ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ పై భయాందోళనలు వద్దు! ప్రముఖ వైద్యుల పునరుద్ఘాటన


రెమ్ డెసివిర్ కోవిడ్ పై ‘రామబాణం’ కాదని స్పష్టీకరణ
“చికిత్సా విధానంలో ఆక్సిజన్ ఓ భాగం మాత్రమే,

అది ఔషధం లాంటిది కాదు”: ఎయిమ్స్ డైరెక్టర్
15శాతం మందికి మాత్రమే కోవిడ్ ఓమోస్తరు స్థాయికి
విషమిస్తుందంటూ డాక్టర్ల వివరణ.

Posted On: 21 APR 2021 9:12PM by PIB Hyderabad

  దేశవ్యాప్తంగా ఇటీవల పెరుగుతున్న కోవిడ్ కేసుల నిరోధానికి, కట్టడికి, చికిత్సా నిర్వహణకు భారత ప్రభుత్వం పరిపూర్ణ స్థాయిలో  వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దశలవారీగా, ముందు జాగ్రత్తగా, క్రియాశీలకంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలసి తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలన్నింటిపై ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా అత్యున్నత స్థాయిలో సమీక్ష కూడా జరుగుతోంది.  భారీ స్థాయిలో కేసులను ఎదుర్కొంటున్న 12 రాష్ట్రాలకు సంబంధించి ఈ నెల 30వ తేదీవరకూ అనుసరించదగిన కార్యాచరణ ప్రణాళికను కూడా పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక వ్యవహారాల శాఖ (డి.పి.ఐ.ఐ.టి.) ఇప్పటికే జారీ చేసింది. కోవిడ్ కట్టడి కసరత్తులో సంబంధిత భాగస్వామ్య వర్గాలన్నింటినీ సంప్రదించిన మీదటనే ఈ ప్రణాళిక జారీ అయింది. ఇక రాష్ట్రాల వారీగా నిరంతరాయంగా ఆక్సిజన్ రవాణా ప్రక్రియకు సంబంధించి పలు సూచనలతో కూడిన ఆదేశాలను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పి.ఎం. కేర్స్ నిధి ద్వారా 154 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కూడిన 162 పి.ఎస్.ఎ. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, క్షేత్రస్థాయి సంసిద్ధతను పసిగట్టే ‘మెడ్ సప్లై’  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ (యాప్)ను క్రియాశీలం చేయడం, కోవిడ్ చికిత్సలో అత్యవసర ఔషధంగా వాడే రెమ్ డెసివిర్ ఇన్ జెక్షన్ మందును ఉత్పత్తిని నెలకు 27-29 లక్షల వయల్స్ స్థాయినుంచి 74.10 లక్షల వయల్స్  స్థాయికి బలోపేతం చేయడం, రెమ్ డెసివిర్ మందును, ఇతర క్రియాశీలక ఔషధాల ఎగుమతిని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డి.జి.ఎఫ్.టి.) ద్వారా నిషేధించడం, ఈ మందుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి చర్యలకు సంబంధించి హోమ్ మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ వైరస్ బాధితులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించేందుకు ముఖ్యమైన ఈ చర్యలను ప్రభుత్వం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో కొత్త కోవిడ్ కేసులు కొంతకాలంగా నమోదవుతూ వస్తున్నాయి. దీనితో రెమ్ డెసివిర్ వంటి కొన్ని మందుల వినియోగం తీవ్రంగా పెరిగింది. తీవ్రమైన వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందే కోవిడ్ రోగులకు సంబంధించి ఆక్సిజన్ వినియోగం కూడా అధిక స్థాయిలో పెరిగింది. దీనితో ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంది.

   ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన జాతీయ చికిత్సా విధానంలో భాగంగా రెమ్ డెసివిర్ ఔషధం హేతుబద్ధ వినియోగానికి సంబంధించిన సమస్యలకు ముగ్గురు ప్రముఖ వైద్యులు పరిష్కార మార్గాలను సూచించారు. అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రణదీప్ గులేరియా, నారాయణ హెల్త్ సంస్థ చైర్మన్ డాక్టర్ దేవీ షెట్టి, మేదాంత హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ ఈ మేరకు సూచనలు చేశారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో ఆక్సిజన్ వినియోగానికి సంబంధించి పరిష్కార మార్గాలను కూడా వారు సూచించారు.

వ్యాక్సీన్ (టీకా)

  కోవిడ్ వైరస్ వ్యాధి కారణంగా జనంలో తలెత్తే వ్యాకులతను, ఆందోళనను పరిహరించే కీలకమైన ఆయుధమే వ్యాక్సీన్ (టీకామందు) అని డాక్టర్ గులేరియా అభివర్ణించారు.: మనకు కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఇది నిరోధించలేకపోయినా, మనం విషమస్థాయిలో జబ్బుపడకుండా నివారించి రక్షణ కల్పిస్తుందని అన్నారు. టీకా లేదా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మనకు కోవిడ్ సోకే ఆస్కారం ఉందని, కాబట్టి వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్కు ధారణ కొనసాగించడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు.

ఆక్సిజన్

 ఇక ఆక్సిజన్ సంతృప్తి స్థాయి 93-94శాతంమేర ఉన్న ఆరోగ్యవంతులైన వ్యక్తులకు 98-99శాతం మేర సంతృప్త స్థాయి ఆక్సిజన్ ఉండాలంటూ ఆతురత పడాల్సిన అవసరం లేదని, వారికి హై ఫ్లో ఆక్సిజన్ ను అందించవలసిన అగత్యం కూడా లేదని గులేరియా పునరుద్ఘాటించారు. ఆక్సిజన్ సంతృప్త స్థాయి 94శాతం కంటే కాస్త తక్కువగా ఉన్నవారిపై సునిశిత పర్యవేక్షణ జరిపితే సరిపోతుందని (ఆక్సిజన్ ను ఐచ్ఛిక అవసరంగా ఉంచుకోవచ్చని) ఆయన చెప్పారు.

 “ఆక్సిజన్ అనేది చికిత్సా ప్రక్రియకు దోహదపడే అంశమే తప్ప, అది ఔషధం లాంటిది కానేకాదు” అని ఆయన స్పష్టంచేశారు. తక్షణావసరంగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం లేదని అలా చేయడం ఆక్సిజన్ ను వృథా చేయడమేనని తెలియజెప్పేందుకు ఆయన ప్రయత్నించారు. గతంలో ఎపుడైనా రోగికి ఆక్సిజన్ మాత్రమే సహాయపడిందన్న అంశానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని, అందువల్ల అక్సిజన్ అందించాలన్న సూచన అంత సమంజసమైనది కాదని ఆయన అన్నారు.

  డాక్టర్ ట్రెహాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఆక్సిజన్ ను సక్రమ పద్ధతిలో వినియోగించిన పక్షంలో దేశంలో అవసరానికి తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉటుందని ఆయన అన్నారు. ఆక్సిజన్ ను “సురక్షితమైన అంశంగా” కప్పి పుచ్చుకునేందుకు వాడుకోవద్దని అన్నారు. ఆక్సిజన్ ను వృథా చేస్తే, నిజంగా అవసరమైన వారికి అది దొరక్కుండా పోతుందని ఆయన అన్నారు.

 ఆక్సిజన్ సంతృప్త స్థాయి 94శాతానికి కాస్త ఎక్కువగా ఉంటే ఏలాంటి సమస్యా ఉండబోదని. ఒక వేల ఆక్సిజన్ స్థాయి తగ్గుతూ ఉంటే పర్యవేక్షణపై వైద్యుడి సలహా తీసుకోవచ్చని డాక్టర్ షెట్టి చెప్పారు.

రెమ్ డెసివిర్

  రెమ్ డెసివిర్ మందును అద్భుతమైన పరమౌషధంగా పరిగణించడం పూర్తిగా మానుకోవాలని డాక్టర్లందరూ ఏకగ్రీవంగా, ముక్తకంఠంతో సూచన చేశారు. ఇంటిలోనే వైద్యం తీసుకుంటున్న కోవిడ్ బాధితులెవ్వరికీ ప్రత్యేక చికిత్సా విధానం అంటూ ఏమీ అవసరం లేదని, చాలా తక్కువ శాతం మందికి మాత్రమే రెమ్ డెసివిర్ అవసరం కావచ్చున్ని వారన్నారు.

  మనం అంతా కలసికట్టుగా పనిచేస్తే, ఆక్సిజన్.ను, రెమ్ డెసివిర్ ను సమంజసమైన పద్ధతిలో వినియోగిస్తే అప్పుడు దేశంలో ఎక్కడా దేనికీ ఎలాంటి కొరతా ఉండబోదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్ అవసరమైన వారి సంఖ్యను, ఆక్సిజన్ సరఫరా పరిస్థితిని బేరీజు వేసుకున్నపుడు, ఈ విషయంలో మన దేశం సమతుల్యంగానే ఉందని అర్థమవుతోందని వారన్నారు.

  ఈ సందర్భంగా డాక్టర్ ట్రెహాన్ మాట్లాడుతూ,.. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికీ రెమ్ డెసివిర్ ఇవ్వాల్సిన అవసరం లేదని  తమ ఆసుపత్రి కూడా ఒక నిబంధనను జారీ చేసుకున్నట్టు తెలిపారు. రోగిపై జరిపిన పరీక్ష ఫలితాలు, వ్యాధి లక్షణాలు, ఇతర వ్యాధుల పరిస్థితి వంటి వాటిని వైద్యులు పరిశీలించిన తర్వాతనే అవసరాన్ని బట్టి ఈ మందును ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. రెమ్ డెసివిర్ అనేది కోవిడ్ చికిత్సకు  'రామబారణం', కానే కాదని అంతా గ్రహించాలని ఆయన అన్నారు.

సాధరాణ అంశాలు

  రెమ్ డెసివిర్ వంటి మందుల వినియోగంతో ఎలాంటి ప్రత్యేకమైన చికిత్స అవసరం లేకుండానే 85శాతం మంది కోవిడ్ రోగులు తిరిగి కోలుకుని ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఉందని, చాలా మందికి సాధారణ జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఐదునుంచి 7 రోజులపాటు ఉంటాయని, వారికి ఆయా లక్షణాలకు తగిన చికిత్స చేస్తే సరిపోతుందని డాక్టర్ గులేరియా అన్నారు. కేవలం 15శాతం మందికి మాత్రమే ఒక మోస్తరు తీవ్రతతో వ్యాధి విషమించే ఆస్కారం ఉంటుందని అన్నారు.

  ఎవరికైనా వ్యాధి సోకిందా..లేదా అన్న అంశంతో సంబంధం లేకుండా సమూహంలో ఉండటం నివారించాలని, ఇళ్లలో, భవనాల్లో గాలి వెలుతురు సాఫీగా సాగిపోయే ఏర్పాటు ఉంటే వైరస్ సోకే ముప్పు తగ్గుతుందని అన్నారు.

  డాక్టర్ ట్రెహాన్ మాట్లాడుతూ, ఈ వైరస్ సోకిన వారిలో చాలా తక్కువ శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన అవసరమవుతుంది కాబట్టి ఆసుపత్రి పడకలను మనమంతా సమంజసమైన రీతిలో, బాధ్యతాయుతంగా వినియోగించుకోవలసిన అవసరం ఉందని అన్నారు.

  ఎవరైనా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కాగానే, వెంటనే డాక్టర్ అభిప్రాయాన్ని తీసుకోవాలని డాక్టర్ షెట్టి సూచించారు. పాజిటివ్ అని తేలినంత మాత్రాన ఆందోళన, గాబరా అక్కర్లేదని, సత్వరం వైద్య సహాయం పొంది, వైద్యుల సూచనలు కచ్చితంగా పాటిస్తే సమస్య పూర్తిగా పరిష్కారం కాగలదని ఆయన అన్నారు.

  రోగికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేనపుడు, అలాంటి వారు ఇంట్లోనే ఉండి, ఏకాంతంగా గడుపుతూ, మాస్కు ధరించి ప్రతి ఆరు గంటలకూ ఆక్సిజన్ సంతృప్తి స్థాయిని పర్యవేక్షించుకుంటూ ఉండాలంటూ డాక్టర్లు సూచించే అవకాశం ఉందని అన్నారు. అలాగే ఎవరికైనా వళ్లు నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు ఉంటే ఆ లక్షణాలను ప్రాతిపదికగా చేసుకుని సదరు రోగికి తదుపరి చికిత్స అందించాల్సి ఉంటుందని డాక్టర్ షెట్టి అన్నారు.

 

*****(Release ID: 1713398) Visitor Counter : 253


Read this release in: English , Urdu , Marathi , Hindi