ఆయుష్
కొవిడ్ రోగుల మానసిక ఆరోగ్యం పునరుద్ధరణ కోసం యోగా, ప్రకృతి వైద్యం
Posted On:
22 APR 2021 7:28PM by PIB Hyderabad
కొవిడ్ తీసుకొచ్చిన సంక్షోభం భారీగా ఉండగా, రెండో దశలో ఉప్పెనలా విరుచుకుపడుతున్న వైరస్ ప్రజల్లో ఒత్తిడి, ఆందోళనను పెంచుతోంది. ఈ మహమ్మారి శారీరకంగానేగాక, మానసికంగా కూడా రోగులను ఇబ్బంది పెడుతోంది. వారి కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన పెంచుతోంది.
కొవిడ్ రోగులకు శారీరక వైద్యంతోపాటు మానసిక వైద్య అవసరాన్ని గుర్తించిన మూడు ప్రముఖ సంస్థలు, వారి మానసిక ఆరోగ్య పునరుద్ధరణకు ప్రామాణిక పద్ధతి (ప్రోటోకాల్)ని రూపొందించేందుకు సంయుక్తంగా ముందుకొచ్చాయి. ఆ సంస్థలు, 'సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా & నాచురోపతి' (సీసీఆర్‌వైఎన్); ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన స్వతంత్ర సంస్థ అయిన, బెంగళూరులోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్' (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్); బెంగళూరులోని 'స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన' (ఎస్-వ్యాస). ఈ నెల 23వ తేదీన ఉదయం 9.30-11.30 గం. మధ్య వర్చువల్ కార్యక్రమం ద్వారా, 'కొవిడ్ రోగుల మానసిక ఆరోగ్య పునరుద్ధరణకు ప్రామాణిక పద్ధతి'ని ప్రకటిస్తారు. ఎస్-వ్యాస కులపతి డా.హెచ్.ఆర్.నాగేంద్ర ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. దీని తర్వాత, బీఎన్‌వైఎస్ సాధకులకు ఆన్‌లైన్ కార్యశాల నిర్వహించి, 'ప్రామాణిక పద్ధతి' సాధనపై శిక్షణనిస్తారు.
ప్రకృతి వైద్య రంగం ఉద్దేశం ప్రకారం, దేశంలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై పెరిగిన ఒత్తిడిని కూడా ఈ కార్యశాల వెల్లడిస్తుంది. కొవిడ్ కేసుల పెరుగుదలతో మన దేశంలోని ఆరోగ్య సంరక్షణ సంస్థలపై భారం పెరిగి, అవి తీరిక లేకుండా పని చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్క రోగి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం సవాలుగా మారింది.
నివేదికల ప్రకారం, కరోనా రోగుల్లో తలెత్తుతున్న మానసిక అనారోగ్యాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆందోళన, ఒత్తిడి పెరిగి కొవిడ్ కేర్ ఆసుపత్రుల్లో ఆత్మహత్యలకు కూడా పరిస్థితులు దారి తీస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలా దేశాల నుంచి అందుతున్న సమాచారాల ప్రకారం, ఐసోలేషన్‌లోని ఒంటరితనపు ఒత్తిడి, ఆరోగ్యం మరింత దిగజారిపోతుందేమోనన్న భయంతో రోగులు పోరాడుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు, హైపోక్సియా, అలసట, నిద్ర లేమి వంటి సమస్యలు కూడా రోగుల్లో కనిపిస్తున్నాయి. కొవిడ్ రోగులు కోలుకోవడంలో యోగా, ప్రకృతి వైద్యం పద్ధతులు సమర్థవంతమైన ప్రభావాన్ని చూపాయి. రోగుల్లో ఎస్పీఓటూ స్థాయులు పెరగడానికి, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తగ్గిపోవడానికి చిన్నపాటి శ్వాస సంబంధ వ్యాయామాలు, ప్రాణాయామం ప్రభావాన్ని చూపినట్లు కనుగొన్నారు. సీసీఆర్‌వైఎన్ నిర్వహించిన అధ్యయనాల్లోనూ ఇవే విషయాలు నిరూపితమయ్యాయి.
కొవిడ్ రోగుల్లో మానసిక అనారోగ్య లక్షణాలను తగ్గించడానికి ఈ 'ప్రామాణిక పద్ధతి' ఒక సహకార ప్రయత్నం వంటిది. కొవిడ్ అధ్యయనం; వ్యాధి వ్యాప్తి; ఒత్తిడి, మానసిక అనారోగ్య పరీక్షలు; యోగా, ప్రకృతి వైద్య పద్ధతులతో ఒత్తిడి, మానసిక అనారోగ్య నిర్వహణపై అవగాహన పెంచడానికి ఆన్‌లైన్ కార్యశాల సాయపడుతుంది.
***
(Release ID: 1713493)
Visitor Counter : 152