ఆర్థిక మంత్రిత్వ శాఖ

జి20 ఆర్థికమంత్రులు-కేంద్ర బ్యాంకుల గవర్నర్ల రెండో ప్రత్యక్ష సాదృశ సమావేశంలో పాల్గొన్న ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 07 APR 2021 7:57PM by PIB Hyderabad

 

  

కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇవాళ ఇటలీ అధ్యక్షతన జరిగిన జి20 ఆర్థికమంత్రులు-కేంద్ర బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) రెండో ప్రత్యక్ష సాదృశ సమావేశంలో పాల్గొన్నారు. బలమైన, సుస్థిర, సమతుల, సమ్మిళిత అభివృద్ధి పునరుద్ధరణలో ఎదురవుతున్న అంతర్జాతీయ సవాళ్లపై విధానపరమైన స్పందనల గురించి ఈ సమావేశం ప్రధానంగా చర్చించింది. ఇందులో భాగంగా కోవిడ్-19పై జి20 కూటమి కార్యాచరణ ప్రణాళిక అమలులో తాజా పరిణామాలపైనా జి20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు చర్చించారు. అలాగే అత్యంత దుర్బల ఆర్థిక వ్యవస్థల ఆర్థిక అవసరాలకు అండగా నిలవడం, అంతర్జాతీయ పన్ను విధానాలపై చర్చల ప్రగతి, హరిత విధాన పరివర్తనలకు ప్రోత్సాహం, మహమ్మారి సంబంధిత ఆర్థిక నియంత్రణ సమస్యలు తదితరాలపైనా సమావేశం దృష్టి సారించింది.

   ముఖ్యంగా అన్ని దేశాలకూ సమాన స్థాయిలో టీకాల లభ్యత, విస్తృత పంపిణీ సాగేవిధంగా జి20 కూటమి సభ్యదేశాలు శ్రద్ధ వహించాలని శ్రీమతి సీతారామన్ కోరారు. దేశీయంగా వేగవంతమైన ప్రతిష్ఠాత్మక టీకాల కార్యక్రమాన్ని భారత్ ఇప్పటికే నిర్వహిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి వివరించారు. ప్రత్యేకించి మహమ్మారి విజృంభణ సమయంలో టీకాలు, ఔషధ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచంలో కీలక ఉత్పత్తిదారుగా భారత్ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. దేశీయంగా టీకాల కార్యక్రమంలో ఇప్పటిదాకా 87 మిలియన్ల పౌరులకు భారత ప్రభుత్వం టీకాలు వేయడం పూర్తిచేసిందని శ్రీమతి సీతారామన్ చెప్పారు. అంతేకాకుండా 84 దేశాలకు 64 మిలియన్ల డోసులకుపైగా టీకాలను సరఫరా చేయగా, ఇందులో 10 మిలియన్ల డోసులు ఉచితంగా అందించినట్లు వెల్లడించారు. ఆయా దేశాలకు సంబంధించిన ఇటువంటి అనుభవాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్దం కావాల్సిందిగా ‘‘మహమ్మారి సన్నద్ధత- ప్రతిస్పందన కోసం అంతర్జాతీయ ఉమ్మడి వనరుల’’కు ఆర్థిక సహాయం అందించే జి20 ఉన్నత స్థాయి స్వతంత్ర సంఘానికి ఆర్థికశాఖ మంత్రి సూచించారు.

   ప్రపంచవ్యాప్తంగా వృద్ధి అంచనాల గురించి శ్రీమతి సీతారామన్ ప్రస్తావించారు. వైరస్ సంబంధిత అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో నిరంతర సమన్వయం అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు. ఈ విషయంలో జి20 కార్యాచరణ ప్రణాళిక మంచి మార్గనిర్దేశక ఉపకరణంగా అందివచ్చిందని, కోలుకునే దిశగా మార్గం రూపొందించడమే ప్రణాళిక నవీకరణలో ప్రస్తుత ప్రధానాంశమని ఆర్థికశాఖ మంత్రి చెప్పారు.

   ఈ జి20 సమావేశంలో వాతావరణ మార్పులపై చర్చ సందర్భంగా- పారిస్ ఒప్పందంలో అంగీకరించిన మేరకు వాతావరణ మార్పు సంబంధిత ఆర్థిక సహాయం-సాంకేతికత బదిలీ బాధ్యతలను నెరవేర్చడంలో పురోగతి అవసరాన్ని శ్రీమతి సీతారామన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ద్రవ్య చేయూతను హరిత విధాన పరివర్తనల వైపు మళ్లించే క్రమంలో- ముఖ్యంగా వర్ధమాన, అల్పాదాయ దేశాలలో వృద్ధి పునరుద్ధరణే తక్షణ సవాలు అన్న వాస్తవాన్ని గుర్తించాలని శ్రీమతి సీతారామన్ సూచించారు. అత్యంత దుర్బల ఆర్థిక వ్యవస్థలకు చేయూతలో భాగంగా రుణ చెల్లింపుల తాత్కాలిక నిలుపుదలను 2021 డిసెంబరు దాకా... మరో ఆరు నెలలు పొడిగించే ప్రతిపాదనకు ఆర్థికశాఖ మంత్రి మద్దతు

ప్రకటించారు.

 

***



(Release ID: 1710343) Visitor Counter : 151


Read this release in: English , Urdu , Marathi , Hindi