వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఎంఎస్‌పీ వద్ద పంట దిగుబడుల కొనుగోళ్లు
Posted On:
16 MAR 2021 5:53PM by PIB Hyderabad
గోధుమ, వరి దిగుబడులకు ఎఫ్‌సీఐ, రాష్ట్ర ఏజెన్సీల ద్వారా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర అందిస్తోంది. ఈ పథకం కింద, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రైతుల పేర్ల నమోదు జరుగుతుంది. పేరు నమోదు చేసుకున్న రైతుల నుంచి, నిర్ణీత పంట సేకరణ వ్యవధిలో, నిర్ణీత నాణ్యతకు అనుగుణంగా, ఎఫ్‌సీఐ సహా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఎంఎస్‌పీ వద్ద కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లు జరుపుతుంది. పంటల సేకరణ మార్కెట్ కమిటీలు (ఏపీఎంసీలు) లేదా తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు లేదా సేకరణ కేంద్రాల వద్ద ఎంఎస్‌పీ కార్యక్రమాలను ప్రభుత్వ ఏజెన్సీలు కొనసాగిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల ద్వారా సేకరణ కేంద్రం ఏర్పాటు చేసే ప్రాంతం, కేంద్రాల సంఖ్య నిర్ణయం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనల ఆధారంగా, 'పీఎం ఆశా'లో భాగమైన 'ధర మద్దతు పథకం' కింద, పప్పుధాన్యాలను ఎంఎస్‌పీ వద్ద కేంద్రం కొంటుంది. రాష్ట్ర అధీకృత సేకరణ ఏజెన్సీల ద్వారా కేంద్ర నోడల్ ఏజెన్సీలు నమోదిత రైతుల నుంచి నేరుగా పప్పుధాన్యాలు కొంటాయి. కేంద్ర నోడల్ ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి, రైతులకు సౌలభ్యంగా ఉండే ప్రాంతాల్లో సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి.
రైతులు ప్రభుత్వ సేకరణ కేంద్రాల్లో పంటలను అమ్మవచ్చు, లేదా ఇంకా మంచి ధర వస్తుందనుకుంటే బహిరంగ మార్కెట్‌లో కూడా అమ్ముకోవచ్చు. ఎంఎస్‌పీ, ప్రభుత్వ సేకరణ కార్యకలాపాలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్ స్పందిస్తుంది. దీని ఫలితంగా, ప్రకటిత పంట ఉత్పత్తుల ధరలు ప్రైవేటు మార్కెట్‌లో ఎంఎస్‌పీ కంటే ఎక్కువగా ఉంటాయి.
కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.
***
(Release ID: 1705290)