇందుకోసం  రాష్ట్రప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సహకారాన్ని భారత ప్రభుత్వం తీసుకుంటోంది.    2021-22 ఆర్ధిక సంవత్సరంలో జల జీవన్ మిషన్ కు కేటాయించిన మొత్తం బడ్జెట్ రూ. 50,000 కోట్లు.   దానిలో రాష్ట్రాల వనరుల నుంచి  పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద  రూ. 26,940 కోట్లు కేటాయించారు.
వాటిలో  సగం నిధులను నీరు మరియు పారిశుద్ధ్యానికి ఖర్చు చేయడం తప్పనిసరి.   ఈ  ఏడాది  గ్రామీణ తాగునీటి సరఫరా రంగంలో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే  అవకాశాలున్నాయి.   దీనివల్ల  గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా ఉపాధి అవకాశాల కల్పనా జరుగుతోంది. తద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి దోహదకారి కాగలదు.  

 

***
 


(Release ID: 1722896) Visitor Counter : 164


Read this release in: English , Urdu , Hindi , Tamil