కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఐదు అఖిల భారత కార్మిక సర్వేల్లో రెండింటికి శ్రీకారం!


మిగిలిన మూడింటిని త్వరలో ప్రారంభిస్తామని లేబర్ బ్యూరో హామీ

Posted On: 01 APR 2021 5:06PM by PIB Hyderabad

దేశంలోని కార్మికులపై అఖిల భారత స్థాయిలో  ఐదు ప్రధాన సర్వేలను చేపట్టే బాధ్యతను భారత ప్రభుత్వం ఇటీవల కార్మిక వ్యవహారాల సంస్థ(లేబర్ బ్యూరో)కు అప్పగించింది. వలస కార్మికులపై, ఇంటిపని వారిపై, రవాణా రంగంలో ఉత్పన్నమయ్యే ఉపాధిపై, వృత్తినిపుణులైన పనివారి ఉపాధిపై సర్వేలు, ఉపాధిపై సంస్థల ప్రాతిపదికన త్రైమాసిక సర్వే వంటి ఐదు అఖిల భారత స్థాయి సర్వేలను కార్మిక సంస్థకు అప్పగించారు. ఒక నిపుణుల బృందం సాంకేతిక మార్గదర్శకత్వంలో ఈ సర్వేలకు లేబర్ బ్యూరో రూపకల్పన చేసింది.  ప్రొఫెసర్ ఎస్. పి. ముఖర్జీ అధ్యక్షతన, డాక్టర్ అమితాబ్ కుండూ సహాధ్యక్షతన గల నిపుణుల బృందం ఈ సర్వేలకు మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది. శాస్త్రీయమైన, పటిష్టమైన ఈ  ఐదు సర్వేలకు పరిశీలనాంశాలను రూపొందించేందుకు ఇప్పటివరకూ ఈ నిపుణుల బృందం విస్తృత స్థాయిలో 60 దాకా సమావేశాలు నిర్వహించింది.

  అఖిల భారత స్థాయిలోని ఈ ఐదు సర్వేలనూ ఒకేసారి ఖరారు చేసినప్పటికీ, కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందులను, అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని వీటిని దశలవారీగా ప్రారంభించనున్నారు. వలసకూలీలపై అఖిల భారత సర్వేను,  ఉపాధిపై సంస్థల ప్రాతిపదికన త్రైమాసిక అఖిలభారత సర్వేను మాత్రం తొలుత ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో టాబ్లెట్ పిసిలను ఉపయోగించడం, “కాగిత రహితంగా” సమాచార సేకరణ చేపట్టడం వల్ల ఈ సర్వేలు ఉత్కృష్ట స్థాయిలో ఉంటాయి. అధునాతన సాఫ్ట్.వేర్, తాజా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంతో సర్వేని పూర్తిచేసేందుకు గడువు కనీసం 30నుంచి 40శాతం తగ్గే అవకాశం ఉంది. ఇందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్రాడ్.కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బి.ఇ.సి.ఐ.ఎల్.) సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. ప్రధాన ప్రాంతీయ భాషలలో కూడా నిర్వహించడం ఈ అఖిల భారత సర్వేల్లో మరో ప్రత్యేకగా చెప్పవచ్చు.   

 

https://ci6.googleusercontent.com/proxy/kvEOIVSyYYvUl0c9aSWNm856uCvSJTHVjq3qXvjuBo4ZX8hahfnwI0CHSOa-lFn9wdiQ_5NKUvHNg3UOHJf4RtvAGX9WhDHtfA7CpRraBw9DrXVSajX7px8HfA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001KO8H.jpg

 

ప్రతి సర్వేకి సంబంధించిన లక్ష్యాలపై నిశిత పరిశీలన:

 

  1. వలస కూలీలపై అఖిల భారత సర్వే – కూలీల వలసతో సంబంధం ఉన్న ఉపాధి, తదితర అంశాలపై అధ్యయనం చేయడం. వారి పని పరిస్థితులు, జీవన పరిస్థితులను అధ్యయనం చేయడం. వారి పనిపై కోవిడ్-19 వైరస్ మహమ్మారి ప్రభావాన్ని పరిశీలించి అంచనా వేయడం.

 

  1. ఉపాధిపై సంస్థల ప్రాతిపదికన త్రైమాసిక అఖిలభారత సర్వే –పదిమందిని,.. అంతకంటే ఎక్కువ మందిని నియమించుకునే సంస్థలకు, 9మంది లేదా అంతకంటే తక్కువ మందిని నియమించుకునే సంస్థలకు ఉపాధి కల్పనపై కావలసిన అంచనాలను ఈ సర్వే అందజేస్తుంది. ఉపాధి పరిస్థితుల్లో చోటుచేసుకున్న మార్పులను ఈ సర్వే తెలియజేస్తుంది. ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో ఉపాధి పరిస్థితులపై సమాచారాన్ని త్రైమాసిక ప్రాతిపదికపై అందిస్తుంది.   

 

  1. ఇంటి పనివారిపై అఖిల భారత సర్వే – పనివారి సంఖ్యపై తొలిసారిగా జరుగుతున్న సర్వే ఇది. దేశవ్యాప్తంగా ఇళ్లలో పనిచేసే పనిమనుషుల సంఖ్యపై తన అంచనాను అందించడంలో ఈ సర్వే కీలకపాత్ర పోషిస్తుంది. వివిధ రకాల ఇళ్లలో ఆయా కుటుంబాలు నియమించుకునే ఇంటిపనివారి సగటు సంఖ్యపై, వారు చేసే పనుల స్వరూప స్వభావాలపై సమాచారాన్ని సేకరించడం ఈ సర్వే అదనపు లక్ష్యం.

 

  1. రవాణా రంగంలో ఉత్పన్నమయ్యే ఉపాధిపై అఖిల భారత సర్వే–దేశవ్యాప్తంగా రవాణా రంగంలో ఉత్పన్నమయ్యే ఉపాధి, సంబంధిత అంశాలపై అంచనాల సేకరణ ఈ సర్వే ద్వారా జరుగుతుంది.   

 

  1.   వృత్తినిపుణులైన పనివారితో ఉత్పన్నమయ్యే ఉపాధిపై అఖిల భారత సర్వే– న్యాయవాదులు, వైద్యులు, కాస్ట్ అక్కౌంటెంట్లు, చార్టర్డ్ అక్కౌంటెంట్లు వంటి వృత్తి నిపుణులైన పనివారి కారణంగా ఉత్పన్నమయ్యే ఉపాధిపై అంచనా కట్టేందుకు ఈ సర్వే సమాచారం దోహదపడుతుంది.

 

  కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ పేర్కొన్నట్టుగా కార్మిక, ఉపాధి కల్పనా రంగాలకు సంబంధించిన అంశాల్లో ఏర్పడిన అంతరాన్ని తొలగించేందుకు ఈ సర్వేలు ఉపకరిస్తాయి. ఆధారాల ప్రాతిపదికన చేపట్టే విధాన నిర్ణాయక ప్రక్రియకు కూడా ఈ సర్వేలు దోహదపడతాయి.

https://ci4.googleusercontent.com/proxy/7z6icjLpy_CEE43alN-QuxoaIIrnSgUk3eeAtdGismy8RQiHf6pYsC_CkpktVKKY2GH_njjUdqU2_FZxJTOGpUj8vXZkVtMk3EI9JHnKeAf0MFbxcRINl-p6NA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00254O4.jpg

ఈ అఖిల భారత సర్వేలన్నింటి ప్రారంభానికి నిర్దేశించిన నిర్ణీత గడువును పాటించేందుకు కార్మిక వ్యవహారాల సంస్థ కట్టుబడి ఉందని, నిపుణుల బృందం సమర్థ మార్గదర్శకత్వం, కార్మిక మంత్రిత్వ శాఖ సంపూర్ణమైన మద్దతుతో కార్మిక సంస్థ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డి.పి.ఎస్. నెగీ చెప్పారు. అఖిల భారత స్థాయిలో తలపెట్టిన ఐదు సర్వేల్లో రెండింటిని ఈరోజు ప్రారంభించామని ఆయన అన్నారు. ఈ విషయంలో నిపుణుల బృందం, కార్మిక సంస్థ చేసిన కృషి ఎంతో అభినందనీయమన్నారు. ఈ సర్వేలన్నింటికీ సంబందించి క్షేత్రస్థాయి కార్యకలాపాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసేందుకు తమ సంస్థ శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. ఈ సర్వేల్లో నాణ్యమైన ఫలితాలు రాబట్టేందుకు  క్షేత్రస్థాయి ఇన్వెస్టిగేటర్లకు, సూపర్ వైజర్లకు తమ సంస్థ క్రమం తప్పకుండా పటిష్టమైన శిక్షణను అందిస్తున్నట్టు తెలిపారు.

ప్రస్తుతానికి రెండు సర్వేలు మాత్రమే మొదలైనప్పటికీ, రానున్న రోజుల్లో మిగిలిన మూడు సర్వేలకు కూడా శ్రీకారం చుట్టేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు. దేశంలో కార్మిక వ్యవహారాల గణాంకాలకు సంబంధించి ప్రధాన సంస్థ అయిన లేబర్ బ్యూరో,.. ఈ అఖిల భారత సర్వేల కింద ఆశించిన ప్రయోజనాలకు అనుగుణంగా, నాణ్యమైన అత్యున్నత స్థాయి ఫలితాలకోసం కృషి చేస్తుందని డి.పి.ఎస్. నెగీ చెప్పారు. 

 

****



(Release ID: 1709197) Visitor Counter : 268


Read this release in: English , Urdu , Hindi , Bengali