రక్షణ మంత్రిత్వ శాఖ
శ్రీలంక నౌకలో మంటల అదుపునకు కొనసాగుతున్న కసరత్తు!
అగ్నిజ్వాలలను ఆర్పే పనిలో ఐ.సి.జి. నౌకలు
Posted On:
27 MAY 2021 6:09PM by PIB Hyderabad
కొలంబో తీరం సమీపాన సముద్రంలో భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న శ్రీలంకకు చెందిన ఎం.వి. ఎక్స్-ప్రెస్ పెరల్ అనే కంటెయినర్ నౌకలో మంటలను అదుపుచేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మంటలను ఆర్పేందుకు భారతీయ తీరరక్షణ దళానికి (ఐ.సి.జి.కి) చెందిన వైభవ్, వజ్ర అనే నౌకలు తమ కృషిని కొనసాగిస్తూనే ఉన్నాయి. పరిస్థితిని అంచనా వేసేందుకు, అవసరమైతే తగిన సహాయం అందించేందుకు భారతీయ తీరరక్షణ దళం పంపించిన ఐ.సి.జి. డోర్నియర్ విమానం ప్రమాద స్థలంపైనే నిఘాతో విన్యాసాలు సాగిస్తోంది. సంఘటనా స్థంలో సముద్ర జలాల్లో చమురు తెట్టు అలముకున్నట్టు మాత్రం సమాచారం అందలేదు. అగ్ని జ్వాలలను అదుపు చేసే ప్రయత్నాలను మరింత బలోపేతం చేసేందుకు, చమురు తెట్టు ఏర్పడినా తగిన చర్యలు తీసుకునేందుకు కాలుష్య ప్రతిస్పందనా సామర్థ్యం ఉన్న ఐ.సి.జి. సముద్ర ప్రహరీ అనే ప్రత్యేక నౌకను కూడా ఇదివరకే ప్రమాద స్థలానికి పంపించారు. మంటలను అదుపు చేసేందుకు తగిన సహాయం అందించాలంటూ శ్రీలంక అధికారులు చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు భారతీయ తీర రక్షణ దళం తన సాధన సంపత్తిని యావత్తునూ సంఘటనా స్థలానికి తరలించింది.
వివిధ రసాయానలతో కూడిన 1,486 కంటెయినర్లను ఎం.వి. ఎక్స్- ప్రెస్ పెరల్ అనేక శ్రీలంక నౌక రవాణా చేస్తుండగా కోలంబో తీరం సమీపంలోనే హఠాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నౌక రవాణా చేసే కంటెయినర్లలో నత్రికామ్లంతో ఇతర ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగడం, ప్రమాదంతో కంటెయినర్లు దెబ్బతినడం, ప్రతికూల వాతావరణం, తదితర పరిస్థితుల నేపథ్యంలో నౌక ఒకవైపునకు ఒరిగి పోయింది. దీనితో నౌకలోని కంటెయినర్లు దిగువకు జారిపడ్డాయి. ఈ పరిస్థితుల్లో మంటలను అదుపు చేసేందుకు రెండు ఐ.సి.జి. నౌకలు, శ్రీలంకకు చెందిన నాలుగు ఓడలు ఉమ్మడిగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి.
ఐ.సి.జి. వజ్ర నౌక ఈ నెల 26వ తేదీ సాయంత్రం కొలంబో ఓడరేవులోకి ప్రవేశించింది. అగ్ని జ్వాలలను అదుపు చేయడానికి ఉపయోగించే 4,500 లీటర్ల ఆక్వివస్ ఫిల్మ్ ఫార్మింగ్ ఫోమ్ (ఎ.ఎఫ్.ఎఫ్.ఎఫ్.) రసాయన సమ్మేళనాన్ని, 450 కేజీల డ్రై కెమికల్ పౌడరును ఐ.సి.జి. ఈ నౌక ద్వారా శ్రీలంక అధికారులకు అప్పగించింది. అనంతరం వజ్ర నౌక ఈ రోజు తెల్లవారుజామున మంటలను అదుపుచేసేందుకు రంగంలో దూకింది. దీనికి తోడుగా, అవసరమైతే అదనంగా సహాయం అందించేందుకు, ప్రమాద స్థలంలో కాలుష్యం తలెత్తితే తగిన విధంగా ప్రతిస్పందించేందుకు కొచ్చి, చెన్నై, ట్యుటికోరిన్ రేవు ప్రాంతాల్లో ఐ.సి.జి. తగిన ఏర్పాట్లు చేసింది. ఎం.వి. ఎక్స్-ప్రెస్ పెరల్ నౌకలో అగ్ని జ్వాలలను అదుపు చేయడంలో శ్రీలంక అధికారులు, శ్రీలంక తీరరక్షణ దళం సిబ్బందితో నిరాటంకంగా సమన్వయం సాగించేందుకు భారతీయ తీర రక్షణ దళం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.
<><><>
(Release ID: 1722298)
Visitor Counter : 159