పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దృగ్గోచర రేఖకు ఆవల (బివిఎల్‌ఓఎస్) డ్రోన్ల ప్రయోగాత్మక నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి మినహాయింపు

ప్రయోగాత్మకంగా టీకాల సరఫరాకు అనుమతి;

డ్రోన్ల ద్వారా సరఫరాపై నియంత్రణ చట్రం రూపకల్పనకు

తోడ్పడనున్న ‘బివిఎల్‌ఓఎస్’ ప్రయోగాలు

Posted On: 07 MAY 2021 6:55PM by PIB Hyderabad

   తెలంగాణలో టీకాల సత్వర పంపిణీ నిమిత్తం దృగ్గోచర రేఖకు ఆవల (బివిఎల్ఓఎస్) ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా సరఫరా చేసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మానవ రహిత విమాన వ్యవస్థ (యూఏఎస్) నిబంధనలు-2021 నుంచి ఈ మినహాయింపు ఇవ్వబడింది. దేశంలో డ్రోన్ల వినియోగ అవకాశాల విస్తరణకు ప్రభుత్వ నిరంతర కృషిలో భాగంగానే కాకుండా కోవిడ్-19 మహమ్మారిపై జాతి పోరాటానికి తోడ్పాటు దిశగా ఈ అనుమతి ఇచ్చింది. కాగా, దృగ్గోచర రేఖ (వీఎల్ఓఎస్) పరిధిలో డ్రోన్లద్వారా కోవిడ్-19 టీకాలను ప్రయోగాత్మకంగా సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి గతనెలలో కొన్ని షరతులతో అనుమతి ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో అనువర్తన ఆధారిత నమూనాల రూపకల్పనకు, డ్రోన్ల వినియోగ ప్రక్రియను మరింత వేగిరపరచేందుకు వీలుగా ప్రస్తుత అనుమతిని దృగ్గోచర రేఖ  పరిధికి ఆవల (బీవీఎల్ఓఎస్) స్థాయికి కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. దీంతో 2021 మే నెలాఖరు నాటికి ఈ దిశగా ప్రయోగాలు ప్రారంభం కాగల అవకాశాలున్నాయి.

   ప్రస్తుత మినహాయింపు అనుబంధం-1లో పేర్కొన్న షరతులకు పూర్తిగా లోబడి ఉంటుంది. దీంతోపాటు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు (భవిష్యత్తులో) జారీచేసే ఆదేశాలు/ఇచ్చే మినహాయింపులను కూడా పాటించాల్సి ఉంటుంది. అలాగే ప్రామాణిక విధాన ప్రక్రియకు ఆమోదం లభించిన తేదీనుంచి లేదా తదుపరి ఆదేశాలిచ్చేదాకా- ఏది ముందైతే దానికి అనుగుణంగా ఈ మినహాయింపు ఏడాదిపాటు చెల్లుబాటవుతుంది. కాగా, ఈ నెలారంభంలో మరో 20 సముదాయ సంస్థలకూ దృగ్గోచర రేఖకు ఆవల పరిధిలో (బీవీఎల్ఓఎస్) ప్రయోగాత్మకంగా డ్రోన్ల నిర్వహణకు అనుమతి మంజూరు చేయబడింది. డ్రోన్ల ద్వారా సరఫరాతో పాటు ఇతర ప్రధాన అనువర్తనాలకు సంబంధించిన నియంత్రణ చట్రం రూపకల్పనకు ‘బివిఎల్‌ఓఎస్’ ప్రయోగాలు తోడ్పడనున్నాయి.

అనుబంధం-1

   తెలంగాణలో టీకాల పంపిణీ కోసం (బీవీఎల్ఓఎస్) ప్రయోగాత్మకంగా మానవరహిత (డ్రోన్) విమానాలను నిర్వహించడంలో ప్రభుత్వం కింది షరతులు పాటించాలి:

 1. ‘బీవీఎల్ఓఎస్’ ప్రయోగాత్మక విమానాల నిర్వహణకు ముందు ప్రతి సముదాయ సంస్థ (కన్సార్షియం) కింద పేర్కొన్న పత్రాలను రూపొందించి డీజీసీఏ అనుమతి కోసం సమర్పించాల్సి ఉంటుంది:

ఎ) ‘బీవీఎల్ఓఎస్’ కార్యకలాపాల కోసం ప్రామాణిక విధాన ప్రక్రియ (ఎస్ఓపీ)

బి) సాధారణ పరిస్థితుల్లో విమాన రాకపోకల నియంత్రణ (ఏటీసీ) విభాగంతో, భారత వాయుసేనతోనూ; సంబంధాలు కోల్పోవడం వంటి ఆకస్మిక పరిస్థితుల్లో ‘కమాండ్ కంట్రోల్’ (సీ2)తో సమన్వయం చేసుకోవడంపై ప్రామాణిక విధాన ప్రక్రియ (ఎస్ఓపీ).

 1. కార్యకలాపాల్లో పాలుపంచుకునే సంస్థలు (ప్రభుత్వ సంస్థలు కానివి), విధులు నిర్వర్తించే సిబ్బంది, ప్రతిపాదిత గగనతలాలకు సంబంధించి దేశీయాంగ వ్యవహారాల శాఖ (ఎంహెచ్ఏ) నుంచి భద్రత అనుమతి పొందాలి.
 2. భూతలం నుంచి గరిష్ఠంగా 400 అడుగుల ఎత్తువరకు మాత్రమే డ్రోన్లు ఎగిరేందుకు అనుమతి ఉంటుంది. అంతేకాకుండా ఎగిరే సమయానికి అదనంగా 15 శాతం ఇంధన నిల్వలు ఉండేలా చూడాలి.
 3. ‘బీవీఎల్ఓఎస్’ కింద ప్రయోగాత్మక సూక్ష్మ విమానాల నిర్వహణను ప్రారంభించే ముందు ప్రమాద పరిస్థితుల గుర్తింపు, ముప్పు నిర్వహణపై ఇందులోని భాగస్వాములందరికీ కార్యశాలను నిర్వహించాలి. అన్నిరకాల ప్రమాద పరిస్థితులపై ఆమోదనీయ స్థాయి భద్రత చర్యలు చేపట్టిన తర్వాత మాత్రమే విమానాల ప్రయోగాత్మక నిర్వహణ చేపట్టాలి.
 4. డ్రోన్లను నడిపించేవారికి చెల్లుబాటయ్యే శిక్షణ ధ్రువీకరణ పత్రంతోపాటు డ్రోన్ల నిర్వహణ కార్యకలాపాల్లో తగినంత అనుభవం ఉండాలి. ‘వీఎల్ఓఎస్’ పరిధిలో డ్రోన్ల నిర్వాహకులు, వాటిని నడిపే సుదూర చోదకులకు సురక్షిత నిర్వహణ రికార్డు ఉండటం తప్పనిసరి.
 5. ప్రయోగాత్మక కార్యకలాపాల ప్రారంభానికి ముందు భారత వాయుసేనతోపాటు స్థానిక పాలన యంత్రాంగం నుంచి తప్పక అనుమతులు పొందాలి.
 6. ప్రయోగాత్మక విమాన నిర్వహణ కొనసాగినంత కాలం ఏటీసీతో సమన్వయం సజావుగా సాగేందుకు వీలుగా శంషాబాద్ ఏటీసీ పరిధిలో ‘సింగిల్ పాయింట్ కో-ఆర్డినేటర్’ (ఎస్పీసీ)ని తెలంగాణ ప్రభుత్వం నియమించాలి.
 7. ‘బీవీఎల్ఓఎస్’ కింద ప్రతి ప్రయోగాత్మక విమానానికీ గగనతల ప్రయాణ ప్రణాళికను శంషాబాద్ ఏటీసీకి సమర్పించాలి; దీంతోపాటు ఫ్లైట్ సమాచార కేంద్రం (ఎఫ్ఐసీ) నంబరు, గగనతల రక్షణ అనుమతి (ఏడీసీ) నంబరును పొందాలి.
 8. శంషాబాద్ ‘ఏఏఐ‘ జనరల్ మేనేజర్ (ఏటీఎం)తో సమన్వయం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ‘ఎయిర్‌మ‌న్‌ నోటీసు (నోటామ్) జారీని ప్రారంభించాలి.
 9. స్థానిక సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాలకు తగినట్లుగా డ్రోన్ల కార్యకలాపాలను పరిమితం చేయాలి. అలాగే ఎగిరే/దిగే ప్రదేశాల్లో దృగ్గోచర వాతావరణ పరిస్థితులు (వీఎంసీ) ఉండేవిధంగా చూసుకోవాలి. డ్రోన్ల తయారీదారు నిర్దేశిత వాతావరణ పరిమితులను తప్పక అనుసరించాలి.
 10. ‘బీవీఎల్ఓఎస్’ కింద వినియోగించే ప్రయోగాత్మక విమానాలు దిగువ నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఉండాలి:

ఎ)   రకం – మైక్రో లేదా స్మాల్ కేటగిరీ రోటరీ వింగ్ డ్రోన్లు

బి)   చెల్లుబాటయ్యే డ్రోన్ గుర్తింపు సంఖ్య (డీఏఎన్)

సి)   సుదూర కార్యకలాపాలకు తగిన సామర్థ్యం ఉండాలి

డి)   ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి

ఇ)   స్వీయ గుర్తింపు, ప్రయాణమార్గ ప్రత్యక్ష వెల్లడి సామర్థ్యం ఉండాలి

ఎఫ్) బారోమెట్రిక్ సెన్సరును మోసుకుపోగల ఏర్పాటు ఉండాలి

జి)   భౌగోళిక హద్దు, బయల్దేరిన ప్రదేశానికి తిరిగి రాక (ఆర్టీహెచ్), స్వయంచలిత ప్రయాణ ముగింపు సామర్థ్యాలు కలిగి ఉండాలి

హెచ్) స్వయంప్రతిపత్తితో కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యం ఉండాలి

ఐ)    ప్రస్ఫుటంగా కనిపించే ఉజ్వలమైన రంగుతో వెలుగుతూ-ఆరుతూండే లైట్లుండాలి

జె)   భూభాగం, ఇతర అడ్డంకులను తప్పించేలా, ‘ఢీకొనే ముప్పు’ తప్పించే 360 డిగ్రీల కోణంలో పనిచేసే వ్యవస్థ ఉండాలి

కె)   మానవ సహిత/రహిత విమానాలను గుర్తించి-తప్పించుకు వెళ్లగల ‘కనుగొను-తప్పించు వ్యవస్థ’ (డీఏఏ) ఉండాలి.

ఐ)   దృశ్య/శ్రవణ హెచ్చరికలతో తక్షణ ప్రయాణమార్గం, మానవసహిత విమాన సమాచారం, డీఏఏ సమాచారంసహా ఫస్ట్ పర్సన్ వ్యూ (ఎఫ్పీవీ) ప్రదర్శక డ్రోన్ పైలట్ సదుపాయం ఉండాలి.

12. ప్రతిపాదిత వినియోగ అవసరానికి సరిపడా మాత్రమే అందులో ఉంచాలి. ప్రయోగాత్మక వినియోగం సందర్భంగా డ్రోన్లు పదార్థాలను జారవిడవటం లేదా పడవేయడం జరగకూడదు. అలాగే ఎలాంటి ప్రమాదకర పదార్థాలనూ రవాణా చేయరాదు.

13. ‘బీవీఎల్ఓఎస్’ ప్రయోగాత్మక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే ప్రతి సముదాయ సంస్థ ప్రాథమిక ‘యూఏఎస్’ రాకపోకల నిర్వహణ (యూటీఎం) మౌలిక సదుపాయాలను ఏర్పరచుకోవాలి. వీటి సాయంతోనే ప్రత్యక్ష విమాన కార్యకలాపాలను నిర్వహిస్తూ నిబంధనల ప్రకారం ‘ఏటీసీ, ఐఏఎఫ్’ యూనిట్లకు పరిస్థితుల అనుగుణ అవగాహన సమాచారం అందజేయాలి.

14. గాయాలకు దారితీసే ప్రమాదాలు/విధుల్లో లేనివారి మరణం లేదా ఆస్తి నష్టం వంటి అవాంఛనీయ సంఘటనల నష్టనివారణకు తగినట్లు ‘యూఏఎస్’ కార్యకలాపాలను ప్రతి సముదాయ సంస్థ బీమా చేయాలి.

15. ఈ ప్రయోగాల నిర్వహణ సందర్భంగా ఏ సంస్థకైనా వాటిల్లే కష్టనష్టాలకు భారత ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంబంధిత సంస్థలకు ఎలాంటి బాధ్యత ఉండదు.

16. సముదాయ సంస్థల ప్రయోగాత్మక కార్యకలాపాల సందర్భంగా వాటి చర్యల వల్ల ఏదైనా మూడో పక్షం దావాకు వెళ్లిన పక్షంలో ఏదైనా నష్టపరిహారం (పరిహారంసహా వ్యాజ్యం ఖర్చుకు పరిమితం కాకుండా) చెల్లించాల్సి వస్తే తదనుగుణంగా ప్రతి సముదాయ సంస్థ భారత ప్రభుత్వానికి హామీపత్రం సమర్పించాలి.

17. ‘బీవీఎల్ఓఎస్’ కింద ప్రయోగాత్మక విమానాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించరాదు.

18. ప్రయోగాలు పూర్తయిన తర్వాత పౌర విమానయాన శాఖ, ‘డీజీసీఏ’లకు సమగ్ర భావన ఆధారాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పత్రాల రూపకల్పన స్థాయి, వాటి ఆధార ఔచిత్యం ప్రతిపాదిత ‘బీవీఎల్ఓఎస్’ కింద డ్రోన్ కార్యకలాపాల సంక్లిష్టత స్థాయికి తగినట్లుగా ఉంటాయని భావిస్తున్నారు.

 

***(Release ID: 1717097) Visitor Counter : 143


Read this release in: English , Urdu , Hindi , Tamil