ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మ్యుకర్‌మైకోసిస్‌ నుండి సురక్షితంగా ఉండండి - కొవిడ్-19 రోగులలో కనుగొనబడిన ఒక ఫంగల్ సమస్య


డయాబెటిస్‌ను నియంత్రించండి, స్టెరాయిడ్స్‌ని అవసరం మేరకే వాడండి, మంచి పరిశుభ్రత పాటించండి, సొంత ఔషధాన్ని వాడకండి

Posted On: 14 MAY 2021 10:42AM by PIB Hyderabad

 

కొవిడ్-19 బారి నుండి మనల్ని రక్షించుకోవడానికి మరియు ఎదుర్కోవటానికి మన వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ..మరో ఫంగస్‌తో ఇంకో ముప్పు పొంచి ఉంది. దాని గురించి మనం తెలుసుకోవాలి మరియు చర్య తీసుకోవాలి. కొవిడ్‌ చికిత్సా సమయంలో లేదా కొవిడ్ చికిత్స పూర్తయిన తర్వాత కొద్దిమంది కొవిడ్-19 రోగులలో మ్యుకర్‌మైకోసిస్‌ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ కనిపించింది. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి ఇచ్చిన ఒక ప్రకటన ప్రకారం, రాష్ట్రంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పటికే 2000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు; 10 మంది బలయ్యారు. కొంతమంది రోగులు కంటి చూపును కూడా కోల్పోయారు.

మ్యుకర్‌మైకోసిస్‌ కారణమేమిటి?

మ్యుకర్‌మైకోసిస్‌ లేదా బ్లాక్ ఫంగస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. పర్యావరణంలోని శిలీంధ్ర బీజాంశాల ద్వారా ప్రజలు మ్యుకర్‌మైకోసిస్‌ గురవుతారు. కట్, స్క్రాప్, బర్న్ లేదా ఇతర రకాల చర్మ గాయం ద్వారా ఫంగస్ చర్మంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఇది చర్మంపై అభివృద్ధి చెందుతుంది.

కోవిడ్ -19 నుండి కోలుకుంటున్న లేదా కోలుకున్న రోగులలో ఈ వ్యాధి కనుగొనబడింది. అంతేకాక, డయాబెటిస్ ఉన్న మరియు రోగనిరోధక శక్తి సమర్ధవంతంగా పనిచేయని వారు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, కొవిడ్-19 రోగులలో ఈ క్రింది పరిస్థితులు మ్యుకర్‌మైకోసిస్‌ సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయి:

1. నియంత్రణలో లేని మధుమేహం

2. స్టెరాయిడ్ల వాడకం ద్వారా రోగనిరోధక శక్తి బలహీనపడటం

3. దీర్ఘకాలిక ఐసియు/హాస్పిటల్ బస

4. ఇతర అనారోగ్యాలు / అవయవమార్పిడి / క్యాన్సర్

5. వోరికోనజోల్ థెరపీ (తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు)

ఇది కొవిడ్-19 తో ఎలా సంబంధం కలిగి ఉంది

మ్యుకర్‌మైకోసిస్‌ అని పిలువబడే సూక్ష్మ జీవుల వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇవి వాతావరణంలో సహజంగా ఉంటాయి. ఎక్కువగా మట్టిలో మరియు ఆకులు, కంపోస్ట్ మరియు పైల్స్ వంటి క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాలలో కనిపిస్తాయి.

సాధారణ పరిస్థితుల్లో మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లతో విజయవంతంగా పోరాడుతుంది. కొవిడ్-19 మన రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా కొవిడ్-19 రోగుల చికిత్సలో డెక్సామెథాసోన్ వంటి మందులు తీసుకోవడం జరుగుతుంది, ఇది మన రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను అణిచివేస్తుంది. ఈ కారణంగా కొవిడ్-19 రోగులు మ్యుకర్‌మైకోసిస్‌ వంటి సూక్ష్మజీవులతో జరిగే పోరాటంలో విఫలమయ్యే ప్రమాదం ఉంది.

వీటితో పాటు ఐసియూలో ఆక్సిజన్ థెరపీ చేయించుకుంటున్న కొవిడ్ రోగులు తేమ ప్రభావంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

అయితే ప్రతి కొవిడ్ రోగి మ్యుకర్‌మైకోసిస్‌ బారిన పడతారని దీని అర్థం కాదు. డయాబెటిస్ లేనివారిలో ఈ వ్యాధి అసాధారణం అయితే వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. కోలుకునే అవకాశాలు ప్రారంభ రోగ నిర్ధారణ మరియు చికిత్సపై ఆధారపడి ఉంటాయి.

సాధారణ లక్షణాలు ఏమిటి?

నుదురు, ముక్కు, చెంప ఎముకలు వెనుక, మరియు కళ్ళు మరియు దంతాల మధ్య ఉన్న గాలి పాకెట్స్లో చర్మ సంక్రమణగా మ్యుకర్‌మైకోసిస్‌ బయటపడుతుంది. ఇది కళ్ళు, ఊపిరితిత్తులు వరకు వ్యాపిస్తుంది మరియు మెదడుకు కూడా వ్యాపిస్తుంది. ఇది ముక్కు మీద నల్లబడటం లేదా రంగు మారడం, అస్పష్టంగా లేదా డబుల్ దృష్టి, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మరియు రక్తం దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కోవిడ్ -19 రోగుల చికిత్స సమయంలో లేదా అనంతరం ముక్కు దిబ్బడ, అసౌకర్యం కలిగిన అన్ని కేసులను బ్యాక్టీరియా సైనసిటిస్ కేసులుగా పరిగణించరాదని అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సూచించింది. ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను గుర్తించడానికి వైద్య సహాయం తీసుకోవాలని సూచించింది.

దీనికి ఎలా చికిత్స చేస్తారు?

చర్మ సంక్రమణ ద్వారా ప్రారంభమయి ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. చికిత్సలో భాగంగా చనిపోయిన మరియు సోకిన అన్ని కణజాలాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం జరుగుతుంది. తద్వారా కొంతమంది రోగులు  ఎగువ దవడను కోల్పోతారు. కొన్ని సందర్భాల్లో కన్ను కూడా కోల్పోవడం జరుగుతుంది. నివారణలో 4-6 వారాల ఇంట్రావీనస్ యాంటీ ఫంగల్ థెరపీ కోర్సు ఉండవచ్చు. ఇది శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి, చికిత్సకు మైక్రోబయాలజిస్టులు, అంతర్గత ఔషధ నిపుణులు, ఇంటెన్సివిస్ట్ న్యూరాలజిస్టులు, ఈఎన్‌టి నిపుణులు, నేత్ర వైద్య నిపుణులు, దంతవైద్యులు, సర్జన్లు మరియు ఇతరుల బృందం అవసరం.

మ్యుకర్‌మైకోసిస్‌ ఎలా నివారించాలి?

డయాబెటిస్‌ను నియంత్రించడం అనేది ఐసిఎంఆర్ సూచించిన నివారణ పద్ధతుల్లో ఒకటి. అందువల్ల డయాబెటిస్ ఉన్న కొవిడ్-19 రోగులు చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

స్వీయ ఔషధాలు మరియు స్టెరాయిడ్ల అధిక వినియోగం ప్రాణాంతక సంఘటనలకు దారితీస్తుంది. అందువల్ల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా పాటించాలి. స్టెరాయిడ్ల అనుచిత వాడకం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల గురించి నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వి.కె. పాల్ మాట్లాడుతూ "కొవిడ్-19 ప్రారంభ దశలో స్టెరాయిడ్లను ఎప్పుడూ ఇవ్వకూడదు. ఇది ఆరవ రోజు తర్వాత మాత్రమే తీసుకోవాలి. రోగులు తగిన మోతాదులో వైద్యులు సూచించినట్లు నిర్దిష్ట రోజులు మందులు తీసుకోవాలి. ఔషధం యొక్క ప్రతికూల దుష్ప్రభావాలను నివారించడానికి ఔషధాల యొక్క హేతుబద్ధమైన ఉపయోగం ఉండేలా చూడాలి."అని చెప్పారు.

స్టెరాయిడ్స్ కాకుండా టోసిలిజుమోబ్, ఐటోలిజుమాబ్ వంటి కొవిడ్-19 ఔషధాల వాడకం కూడా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఈ ఔషధాలను సముచితంగా ఉపయోగించనప్పుడు అది ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే మన రోగనిరోధక వ్యవస్థ ఫంగల్ ఇన్ఫెక్షన్తో పోరాడడంలో విఫలమవుతుంది."అని డాక్టర్ పాల్ తెలిపారు.

రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే లేదా అణిచివేసే పదార్థమైన ఇమ్యునోమోడ్యులేటింగ్ ఔషధాలను నిలిపివేయాలని కోవిడ్ -19 రోగులకు ఐసిఎంఆర్ తన మార్గదర్శకాలలో సూచించింది. నేషనల్ కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ అటువంటి ప్రతికూల ప్రభావాలను నివారించడానికి టోసిలిజుమాబ్ యొక్క మోతాదును సవరించింది. సరైన పరిశుభ్రత పాటించడం వల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ను దూరంగా ఉంచవచ్చని తెలిపింది.

ఆక్సిజన్ థెరపీ రోగులకు, తేమలోని నీరు శుభ్రంగా ఉండడంతో పాటు క్రమం తప్పకుండా నింపేలా చూడాలి. నీరు లీకేజీ లేదని నిర్ధారించుకోవడానికి శ్రద్ధ వహించాలి (ఫంగస్ సంతానోత్పత్తి చేయగల తడి ఉపరితలాలను నివారించడానికి). రోగులు చేతులతో పాటు శరీరాన్ని శుభ్రంగా ఉంచడం ద్వారా సరైన పరిశుభ్రత పాటించాలి.

కొవిడ్ రికవరీ తర్వాత కూడా జాగ్రత్తగా ఉండండి

కొవిడ్-19 నుండి కోలుకున్న వారిని ఆ తరువాత నిశితంగా పరిశీలించాలి. పైన పేర్కొన్న ఎటువంటి హెచ్చరిక సంకేతాలు మరియు లక్షణాలపై అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కోలుకున్న వారాలు లేదా నెలలు తర్వాత కూడా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కనుగొనబడింది. సంక్రమణ ప్రమాదాన్ని నివారించడానికి డాక్టర్ సలహా ప్రకారం స్టెరాయిడ్లను ఉపయోగించుకోవాలి. వ్యాధిని ముందుగానే గుర్తించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ చికిత్సను సులభతరం చేయవచ్చు.

 

***



(Release ID: 1718665) Visitor Counter : 547