ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మలేరియా నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన “రీచింగ్ జీరో” ఫోరమ్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు.


మలేరియా నిర్మూలన (2017-2022) కోసం జాతీయ వ్యూహాత్మక ప్రణాళికను వివరించారు.

2015 లో మలేషియాలో జరిగిన తూర్పు ఆసియా సదస్సులో ఆసియా పసిఫిక్ నాయకుల మలేరియా కూటమి మలేరియా నిర్మూలన మార్గదర్శక ప్రణాళికను ఆమోదించిన 18 మంది ప్రపంచ నాయకులలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు.

"ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా 2015 తో పోలిస్తే 2020 లో మలేరియా కేసులు 84.5శాతం తగ్గాయి. మరణాలు 83.6శాతం తగ్గాయి" అని మంత్రి అన్నారు.

Posted On: 23 APR 2021 6:50PM by PIB Hyderabad

ప్రపంచ మలేరియా డే సందర్భంగా మలేరియా నిర్మూలన కోసం ఏర్పాటైన “రీచింగ్ జీరో” ఫోరమ్‌సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.ప్రతి సంవత్సరం, ఏప్రిల్ 25న ‘ప్రపంచ మలేరియా దినోత్సవం’ గా పాటిస్తారు. ఈ సంవత్సరం ప్రధాన అంశం “జీరో మలేరియా లక్ష్యాన్ని చేరుకోవడం.’ ’

ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం వేడుకలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతా అంశాన్ని (థీమ్) ఎంచుకున్నందుకు ఫోరమ్‌ను అభినందించారు  “ఈ థీమ్ మా దేశానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మేము దేశమంతటా మలేరియాను నిర్మూలించడానికి,  మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించడానికి, పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నాం. ప్రపంచ మలేరియా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ సమాజానికి  ఈ ప్రాణాంతక వ్యాధిని నిర్మూలించడానికి , వారి ప్రజల ఆరోగ్యాన్ని,  జీవనోపాధిని మెరుగుపర్చడానికి కృషి చేస్తున్న అన్ని ప్రభావిత దేశాలకు కూడా ప్రేరణనిస్తాయి ” అని అన్నారు. భారతదేశం నుండి ఈ వ్యాధిని తొలగించడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాల గురించి ఆయన మాట్లాడుతూ, “ మలేషియాలో 2015లో జరిగిన ఈస్ట్ ఏషియా సమిట్ సందర్భంగా ఆసియా పసిఫిక్ నాయకుల కూటమి మలేరియా నిర్మూలన మార్గదర్శక ప్రణాళికను ఆమోదించిన 18 మంది అంతర్జాతీయ నాయకులలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. 2030 నాటికి ఈ ప్రాంతం మలేరియా రహితంగా ఉండేలా కూటమి నాయకత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది” అని చెప్పారు.

ప్రధానమంత్రి నాయకత్వంలో ఈ దిశగా సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు: కేసుల పరంగా మలేరియా భారాన్ని 84.5శాతం, మరణాలను 83.6శాతం తగ్గించి దేశం గొప్ప విజయాన్ని సాధించగలిగిందని 2018, 2019,  2020 సంవత్సరాల  మలేరియా నివేదికలు వెల్లడించాయన్నారు "బలమైన రాజకీయ నిబద్ధత వల్లే  భారతదేశం మలేరియా నిర్మూలనలో విజయవంతం అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశసించింది.  కీటకాల వ్యాధుల నియంత్రణ చర్యలకు ప్రాధాన్యత ఇచ్చారని , నిర్మూలన వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడానికి దేశీయ నిధులను పెంచడంపై దృష్టి పెట్టారని పేర్కొంది"  అని మంత్రి వివరించారు.  2020 లో దేశంలో 116 జిల్లాల్లో సున్నా మలేరియా కేసులు నమోదయ్యాయంటూ సంబంధిత రాష్ట్రాలు, జిల్లాలన్నింటినీ అభినందించారు. ఈ అద్భుత ఘనతను సాధించడానికి భారతదేశానికి సహకరించిన అందరు అధికారులను, సంస్థలను హర్షవర్ధన్ అభినందించారు.

కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్య కార్యకర్తలు ఎన్నో విజయాలను సాధించారని డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. “కొవిడ్ మహమ్మారి వల్ల భారీ ప్రజారోగ్య సవాళ్లు ఉన్నప్పటికీ, ఆరోగ్య సంరక్షణలో వివిధ మంచి పద్ధతులను పాటించాం. కరోనా రహిత అత్యవసర వైద్యసేవల కోసం సమగ్ర విధానాన్ని పాటించాం. మలేరియా నిరోధక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. అన్ని స్థాయిలలో మందులు, వైద్య పరీక్షల పరికరాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బస్తర్ రీజియన్‌లో మలేరియా ముక్త్ అభియాన్‌ను విజయవంతంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా 37.8 లక్షల మందికి మలేరియా పరీక్షలు చేశారు. అంతేగాక 2.52 కోట్ల మందికి దోమతెరలను పంపిణీ చేశారు”అని మంత్రి విశదీకరించారు. కరోనా మహమ్మారి సమస్యలు ఉన్నప్పటికీ, మలేరియా నిర్మూలన  కార్యక్రమాలను  రాష్ట్ర ప్రభుత్వాల మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల మలేరియా నిర్మూలన చర్యలు మందగించబోవని అన్నారు.  "చురుకైన సమాజ భాగస్వామ్యం, అన్ని రంగాల సమన్వయంతో, 2030 నాటికి భారతదేశం మలేరియా నిర్మూలన లక్ష్యాన్ని సాధిస్తుంది"  అని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.  కార్యక్రమానికి ఎన్హెచ్ఎం అదనపు కార్యదర్శి & ఎండి వందనా గుర్నాని,  జాయింట్ సెక్రటరీ (విబిడి) ఎంఎస్ రేఖ శుక్లా,  డిజిహెచ్ఎస్ డాక్టర్ సునీల్ కుమార్,  ఇతర ఆరోగ్య విభాగాల సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. భారత్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ రోడ్రిక్ ఆఫ్రిన్ తన సంస్థ తరఫున ప్రాతినిధ్యం వహించారు.

***



(Release ID: 1713684) Visitor Counter : 211


Read this release in: English , Urdu , Hindi , Punjabi