ప్రధాన మంత్రి కార్యాలయం
2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
28 MAR 2021 11:42AM by PIB Hyderabad
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం!! ఈసారి నేను 'మన్ కీ బాత్' కోసం వచ్చిన ఉత్తరాలు, వ్యాఖ్యలు, ఇన్ పుట్స్ పై నా దృష్టిని పరుగులు పెట్టించినప్పుడు చాలా మంది అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుకు తెచ్చారని గమనించాను. మైగవ్‌లో ఆర్యన్ శ్రీ గారు, బెంగళూరు నుండి అనూప్ రావు గారు, నోయిడా నుండి దేవేష్ గారు, థానే నుండి సుజిత్ గారు - వీళ్ళందరూ చెప్పారు – “మోదీ గారు.. ఈసారి 'మన్ కి బాత్' 75 వ ఎపిసోడ్. ఈ సందర్భంగా మీకు అభినందనలు” అని. ఇంత సునిశిత దృష్టితో మీరు 'మన్ కీ బాత్' ను అనుసరించినందుకు, కనెక్ట్ అయినందుకు నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నాకు చాలా గర్వకారణం. ఆనందకరమైన విషయం. నా వైపు నుండి మీకు ధన్యవాదాలు. 'మన్ కీ బాత్' శ్రోతలందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు లేకుండా ఈ ప్రయాణం సాధ్యపడేది కాదు. మనమందరం కలిసి ఈ సైద్ధాంతిక ప్రయాణాన్ని నిన్ననే ప్రారంభించామనిపిస్తుంది. ఆరోజు 2014 అక్టోబరు 3వ తేదీ విజయదశమి- ఒక పవిత్ర పర్వదినం. యాదృచ్చికంగా చూడండి- ఈ రోజు కామ దహనం జరుపుకుంటున్నాం. ఒక్క దీపంతో కాలిపోయి, మరోవైపు దేశం ప్రకాశించాలి. ఈ భావనతో ప్రయాణిస్తూ మనం ఈ మార్గాన్ని నిర్ధారించాం.
దేశంలోని ప్రతి మూలలోని ప్రజలతో మేం సంభాషించాం. వారి అసాధారణమైన పనుల గురించి తెలుసుకున్నాం. మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఎలాంటి అపూర్వమైన సామర్థ్యం ఉందో కూడా మీరు అనుభవించి ఉండాలి. భారతమాత ఒడిలో ఎంత అద్భుతమైన రత్నాలు పెరుగుతున్నాయి! ఒక సమాజాన్ని చూడడం, సమాజాన్ని తెలుసుకోవడం, సమాజ సామర్థ్యాన్ని గుర్తించడం నాకు ఒక అద్భుతమైన అనుభవం. ఈ 75 ఎపిసోడ్ల ద్వారా ఎన్ని అంశాలను చర్చించుకున్నాం! కొన్నిసార్లు నదుల గురించి, కొన్నిసార్లు హిమాలయాల శిఖరాల గురించి, కొన్నిసార్లు ఎడారుల విషయం, కొన్నిసార్లు ప్రకృతి విపత్తు విషయం, కొన్నిసార్లు మానవ సేవకు సంబంధించిన అసంఖ్యాక కథల అనుభూతి, కొన్నిసార్లు సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణ, కొన్నిసార్లు మనకు తెలియని మారుమూల ప్రాంతంలో ఏదో ఒక విషయాన్ని చేసి చూపించే అంశం.. ఇలా ఎన్నో విషయాలను చర్చించాం. పరిశుభ్రతకు సంబంధించిన విషయం, మన వారసత్వ పరిరక్షణ- ఇవి మాత్రమే కాదు, బొమ్మలు తయారుచేసే విషయం కూడా. చర్చించని విషయం ఏముంది? మనం లెక్కలేనన్ని అంశాలను చర్చించాం. భారతదేశ నిర్మాణంలో భాగస్వాములైన గొప్ప వ్యక్తులకు సందర్భానుసారం నివాళి అర్పించాం. వారి గురించి తెలుసుకున్నాం. అనేక అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించాం. వారి నుండి ప్రేరణ పొందటానికి ప్రయత్నించాం. మీరు నాకు చాలా విషయాలు చెప్పారు. చాలా ఆలోచనలు ఇచ్చారు. ఒక విధంగా ఈ ఆలోచన ప్రయాణంలో మీరు కలిసి నడిచారు. అనుసంధానమయ్యారు. కొత్త విషయాలను జోడించారు. 'మన్ కీ బాత్' ను విజయవంతం చేసినందుకు, సుసంపన్నం చేసినందుకు, ఈ కార్యక్రమంతో కనెక్ట్ అయినందుకు ఈ రోజు- ఈ 75 వ ఎపిసోడ్ సమయంలో- ప్రతి శ్రోతకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఒకవైపు 75 వ 'మన్ కీ బాత్'లో మాట్లాడే అవకాశం. మరోవైపు 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలు 'అమృత్ మహోత్సవ్' ఈ నెలలోనే ప్రారంభం కావడం. అమృత్ మహోత్సవ్ దండి యాత్ర రోజు నుండి ప్రారంభమైంది. 2023 ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. 'అమృత్ మహోత్సవ్'కు సంబంధించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిరంతరం జరుగుతున్నాయి. ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమాల చిత్రాలను, సమాచారాన్ని పంచుకుంటున్నారు. జార్ఖండ్‌కు చెందిన నవీన్ గారు ఇలాంటి కొన్ని చిత్రాలతో పాటు నాకు ఒక సందేశాన్ని నమోఆప్‌లో పంపారు. తాను 'అమృత్ మహోత్సవ్' కార్యక్రమాలను చూశానని, తాను కూడా స్వాతంత్య్ర సంగ్రామంతో సంబంధం ఉన్న కనీసం 10 ప్రదేశాలను సందర్శించాలని నిర్ణయించుకున్నానని ఆయన రాశారు. ఆయన జాబితాలో మొదటి పేరు భగవాన్ బిర్సా ముండా జన్మస్థలం. జార్ఖండ్‌కు చెందిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల కథలను దేశంలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తామని నవీన్ రాశారు. మీ ఆలోచనకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను నవీన్ గారూ.
మిత్రులారా! ఎవరైనా స్వాతంత్ర్య సమరయోధుడి గాథ కావచ్చు. ఒక ప్రదేశం చరిత్ర కావచ్చు. దేశ సాంస్కృతిక కథ కావచ్చు. 'అమృత్ మహోత్సవ్' సందర్భంగా మీరు దానిని ప్రస్తావనకు తీసుకురావచ్చు. అది దేశ ప్రజలను అనుసంధానించే మాధ్యమంగా మారవచ్చు. చూస్తూ ఉండగానే 'అమృత్ మహోత్సవ్' చాలా ఉత్తేజకరమైన అమృత బిందువులతో నిండి పోతుంది. ఆపై అలాంటి అమృత ధార ప్రవహిస్తుంది. ఇది భారతదేశ స్వాతంత్య్రం వచ్చిన వంద సంవత్సరాల వరకు మనకు స్ఫూర్తినిస్తుంది. దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళుతుంది. ఏదైనా చేయాలనే అభిరుచిని ఏర్పరుస్తుంది. దేశం కోసం త్యాగం చేయడాన్ని, బలిదానాలను తమ కర్తవ్యంగా మన స్వాతంత్ర్య సమర యోధులు భావించారు. అందుకే ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారు. వారి త్యాగం, బలిదానాల కథలు మనలను కర్తవ్య పథం వైపు ప్రేరేపిస్తాయి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లుగా -
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హయకర్మణ:
అదే మనోభావంతో మనమందరం మన విధులను పూర్తి నిష్ఠతో నిర్వహించాలి. మనం కొత్త నిర్ణయాలు తీసుకోవడమే 'అమృత్ మహోత్సవ్' లక్ష్యం. ఆ నిర్ణయాల నుండి ఫలితం పొందేందుకు మనస్ఫూర్తిగా పాల్గొనండి. ఆ సంకల్పం సమాజానికి మంచి చేసేది కావాలి. ఆ సంకల్పం దేశం బాగు కోసం, భారతదేశం ఉజ్వల భవిష్యత్తు కోసం ఉండాలి. ఆ తీర్మానంలో మన విధులు కూడా ఉండాలి. మన బాధ్యతలు ఉండాలి. భగవద్గీతను అనుసరించడానికి ఇది సువర్ణావకాశమని నేను నమ్ముతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! గత సంవత్సరంలో ఇదే మార్చినెలలో దేశం జనతా కర్ఫ్యూ అనే పదాన్ని తొలిసారిగా విన్నది. కానీ ఈ గొప్ప దేశం లోని గొప్ప విషయాల గొప్ప శక్తి అనుభవాన్ని చూడండి. జనతా కర్ఫ్యూ మొత్తం ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించింది. ఇది క్రమశిక్షణకు అపూర్వమైన ఉదాహరణ. రాబోయే తరాలు ఖచ్చితంగా ఈ విషయం గురించి తప్పకుండా గర్వపడతాయి. అదే విధంగా కరోనా యోధులకు గౌరవం, వారిని ఆదరించడం, ప్లేట్లను(పళ్లాలను) కొట్టడం, చప్పట్లు కొట్టడం, దీపం వెలిగించడం.. ఇవన్నీ కరోనా యోధుల హృదయాన్ని ఎంతగా తాకాయో మీరు ఊహించలేరు. ఏడాది పొడవునా వారు అలసట లేకుండా నిరంతరాయంగా పనిచేయడానికి కారణం అదే. దేశంలోని ప్రతి పౌరుడి ప్రాణాలను కాపాడడానికి వారు తమ ప్రాణాలకు తెగించి కష్టపడ్డారు. గత సంవత్సరం ఈ సమయంలో కరోనా వ్యాక్సిన్ ఎప్పటివరకు వస్తుందనేది ప్రశ్నగా ఉండేది. మిత్రులారా! ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం మనందరికీ గర్వకారణం. టీకా కార్యక్రమం ఛాయాచిత్రాల గురించి భువనేశ్వర్‌కు చెందిన పుష్ప శుక్లా గారు నాకు రాశారు. టీకా తీసుకోవడంపై వృద్ధులు చూపిన ఉత్సాహం గురించి 'మన్ కి బాత్' లో నేను చర్చించాలని వారు అన్నారు. మిత్రులారా! నిజమే. దేశంలోని ప్రతి మూల నుండి మనం అలాంటి వార్తలను వింటున్నాం. మన హృదయాలను తాకే అలాంటి చిత్రాలను చూస్తున్నాం. యూపీలోని జౌన్‌పూర్‌లో 109 ఏళ్ల వృద్ధురాలు రామ్ దులైయా గారు టీకా తీసుకున్నారు. ఢిల్లీ లో కూడా 107 ఏళ్ల కేవల్ కృష్ణ గారు టీకా తీసుకున్నారు. హైదరాబాద్‌లో 100 సంవత్సరాల వయసున్న జై చౌదరి టీకా తీసుకోవాడమే కాకుండా అందరూ టీకా తప్పనిసరిగా తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి కూడా చేశారు. టీకాలు వేసిన తర్వాత ప్రజలు తమ పెద్దల ఫోటోలను ఎలా అప్‌లోడ్ చేస్తున్నారో నేను ట్విట్టర్ లో, ఫేస్‌బుక్‌లో చూస్తున్నాను. కేరళకు చెందిన ఆనందన్ నాయర్ అనే యువకుడు దీనికి 'వాక్సిన్ సేవ' అనే కొత్త పదాన్ని ఇచ్చారు. ఇలాంటి సందేశాలను ఢిల్లీ కి చెందిన శివానీ, హిమాచల్ నుండి హిమాన్షు , ఇంకా చాలా మంది ఇతర యువకులు పంపారు. మీ శ్రోతలందరి అభిప్రాయాలను నేను అభినందిస్తున్నాను. వీటన్నిటి మధ్యలో కరోనాతో పోరాట మంత్రాన్ని గుర్తుంచుకోండి- ‘మందులు కూడా- కఠినమైన ముందు జాగ్రత్తలు కూడా’ - 'దవాయీ భీ - కడాయి భీ'. మనం జీవించాలి. మాట్లాడాలి. చెప్పాలి. మందులతో పాటు కఠిన నియమాలను కూడా పాటించాలని. దీనికి మనం కట్టుబడి ఉండాలి.
నా ప్రియమైన దేశవాసులారా! ఇండోర్‌లో నివసిస్తున్న సౌమ్య గారికి ఈ రోజు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఒక విషయం లో ఆమె నా దృష్టిని ఆకర్షించారు. దాన్ని మన్ కి బాత్ లో ప్రస్తావించమని కోరారు. ఈ అంశం క్రికెటర్ మిథాలీ రాజ్ గారి కొత్త రికార్డు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీ గారు ఇటీవల రికార్డు సాధించారు. ఇందుకు మిథాలీ రాజ్ గారికి చాలా చాలా అభినందనలు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఏడు వేల పరుగులు చేసిన ఏకైక అంతర్జాతీయ మహిళా క్రీడాకారిణి ఆమె. మహిళల క్రికెట్ రంగంలో ఆమె అందించిన సేవలు చాలా గొప్పవి. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో మిథాలీ రాజ్ లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు. ఆమె కఠోర శ్రమ, విజయ గాథ మహిళా క్రికెటర్లకు మాత్రమే కాదు- పురుష క్రికెటర్లకు కూడా ప్రేరణగా నిలుస్తుంది.
మిత్రులారా! ఇది ఆసక్తికరంగా ఉంది ఇదే మార్చి నెలలో మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు చాలా మంది మహిళా క్రీడాకారులు పతకాలు, రికార్డులు సాధించారు. ఢిల్లీ లో జరిగిన ISSF ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత్ అగ్రస్థానంలో ఉంది. బంగారు పతకాల సంఖ్య పరంగా కూడా భారత్ ముందుంది. భారత దేశానికి చెందిన మహిళా షూటర్లు, పురుష షూటర్ల గొప్ప ప్రదర్శన కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది. బిడబ్ల్యుఎఫ్ స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్‌లో పివి సింధు రజత పతకం సాధించారు. చదువు నుండి సంస్థల వ్యవస్థాపకత వరకు, సాయుధ దళాల నుండి సైన్స్ & టెక్నాలజీ వరకు, దేశంలోని ఆడపిల్లలు తమదైన గుర్తింపును పొందుతున్నారు. యువతులు క్రీడలను తమ గమ్యస్థానంగా చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రొఫెషనల్ ఛాయిస్‌గా క్రీడలు అభివృద్ధి చెందుతున్నాయి.
నా ప్రియమైన దేశవాసులారా! కొంతకాలం క్రితం జరిగిన మారిటైమ్ ఇండియా సమ్మిట్ మీకు గుర్తుందా? ఈ శిఖరాగ్ర సమావేశంలో నేను చెప్పిన విషయం మీకు గుర్తుందా? సహజమే.. చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇన్నింటి మధ్యలో ప్రతి విషయం ఎలా గుర్తుంటుంది? ప్రతి విషయమూ ఎలా గుర్తుకు వస్తుంది? ఎక్కువ శ్రద్ధ ఎలా ఉంటుంది? ఇది సహజం. కానీ నా అభ్యర్ధనలలో ఒకదాన్ని గురు ప్రసాద్ గారు ఎంతో ఆసక్తితో ముందుకు తీసుకెళ్లడం నాకు నచ్చింది. దేశంలోని లైట్ హౌస్ కాంప్లెక్స్‌ల చుట్టూ పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేయడం గురించి ఈ శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడాను. తమిళనాడులోని రెండు లైట్ హౌస్ లు - చెన్నై లైట్ హౌస్, మహాబలిపురం లైట్ హౌస్ లకు 2019లో తాను జరిపిన పర్యటన గురించి గురు ప్రసాద్ గారు తన అనుభవాలను పంచుకున్నారు. ‘మన్ కీ బాత్’ శ్రోతలను కూడా ఆశ్చర్యపరిచే చాలా ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ఉదాహరణకు ఎలివేటర్ ఉన్న ప్రపంచంలోని కొన్ని లైట్ హౌస్‌లలో చెన్నై లైట్ హౌస్ ఒకటి. ఇది మాత్రమే కాదు.. భారతదేశంలో నగర పరిధిలో ఉన్న ఏకైక లైట్ హౌస్ ఇది. ఇందులో విద్యుత్ కోసం సోలార్ ప్యానెళ్లు కూడా ఉన్నాయి. మెరైన్ నావిగేషన్ చరిత్రను తెలిపే లైట్ హౌస్ హెరిటేజ్ మ్యూజియం గురించి కూడా గురు ప్రసాద్ గారు తెలిపారు. మ్యూజియంలో నూనెతో వెలిగే దీపాలను, కిరోసిన్ లైట్లను, పెట్రోలియం ఆవిరి దీపాలను, పాతకాలపు విద్యుత్ దీపాలను ప్రదర్శిస్తారు. భారతదేశపు పురాతన లైట్ హౌస్ - మహాబలిపురం లైట్ హౌస్ గురించి గురు ప్రసాద్ గారు వివరంగా రాశారు. ఈ లైట్ హౌస్ పక్కన పల్లవ రాజు మొదటి మహేంద్ర వర్మ వందల సంవత్సరాల క్రితం నిర్మించిన 'ఉల్కనేశ్వర' ఆలయం ఉందని ఆయన అంటున్నారు.
మిత్రులారా! 'మన్ కి బాత్' సందర్భంగా పర్యాటక రంగం గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. కాని, ఈ లైట్ హౌస్‌లు పర్యాటక పరంగా ప్రత్యేకమైనవి. అద్భుతమైన నిర్మాణాల కారణంగా లైట్ హౌసెస్ ప్రజలను ఎల్లప్పుడూ ఆకర్షించే కేంద్రాలుగా ఉన్నాయి. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంలో 71 లైట్ హౌజులను ఎంపిక చేశాం. మ్యూజియం, యాంఫి-థియేటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫలహారశాల, పిల్లల పార్కు, ఎకో ఫ్రెండ్లీ కాటేజీలు, ల్యాండ్ స్కేపింగ్ ఈ అన్ని లైట్ హౌజులలో ఏర్పాటవుతాయి. లైట్ హౌజుల గురించి చర్చిస్తున్నాం కాబట్టి ఒక ప్రత్యేకమైన లైట్ హౌస్ గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ లైట్ హౌస్ గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లాలో జింఝు వాడా అనే ప్రదేశంలో ఉంది. ఈ లైట్ హౌస్ ఎందుకు ప్రత్యేకమైనదో మీకు తెలుసా? సముద్ర తీరం ఈ లైట్ హౌస్ ఉన్న ప్రదేశానికి వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది. ఇక్కడ ఏదో ఒక సమయంలో ఒక ఓడరేవు ఉందనేందుకు సాక్ష్యంగా ఈ గ్రామంలో మీకు అలాంటి రాళ్ళు కూడా కనిపిస్తాయి. అంటే అంతకుముందు తీరప్రాంతం జింఝు వాడా వరకు ఉండేది. సముద్రం అలలు పైకి లేవడం, వెనుకకు పోవడం, ఇంత దూరం వెళ్ళడం కూడా దాని రూపాల్లో ఒకటి. ఈ నెలలో జపాన్‌లో సంభవించిన భారీ సునామీకి 10 సంవత్సరాలు. ఈ సునామీలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఒక సునామీ 2004 లో భారతదేశంలో సంభవించింది. అండమాన్ నికోబార్లలో, తమిళనాడులో లైట్ హౌజుల్లో పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులను సునామీ సమయంలో కోల్పోయాం. కష్టపడి పనిచేసే ఈ లైట్ కీపర్లకు నేను సగౌరవంగా నివాళి అర్పిస్తున్నాను. లైట్ కీపర్ల పనిని నేను ప్రశంసిస్తున్నాను.
ప్రియమైన దేశవాసులారా! కొత్తదనం, ఆధునికత జీవితంలోని ప్రతి రంగంలోనూ అవసరం. లేకపోతే అది కొన్నిసార్లు మనకు భారంగా మారుతుంది. భారతదేశ వ్యవసాయ ప్రపంచంలో ఆధునికత- ఇది నేటి కాలపు డిమాండ్. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం చాలా సమయాన్ని నష్టపోయాం. వ్యవసాయ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి సాంప్రదాయ వ్యవసాయంతో పాటు కొత్త ఎంపికలు, కొత్త ఆవిష్కరణలను అవలంబించడం కూడా అంతే అవసరం. శ్వేత విప్లవం సందర్భంగా దేశం దీనిని అనుభవించింది. ఇప్పుడు తేనెటీగల పెంపకం అటువంటి ఎంపికగా ఉంది. తేనెటీగల పెంపకం దేశంలో తేనె విప్లవం లేదా తీపి విప్లవానికి ఆధారం. పెద్ద సంఖ్యలో రైతులు అందులో చేరారు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో గుర్ దుం అనే గ్రామం ఉంది. ఇక్కడి పర్వతాలు ఎత్తయినవి. భౌగోళిక సమస్యలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడి ప్రజలు తేనెటీగల పెంపకం పనిని ప్రారంభించారు. ఈ ప్రదేశంలో తయారుచేసిన తేనెకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. తేనె వల్ల రైతుల ఆదాయం కూడా పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ ప్రాంతాల సహజ సేంద్రీయ తేనెను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టపడతారు. నాకు గుజరాత్ నుండి అలాంటి ఒక వ్యక్తిగత అనుభవం కూడా ఉంది. గుజరాత్‌లోని బనాస్ కాంఠ లో 2016 లో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయని ఆ కార్యక్రమంలో నేను ప్రజలకు చెప్పాను. “బనాస్ కాంఠ రైతులు తీపి విప్లవంలో కొత్త అధ్యాయాన్ని ఎందుకు రాయకూడదు?” అని అడిగాను. మీకు ఈ విషయం తెలుసుకోవడం ఆనందంగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో బనాస్ కాంఠ తేనె ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారింది. బనాస్ కాంఠ రైతులు తేనె నుండి ఏటా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాంటి ఒక ఉదాహరణ హర్యానాలోని యమునా నగర్‌లో కూడా ఉంది. యమునా నగర్ లో రైతులు తేనెటీగ పెంపకం ద్వారా సంవత్సరానికి అనేక వందల టన్నుల తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. వారి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. రైతుల ఈ కృషి ఫలితంగా దేశంలో తేనె ఉత్పత్తి నిరంతరం పెరుగుతోంది. ఏటా దాదాపు లక్ష ఇరవై ఐదువేల టన్నులకు చేరుకుంది. అందులో అధిక మొత్తంలో తేనె విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది.
మిత్రులారా! తేనెటీగ పెంపకంలో ఆదాయం కేవలం తేనె నుండి మాత్రమే కాదు. తేనెటీగ మైనం -బీ వాక్స్ - కూడా చాలా పెద్ద ఆదాయ వనరు. మందుల పరిశ్రమ, ఆహార పరిశ్రమ, వస్త్ర, సౌందర్య ఉపకరణాల పరిశ్రమలలో ప్రతిచోటా దీనికి డిమాండ్ ఉంది. మన దేశం ప్రస్తుతం తేనెటీగ మైనాన్ని దిగుమతి చేస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. అంటే ఒక విధంగా మనం ఆత్మ నిర్భర భారత ప్రచారానికి సహకరిస్తున్నాం. ప్రపంచం మొత్తం ఆయుర్వేదం, సహజ ఆరోగ్య ఉత్పత్తుల వైపు చూస్తోంది. అటువంటి పరిస్థితిలో తేనె కోసం డిమాండ్ మరింత వేగంగా పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, తేనె కోసం డిమాండ్ మరింత వేగంగా పెరుగుతోంది. దేశంలోని ఎక్కువ మంది రైతులు తమ వ్యవసాయంతో పాటు తేనెటీగ పెంపకం కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతుంది. వారి జీవితాలకు తీపిని కూడా ఇస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! కొద్ది రోజుల క్రితం ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకున్నాం. మన ఇళ్ల గోడలపై, చుట్టుపక్కల చెట్లపై పక్షులు ఉండేవి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం పిట్టలను చూశామని చెప్పడం ద్వారా ఇప్పుడు ప్రజలు పక్షులను గుర్తు తెచ్చుకుంటారు. ఈ రోజు మనం వాటిని కాపాడటానికి ప్రయత్నాలు చేయాలి. నా బెనారస్ సహచరుడు ఇంద్రపాల్ సింగ్ బత్రా గారు అలాంటి పని చేశారు. ఈ విషయాన్ని నేను మన్ కి బాత్ శ్రోతలకు చెప్పాలనుకుంటున్నాను. బత్రా తన ఇంటిని పక్షుల నివాసంగా చేసుకున్నారు. అతను తన ఇంట్లో పక్షులు సులభంగా ఉండేందుకు వీలయ్యే చెక్క గూళ్ళను నిర్మించారు. బెనారస్ లో అనేక ఇళ్ళు ఈ ప్రచారంలో చేరాయి. ఇది ఇళ్లలో అద్భుతమైన సహజ వాతావరణాన్ని కూడా సృష్టించింది. ప్రకృతి, పర్యావరణం, జంతువులు, పక్షుల కోసం మనం కూడా ప్రయత్నాలు చేయాలి. అలాంటి మరో సహచరుడు బిజయ్ కుమార్ కాబీ గారు. బిజయ్ గారు ఒడిషాలోని కేంద్రపారాకు చెందినవారు. కేంద్రపారా సముద్ర ఒడ్డున ఉంది. అందువల్ల ఈ జిల్లాలో సముద్ర అలల తాకిడికి, తుఫానుకు గురయ్యే గ్రామాలు చాలా ఉన్నాయి. ఇది కొన్ని సమయాల్లో చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ప్రకృతి విపత్తును ప్రకృతి మాత్రమే ఆపగలదని బిజయ్ గారు అభిప్రాయపడ్డారు. అప్పుడు బిజయ్ గారు తన ఉద్యమాన్ని బడాకోట్ గ్రామం నుండి ప్రారంభించారు. పన్నెండు సంవత్సరాలు- మిత్రులారా! పన్నెండు సంవత్సరాలు- కష్టపడి కష్టపడి పనిచేసి గ్రామం నుండి సముద్రం వైపు 25 ఎకరాల మడ అడవులను తయారు చేశారు. ఈ రోజు ఆ అడవి ఆ గ్రామాన్ని కాపాడుతోంది. ఒడిషాలోని పారదీప్ జిల్లాలో అమ్రేష్ సామంత్ అనే ఇంజనీరు ఇలాంటి పని చేశారు. అమ్రేష్ గారు చిన్న అడవులను నాటారు. దాని నుండి ఈరోజు అనేక గ్రామాలకు రక్షణ లభిస్తోంది.
మిత్రులారా! ఈ రకమైన కృషిలో మనం కూడా భాగస్వాములమైతే పెద్ద ఎత్తున మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో బస్సు కండక్టర్ గా పనిచేసే మరిముత్తు యోగనాథన్‌గారి కృషి గురించి చెప్పుకుందాం. యోగనాథన్ తన బస్సులోని ప్రయాణికులకు టిక్కెట్లు ఇస్తారు. వాటితో పాటు ఒక మొక్కను కూడా ఉచితంగా ఇస్తారు. ఈ విధంగా, యోగనాథన్ గారు ఎన్ని చెట్లు నాటారో తెలియదు. ఈ పనిలో యోగనాథన్ తన జీతంలో చాలా భాగాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఇది విన్న తరువాత మరిముత్తు యోగనాథన్ కృషిని మెచ్చుకోని పౌరుడు ఎవరైనా ఉంటారా? ఆయన చేస్తున్న ఉత్తేజకరమైన పనికి, ఆయన ప్రయత్నాలకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! మనమందరం వ్యర్థాల నుండి బంగారం లేదా కచరా నుండి కాంచనాన్ని తయారు చేయడం గురించి చూశాం.. విన్నాం. మనం కూడా ఇతరులకు చెబుతూనే ఉన్నాం. అదే విధంగా వ్యర్థాలను విలువగా మార్చే పని కూడా జరుగుతోంది. అలాంటి ఒక ఉదాహరణ కేరళలోని కొచ్చిలో ఉన్న సెయింట్ తెరెసా కళాశాల. నాకు గుర్తు- 2017 లో నేను ఈ కళాశాల ప్రాంగణంలో ఒక పుస్తక పఠన కార్యక్రమానికి హాజరయ్యాను. ఈ కళాశాల విద్యార్థులు పునర్వినియోగ బొమ్మలను తయారు చేస్తున్నారు- అది కూడా చాలా సృజనాత్మకంగా. ఈ విద్యార్థులు బొమ్మలు తయారు చేయడానికి పాత బట్టలు, పడేసిన చెక్క ముక్కలు, సంచులు , పెట్టెలను ఉపయోగిస్తున్నారు. ఒక విద్యార్థి ఒక పజిల్ ను తయారు చేస్తే మరి కొందరు కారు, రైలును తయారు చేస్తున్నారు. బొమ్మలు సురక్షితంగా ఉండటంతో పాటు పిల్లలకు స్నేహపూర్వకంగా ఉండడంపై ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఈ మొత్తం కృషిలో మంచి విషయం ఏమిటంటే ఈ బొమ్మలను అంగన్వాడీ పిల్లలకు ఆడడానికి ఇస్తారు. బొమ్మల తయారీలో దేశం ప్రగతి సాధించడంలో వ్యర్థాల నుండి విలువ రాబట్టే ఈ ఉద్యమాలు, ఈ వినూత్న ప్రయోగాలు చాలా ముఖ్యమైనవి.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రొఫెసర్ శ్రీనివాస్ పదకాండ్ల గారు చాలా ఆసక్తికరమైన పని చేస్తున్నారు. ఆయన వాహనాల తుక్కు నుండి శిల్పాలను సృష్టించారు. ఆయన రూపొందించిన ఈ భారీ శిల్పాలను పబ్లిక్ పార్కులలో ఏర్పాటు చేశారు. ప్రజలు వాటిని ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఎలక్ట్రానిక్ , ఆటోమొబైల్ రంగాల్లోని వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంలో ఇది ఒక వినూత్న ప్రయోగం. కొచ్చి, విజయవాడలలో జరుగుతున్న ఈ ప్రయత్నాలను నేను మరోసారి అభినందిస్తున్నాను. ఇలాంటి కృషిలో పాల్గొనేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశ వాసులారా! భారతదేశ ప్రజలు ప్రపంచంలోని ఏ మూలకు వెళ్ళినా తాము భారతీయులమని గర్వంగా చెప్తారు. మన యోగా, ఆయుర్వేదం, తత్వశాస్త్రం – ఇలా మన దగ్గర లేనిది ఏముంది? ఈ విషయాలలో మనకు చాలా గర్వంగా ఉంటుంది. అలాగే మన స్థానిక భాష, మాండలికం, గుర్తింపు, శైలి, అన్నపానీయాల గురించి కూడా గర్వపడుతున్నాం. మనం కొత్తవి స్వీకరించాలి. అదే జీవితం. కానీ అదే సమయంలో ప్రాచీనతను, సాంప్రదాయాలను కోల్పోకూడదు. మన చుట్టూ ఉన్న అపారమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, కొత్త తరానికి అందించడానికి మనం కృషి చేయాలి. అస్సాంలో నివసించే సికారి టిస్సౌ చాలా అంకితభావంతో దీన్ని చేస్తున్నారు. కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాకు చెందిన సికారి టిస్సౌ గారు గత 20 సంవత్సరాలుగా కార్బీ భాషను డాక్యుమెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ కార్బీ భాష గిరిజన తోబుట్టువుల భాష. కార్బీ నేడు ప్రధాన స్రవంతి నుండి కనుమరుగవుతోంది. సికారి టిస్సౌ గారు తమ గుర్తింపును కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన చేసిన ప్రయత్నాల వల్ల కార్బీ భాష డాక్యుమెంటేషన్ చాలావరకు పూర్తయింది. ఆయన చేసిన కృషికి ప్రశంసలు అందుకున్నారు. అవార్డులు కూడా పొందారు. సికారి టిస్సౌ గారిని 'మన్ కి బాత్' ద్వారా నేను అభినందిస్తున్నాను. దేశంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి అనేక మంది అన్వేషకులు ఏదో ఒక రంగంలో కృషి చేస్తూనే ఉన్నారు. నేను వారందరినీ అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఏదైనా కొత్త ప్రారంభం ఎప్పుడూ చాలా ప్రత్యేకమైంది. కొత్త ప్రారంభం అంటే కొత్త అవకాశాలు - కొత్త ప్రయత్నాలు. కొత్త ప్రయత్నాలు అంటే కొత్త శక్తి, కొత్త ఉత్సాహం. అందువల్లనే వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలలో వైవిధ్యంతో నిండిన మన సంస్కృతిలో ఏదైనా ప్రారంభాన్ని వేడుకగా జరుపుకోవడం సంప్రదాయం. ఈ సమయం కొత్త ఆరంభాలు, కొత్త పండుగలకు నాంది. వసంతాన్ని పండుగగా జరుపుకోవడం హోలీ సంప్రదాయం. మనం హోలీని రంగులతో జరుపుకునే సమయంలో- అదే సమయంలో- వసంతకాలం కూడా. కొత్త రంగులు మన చుట్టూ ఉన్నాయి. ఈ సమయంలో పూలు వికసించడం ప్రారంభిస్తాయి. ప్రకృతి సజీవమౌతుంది. త్వరలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలు కూడా జరుగుతాయి. ఉగాది లేదా పుథండు, గుడి పడ్వా లేదా బిహు, నవ్రేహ్ లేదా పోయిలా, బోయిషాక్ లేదా బైసాఖి – పండుగ ఏదైనా దేశం మొత్తం అధిక ఉత్సాహం, కొత్త ఆశల రంగులో తడిసిపోతుంది. అదే సమయంలో కేరళ విషు అనే చక్కటి పండుగను కూడా జరుపుకుంటుంది. దీని తరువాత త్వరలో చైత్ర నవరాత్రి పవిత్ర సందర్భం కూడా వస్తుంది. చైత్ర మాసం తొమ్మిదవ రోజు మనకు శ్రీరామ నవమి పండుగ ఉంటుంది. ఇది భగవాన్ శ్రీరాముడి జన్మదినం. న్యాయం, పరాక్రమాల కొత్త శకానికి నాంది. ఈ సమయంలో చుట్టూ ఉత్సాహకరమైన, భక్తితో నిండిన వాతావరణం ఉంటుంది. ఇది ప్రజలను దగ్గరికి కలుపుతుంది. వారిని కుటుంబంతో, సమాజంతో సాన్నిహిత్యం చేస్తుంది. పరస్పర సంబంధాలను బలపరుస్తుంది. ఈ ఉత్సవాల సందర్భంగా దేశవాసులందరినీ అభినందిస్తున్నాను.
మిత్రులారా! ఈ సమయంలో ఏప్రిల్ 4 వ తేదీన దేశం ఈస్టర్ పండుగను కూడా జరుపుకుంటుంది. ఈస్టర్ పండుగ సందర్భంగా యేసుక్రీస్తు పునరుత్థానం వేడుకగా జరుపుకుంటారు. ప్రతీకాత్మకంగా ఈస్టర్ పండుగ జీవితపు కొత్త ప్రారంభంతో ముడిపడి ఉంది. ఈస్టర్ ఆశయాల పునరుత్థానానికి ప్రతీక. ఈ పవిత్రమైన పర్వదిన సందర్భంగా కేవలం భారతదేశంలోని క్రైస్తవులను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు 'మన్ కీ బాత్'లో 'అమృత్ మహోత్సవ్ 'గురించి, దేశం కోసం మన కర్తవ్యాల గురించి మాట్లాడుకున్నాం. ఇతర పండుగలు, పర్వదినాల గురించి కూడా చర్చించాం. త్వరలో మన రాజ్యాంగ హక్కులు, విధులను గుర్తుచేసే మరో పండుగ రాబోతోంది. అది ఏప్రిల్ 14 - డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం. ఈసారి 'అమృత్ మహోత్సవ్'లో ఈ సందర్భం మరింత ప్రత్యేకమైంది. బాబా సాహెబ్ గారి ఈ పుట్టినరోజును మనం చిరస్మరణీయంగా జరుపుకుంటామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మన కర్తవ్యాలను పాటిస్తామని సంకల్పం చేసుకుని, బాబాసాహెబ్ కు నివాళి అర్పించాలి. ఈ నమ్మకంతో మీకు మరోసారి పర్వదినాల శుభాకాంక్షలు.
మీరందరూ సంతోషంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. ఉల్లాసంగా ఉండండి. ఈ కోరికతో ‘మందులు కూడా- కఠినమైన ముందు జాగ్రత్తలు కూడా’ అనే నినాదాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.
*****
(Release ID: 1708187)
Visitor Counter : 364
Read this release in:
Malayalam
,
Gujarati
,
Assamese
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada