ఆర్థిక మంత్రిత్వ శాఖ

జార్ఖండ్‌లో ఆదాయపన్ను విభాగం సోదాలు

Posted On: 22 MAR 2021 2:10PM by PIB Hyderabad

జార్ఖండ్‌లోని ఓ గ్రూపు సంస్థల్లో ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు ఆదాయపన్ను అధికారులు తనిఖీలు చేపట్టారు. స్పాంజ్ ఐరన్, ఎంఎస్ ఇంగోట్లు, ఎంఎస్ రాడ్లు, టీఎంటీ బార్ల తయారీ, అమ్మకాలు, పెట్రోల్‌ బంకుల డీలర్‌షిప్‌లను ఈ గ్రూపు నిర్వహిస్తోంది. ఈ గ్రూపునకు చెందిన 20 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ తనిఖీలు జరిగాయి.

    సరుకు తయారీ, అమ్మకాలను ఈ గ్రూపు ఖాతా పుస్తకాల్లో నమోదు చేయడం లేదు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి డొల్ల సంస్థల నెట్‌వర్కును ఈ గ్రూపు సృష్టించింది. రూ.185 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఉత్పత్తి సహా అనేక ప్రాథమిక ఆధారాలు అధికారులకు లభించాయి. లెక్కల్లో చూపని లావాదేవీల వివరాలు ఉన్న డిజిటల్‌ ఆధారాలు అధికారులకు దొరకగా, వాటిని విశ్లేషించారు. దీంతో, వాస్తవ ఉత్పత్తి వివరాలన్నీ తెలిశాయి.

    ఈ గ్రూపు ఉత్పత్తులను భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఉపయోగిస్తుండగా, లెక్కల్లో చూపని ఉత్పత్తిని తూర్పు భారతదేశంలో నగదుకు అమ్ముతున్నారు. కోల్‌కతా ఆధారిత డొల్ల సంస్థల ద్వారా వాటా మూలధనం, అప్పుల రూపంలో ఆ నగదును తిరిగి పొందుతున్నారు. ఆస్తులు, ఖరీదైన వ్యక్తిగత వస్తువుల కొనుగోలు కోసం కూడా ఆ డబ్బును వాడుతున్నారు.

    లెక్కల్లో చూపని దాదాపు రూ.100 కోట్లను, కోల్‌కతా ఆధారిత డొల్ల సంస్థల ద్వారా, అత్యధిక ప్రీమియంతో కూడిన వాటా మూలధనం రూపంలో ఈ గ్రూపు వెనక్కు తీసుకొచ్చిందని ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ డొల్ల సంస్థలకు జారీ చేసిన అసలు వాటా పత్రాలు కూడా సంస్థ కార్యాలయాల్లో లభించాయి. అసలు ఆ వాటాదారులే లేరని అధికారుల దర్యాప్తులో తేలింది.
    
    కోల్‌కతా డొల్ల సంస్థల నుంచి సుమారు రూ.25 కోట్ల రుణాలను ఈ గ్రూపు పొందినట్లు లెక్కల్లో చూపారు. లెక్కల్లోకి రాని సొంత డబ్బునే ఈ రూపంలో వెనక్కు తెచ్చినట్లు స్పష్టమవుతోంది. రూ.30 కోట్ల విలువైన నకిలీ లాభాలను కూడా ఈ గ్రూపు ఖాతా పుస్తకాల్లో చూపారు. 

    ఈ గ్రూపునకు సంబంధించిన ఖాతా పుస్తకాల నిర్వహణదారు, సరకు రవాణాదారు కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను అధికారులు తనిఖీలు జరిపారు. వీరు డొల్ల సంస్థల పేరిట లావాదేవీలు నమోదు చేస్తున్నారు. లెక్కల్లో చూపని లావాదేవీలను నిర్ధారించే పత్రాలు తనిఖీల్లో బయపడ్డాయి. ఈ గ్రూపు నిర్వహిస్తున్న లెక్కల్లో చూపని లావాదేవీల స్వభావాన్ని ఇది తేటతెల్లం చేస్తుంది.

    నల్లధనాన్ని పోగేయడంలో ఈ గ్రూపు చురుగ్గా ఉందని, వాటాలు, అప్పుల రూపంలో ఆ డబ్బును తిరిగి గ్రూపులోకి తీసుకొచ్చి, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆదాయపన్ను అధికారుల దర్యాప్తులో తేలింది. లెక్కల్లో చూపని రూ.3.07 కోట్లు, రూ.1.28 కోట్ల విలువైన బంగారం, ఇతర ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

 

***


(Release ID: 1706685) Visitor Counter : 118


Read this release in: English , Urdu , Hindi