జల శక్తి మంత్రిత్వ శాఖ

గ్రామీణ నీటిసరఫరా వ్యవస్థలపై ఐ.ఒ.టి. సెన్సార్ల పర్యవేక్షణ!


జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో కసరత్తు. సరఫరాలో సవాళ్లకు డిజిటల్ పరిజ్ఞానంతో పరిష్కారం

Posted On: 31 MAR 2021 4:06PM by PIB Hyderabad

గ్రామాల్లో ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా వ్యవస్థలపై పర్యవేక్షణకు, దేశంలోని 6లక్షలకు పైగా గ్రామాల్లో జల జీవన్ మిషన్ (జె.జె.ఎం.) పథకం అమలును సమర్థవంతంగా పరిశీలించడానికి డిజిటల్ మార్గాన్ని ఆశ్రయించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. నీటి సరఫరా వ్యవస్థలపై పర్యవేక్షణకు సెన్సార్ ఆధారంగా పనిచేసే అధునాతనమైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఒ.టి.) పరికరాలను తొలిసారిగా వినియోగించాలని జలశక్తి మంత్రిత్వ శాఖ సంకల్పించింది. ఇందుకోసం టాటా కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ట్రస్ట్ (టి.సి.ఐ.టి.),  టాటా ట్రస్టుల సహకారంతో ఐదు రాష్ట్రాల మారుమూల గ్రామాలలో ప్రయోగాత్మక ప్రాజెక్టులను జాతీయ జల జీవన్ మిషన్  ఇటీవలే పూర్తి చేసింది.  ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ప్రయోగాత్మక పథకాలు ఇటీవలే పూర్తయ్యాయి. ఖర్చులో పొదుపైన, నిర్మాణంలో ధృడమైన సెన్సార్లను వాడటం, వాటి వినియోగం ద్వారా నీటి సరఫరా సమస్యలకు సుస్థిరమైన పరిష్కారం సాధించడం ఈ ప్రయోగాత్మక పథకాల కీలక లక్షణం.  నాణ్యతపై, లేదా పనితీరుపై ఏ మాత్రం రాజీ పడకుండా నీటిసరఫరా మౌలిక సదుపాయాల వ్యయాలలో తక్కువ శాతం ఖర్చుతో (మొత్తం పథకం వ్యయంలో 10నుంచి 15శాతం ఖర్చుతో) బలమైన పరిష్కారాన్ని రూపొందించడం,. ఈ ప్రయత్నంలో ఎదురయ్యే ముఖ్య సవాళ్లలో ఒకటిగా చెప్పవచ్చు. అయితే, భారీస్థాయిలో పనులు చేపట్టినపుడు ఈ ఖర్చులు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు. తయారీదారులతో సహా ఎక్కువ విక్రయ సంస్థలు స్వదేశీ సంస్థలే కావడంతో, ప్రభుత్వం ప్రబోధించే ఆత్మ నిర్భర్ భారత్ నినాదానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వైరస్ మహమ్మారి ఎన్ని సవాళ్లు విసిరినా ఈ ప్రయోగాత్మక పథకాలన్నీ గత ఏడాది సెప్టెంబర్‌లో పనిచేయడం ప్రారంభించాయి.

  ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఒ.టి.) ఆధారిత రిమోట్ సెన్సార్లను వినియోగం  ద్వారా ఎటువంటి మానవ జోక్యం లేకుండా నీటిసరఫరా పథకాలపై వాస్తవ సమయ సమాచారం మనకు అందుబాటులోకి వస్తుంది.  ఇది క్షేత్రస్థాయిలో సమర్థమైన పర్యవేక్షణకు నిర్వహణకు దోహదపడటమేకాక, ప్రభుత్వ నీటి సరఫరా శాఖ అధికారులకు, ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ అధికారులకు, పౌరులకు వాస్తవ సమయ సమాచారాన్ని అందిస్తుంది.  ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా నీటి సరఫరా జరిగేలా చూడాలంటే, గ్రామీణ నీటి సరఫరా పథకాలపై ముందుచూపుతో కూడిన పర్యవేక్షణ చాలా అవసరం. పటిష్టమైన నిర్వహణా సామర్థ్యం, వ్యయం తగ్గింపు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ ఈ పర్యవేక్షణ జరపాల్సి ఉంటుంది. పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అందే వాస్తవసమాచారం సేవల బట్వాడాను మెరుగుపరిచేందుకు, నీరు వంటి విలువైన ప్రకృతి సంపద సరఫరాకు సంబంధించి పారదర్శక విధానానికి దోహదపడుతుంది.

  దేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి ఆయా ప్రాంతాల గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నమూనాలు పలురకాలుగా, పరస్పరం విభిన్నంగా ఉంటాయి. ఇటీవల మొదలైన ప్రయోగాత్మక నీటి సరఫరా పథకాలను విభిన్నమైన వ్యసాయక, వాతావరణ పరిస్థితులున్న ప్రాంతాల్లో చేపట్టారు. పశ్చిమ హిమాలయాలు, ఎడారి ప్రాంతాలనుంచి గంగానదీ మైదాన ప్రాంతాల్లో ఈ ప్రయోగాత్మక పథకాలు చేపట్టారు. (మైనస్100డిగ్రీల అతిశీతల ప్రాంతాలే కాక 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే వేడి ప్రాంతాల్లో కూడా ఈ పథకాలు చేపట్టారు.) భూగర్భ జలాల ఆధారంగా చేపట్టిన బోరుబావులు, కొండల్లోని చెలిమలు, ఊటలు, భూమి ఉపరితలంపై ప్రవహించే నదులు, ఆనకట్టలు వనరులుగా ఈ పథకాలను చేపట్టారు. కొన్ని వందలమంది జనాభాతో కూడిన గ్రామాలతోపాటు, వేల సంఖ్యలో ఉన్న గ్రామాలు కూడా ఈ ప్రయోగాత్మక నీటి పథకాల పరిధిలో ఉన్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమగ్రమైన పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థను కూడా ఈ పథకాలకోసం రూపొందించారు.  రాజస్థాన్ రాష్ట్రం, సిరోహి జిల్లాలోని గ్రామీణ  ప్రాంతాల్లో ఈ వ్యవస్థలకోసం విద్యుత్ గ్రిడ్.తో సంబంధంలేకుండా సౌరశక్తి, బ్యాటరీ విద్యుత్ ను మాత్రమే వినియోగించారు.

  ఈ ప్రయోగాత్మక నీటి పథకాల్లో నీటి సరఫరాకు సంబంధించిన అన్ని అంశాలను మదింపు చేసేందుకు ప్రవాహ మీటర్లు, భూగర్భ జలమట్టం సెన్సార్లు, క్లోరిన్ విశ్లేషణ పరికరాలు, నీటి ఒత్తిడి లెక్కించే సెన్సార్లు, పంపు కంటోలర్లు తదితర పరికరాలను తెప్పించారు. సరఫరా జరిగే నీటి పరిమాణం, నాణ్యత తదితర అంశాలను పరిశీలించేందుకు, నిర్వహణా సామర్థ్యాన్ని పెంచేందుకు వీటిని వినియోగించారు.  క్లౌడ్, అనలిటిక్స్ ప్రాతిపదికతో కూడిన ఐ.ఒ.టి. ప్లాట్ ఫాంను భౌగోళిక సమాచార వ్యవస్థతో మేళవించి పటిష్టమైన వ్యవస్థకు రూపకల్పన చేశారు.

https://ci5.googleusercontent.com/proxy/A-gyWWaSn5eIxY2Zg9_ONxu2W39S8rKDhfJA1wcyhNPCXc0tstIWMbJS84mDK_-3DMLBdAvkxaDuNrQjezDXvkrWyEsg_neW7SVdvQ6GQA0B87M7ZfNrK45wsw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001X8KW.jpg

  నీటి సరఫరాలో ఎదురయ్యే అనేక సమస్యలను గుర్తించేందుకు ఈ ప్రయోగాత్మక పథకాలు ఎంతగానో దోహదపడ్డాయి. నీటి లీకేజీ, తక్కువ ఒత్తిడి తదితర సమస్యలను వెంటనే తెలుసుకుని సదరు సమస్యలను క్షేత్రస్థాయిలో అక్కడిక్కడే పరిష్కరించేందుకు వీలు కలిగించాయి. వేగంగా క్షీణిస్తున్న భూగర్భ జలమట్టాలపై ఇటీవల ఈ పథకాలు అధికారులను, గ్రామీణ సంఘాలను అప్రమత్తం చేశాయి. దీనితో గ్రామాల్లోని వారు బోరుబావులను రీచార్జి చేసుకునేలా తమ వనరులను బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ప్రజలు బాధ్యతాయుతంగా, సమర్థంగా నీటిని వినియోగించుకోవడం, లీకేజీలను పసిగట్టే డాటా ఆధారిత వ్యవస్థల సహాయంతో నిర్వహణా వ్యయాన్ని తగ్గించుకోవడం తదితర ప్రయోజనాలు కూడా ఈ ప్రయోగాత్మక పథకాల ద్వారా లభించాయి.

నీటి సరఫరాపై గ్రామాల్లో స్థానిక భాషలో సమాచారాన్ని తెలిపే ఒక డ్యాష్ బోర్డుతో టెలివిజన్ ఏర్పాటు చేస్తారు. నీటి సరఫరాలో తలెత్తే లోపాలను సరిదిద్దేందుకు గ్రామ నీటి సరఫరా పారిశుద్ధ్య కమిటీ లేదా స్థానిక పానీ సమితి తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ ఏర్పాటు అనేక సానుకూల ఫలితాలకు దారితీసింది.  ఇదివరకైతే నీటిలో క్రిమిసంహారక మందులు చల్లే ప్రక్రియ కొన్నిగ్రామాల్లో క్రమంతప్పకుండా జరిగేది కాదు. ఇపుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఐ.ఒ.టి. ఆధారిత టెలివిజన్ తెరపై పరిస్థితి తెలుసుకుంటున్న గ్రామ నీటిసరఫరా పారిశుద్ధ్య కమిటీ లేదా, పానీ సమితి పాత్ర క్రియాశీలకంగా మారింది. నీటిలో క్లోరిన్ స్థాయిలను బట్టి సదరు నీటిని ఎప్పుడు శుద్ది చేయాలన్నది కమిటీ ఎప్పటికప్పుడు నిర్దేశిస్తూవస్తోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020WRC.jpg

 

  వైఫై బ్రాడ్ బ్యాడ్ ఇంటర్నెట్ సదుపాయం, సెల్యులార్ ఫోన్ల అనుసంధానం వంటి అంశాల దష్ట్యా చూసినపుడు గ్రామీణ ప్రాంతాల్లో నీటిసరఫరా వ్యవస్థకోసం ఐ.ఒ.టి. సెన్సార్లను వినియోగించడం క్లిష్టతరమైనదే. వాస్తవానికి, గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ పరిధి కిందకు వచ్చే చాలావరకు ప్రాంతాల్లో గ్రిడ్ అనుసంధానం ఐ.ఒ.టి. పరికరాలకు తగిన విద్యుత్తును అందించే స్థాయిలో లేదు. ఐ.ఒ.టి. ఆధారిత స్మార్ట్ వాటర్ మేనేజిమెంట్ ప్రాజెక్టు (టి.సి.ఐ.టి.) సారథి సిద్ధాంత్ మాస్సన్ మాటల్లో చెప్పాలంటే,  “ఇలా గ్రిడ్ అనుసంధానం లోపించిన ప్రాంతాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్.ఎఫ్.), సెల్యులార్ కమ్యూనికేషన్ల కలయికను, సౌరశక్తి లేదా బ్యాటరీ ఆధారిత విద్యుత్ వ్యవస్థలను వినియోగించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచాలన్నా, నీటిసరఫరా వ్యవస్థల నిర్వహణా వ్యయం తక్కువస్థాయిలో ఉండేలా చూడాలన్నా డాటా ప్రసరణ ధరలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి.”,

ఈ ప్రయోగాత్మక నీటిసరఫరా పథకాల విజయానికి తగిన గుర్తింపు లభించింది. ఐ.ఒ.టి. ఆధారిత రిమోట్ పర్యవేక్షక నీటి సరఫరా వ్యవస్థలకోసం గుజరాత్, బీహార్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను చేపట్టాయి. 500 గ్రామాలనుంచి మొదలుకొని పలు జిల్లాల్లో  ఈ ప్రక్రియను చేపట్టడానికి ఆ రాష్ట్రాలు సంకల్పించాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెప్పించుకునే ప్రక్రియను సిక్కిం, మణిపూర్, గోవా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రారంభించాయి.  ఇలాంటి సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానం అమలుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర భారత్, డిజిటల్ ఇండియా, స్మార్ట్ విలేజ్ వంటి పథకాలకు నేరుగా ప్రోత్సాహం లభిస్తుంది. ఐ.ఒ.టి. ఆధారిత వ్యవస్థ దేశంలో మరింతగా పెంపొందడం స్మార్ట్ నగరాల ప్రాజెక్టులకు కూడా ఎంతగానో దొహదపడుతుంది. అలాగే, తాగునీటి సరఫరా రంగంలో ఆశించిన పెనుమార్పులు కూడా చోటుచేసుకుంటాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UBW5.jpg

 

ముందున్న మార్గం..

  భారతదేశంలో తాగునీటి సరఫరా వ్యవస్థలు ప్రస్తుతం పలు రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం, నీటి పంపుల వైఫల్యం, క్రమ పద్ధతిలేని అరాకొర నీటి సరఫరా వంటి సవాళ్లు మనకు ఎదురవుతున్నాయి. దీనితో సామాజిక, ఆర్థికపరమైన అనేక వైరుధ్యాలు, వ్యత్యాసాలు మరింత విషమంగా తయారవుతున్నాయి. మహిళలు సుదూర ప్రాంతాలనుంచి కిలోమీటర్ల తరబడి కాలినడకన నీటిని మోసుకురావాల్సి రావడం, నీటి కాలుష్యం కారణంగా వారికి పలు వ్యాధులు సంక్రమించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల వైద్యంకోసం వారి వేతనాన్ని ఖర్చుచేయాల్సి రావడం వంటి సమస్యలూ తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో, గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా పర్యవేక్షించడం ఇపుడు తక్షణ అవసరంగా మారింది. 

  ఈ నేపథ్యంలో జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) పేరిట ఒక ప్రధాన కార్యక్రమాన్ని (ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంను) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2024 సంవత్సరానికల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో కేంద్రం ఈ పథకాన్ని చేపట్టింది. తగినంత నిర్దిష్ట పరిమాణంలో నాణ్యమైన నీటిని సరఫరా చేసేందుకు డిజిటల్ వాల్, రిమోట్ కమాండ్, కంట్రోల్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ పథకం చేపట్టారు. ఒక్కొక్కరికి రోజుకు 55లీటర్ల చొప్పున నీటిని గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకు సరఫరా చేయాలన్న సంకల్పంతో జలజీవన్ మిషన్ పథకాన్ని చేపట్టారు.

 

****



(Release ID: 1708818) Visitor Counter : 233


Read this release in: English , Urdu , Marathi , Hindi