ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 41.94కోట్ల ఖాతాలు ప్రారంభం

Posted On: 15 MAR 2021 4:53PM by PIB Hyderabad

  ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం (పి.ఎం.జె.డి.వై.) కింద ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీనాటికి 41.94కోట్ల మేర  ఖాతాలు ప్రారంభమైనట్టు దేశంలోని వివిధ బ్యాంకులు తెలిపాయి. పి.ఎం.జె.డి.వై. కింద వివిధ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీనాటికి రాష్ట్రాలవారీగా ప్రారంభమైన ఖాతాల వివరాలు అనుబంధంలో పొందుపరచబడ్డాయి.

  ఈ రోజు లోకసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో,  కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయం తెలిపారు.  కేంద్రమంత్రి ఈ విషయమై మరిన్ని వివరాలు సభకు తెలియజేశారు. కోవిడ్19 వైరస్ దేశ ఆర్థిక వ్యవస్ధపై తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో నిరుపేదలు, అట్టడుగు వర్గాలను ఆదుకునేందుకు ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పేరట ఆర్థిక ఉపశమన పథకాన్ని ప్రభుత్వం గత ఏడాది మార్చి 26న ప్రకటించినట్టు మంత్రి తెలిపారు. ఈ ప్యాకేజీలో విశేషాంశాలు ఇవి:

  • కోవిడ్-19తో జరిపే పోరాటంలో ముందువరసలో నిలిచిన ఆరోగ్య కార్యకర్తలకు రూ. 50లక్షల మేర సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని కల్పించడం.
  • ప్రజా పంపిణీ పథకం కింద లబ్ధిదారుడైన ఒక్కో వ్యక్తికి నెలకు 5కిలోల చొప్పున ఆహార ధాన్యాలు, ఒక్కో కుటుంబానికి  నెలకు కిలో చొప్పున పప్పుదినుసులు అదనంగా కేటాయింపు. 
  • పి.ఎం. కిసాన్ యోజన పథకం కింద దేశంలోని 8.7కోట్ల మంది రైతులకు 2020-21వ సంవత్సరం తొలి విడతకింద ఇవ్వాల్సిన రూ. 2,000 మొత్తాన్ని ముందస్తుగా 2020 ఏప్రిల్ లోనే చెల్లించడం..
  • పి.ఎం.జె.డి.వై. ఖాతాదార్లయిన మహిళలకు నెలకు 500 రూపాయల చొప్పున 3 నెలల పాటు 20.40కోట్ల మేర ఎక్స్ గ్రేషియా రూపంలో చెల్లింపు. దివ్యాంగుల కేటగిరీకి చెందిన వారికి, వయోవృద్ధులైన వితంతు మహిళలకు కలిపి దాదాపు 3కోట్ల మందికి తలా వెయ్యి రూపాయల చొప్పున విడుదల.
  • ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం వర్తించే 8కోట్లమంది లబ్ధిదారులకు ఉచితంగా వంటగ్యాస్ (ఎల్.పి.జి.) సిలిండర్లు.
  • వందకంటే తక్కువంది పనిచేసే సంస్థలకు సంబంధించి, 15వేలకంటే తక్కువ నెలసరి వేతనం అందుకునే వారికి వేతనంలో 24శాతం చొప్పున మొత్తాన్ని వారివారి పి.ఎఫ్.ఖాతాల్లోకి 3 నెలల పాటు జమచేయడం. ఉపాధి, ఉద్యోగపరంగా వారు దెబ్బతినకుండా చూసేందుకు చర్యలు.
  • (i) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంఎన్.ఆర్.ఇ.జి.ఎ.) పథకం కింద లబ్ధిదారుల వేతనాన్ని 20రూపాయల చొప్పున పెంచడం. గత ఏడాది ఏప్రిల్ 1నుంచి హెచ్చింపును వర్తింపజేయడం. (ii) దేశంలోని 6.85కోట్ల కుటుంబాలకు ఆధారమైన 63లక్షల స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు, కొలాటరల్ పూచీ అవసరంలేని రుణాల పరిమితిని పది లక్షలనుంచి 20లక్షల రూపాయలకు పెంచడం.
  • ఉద్యోగ భవిష్య నిధిలోని వారి వారి  ఖాతాలనుంచి 75శాతం అడ్వాన్సును, లేదా 3 నెలల వేతనాన్ని (ఏది తక్కువ మొత్తమైతే అది) ఉద్యోగులు పొందేందుకు అనుమతివ్వడం. ఈ మొత్తాన్ని వారు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధంగా ఈ ఏర్పాటు చేశారు.  ఇందుకు కోవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని కారణంగా చూపేందుకు వీలుగా ఉద్యోగ భవిష్యనిధి నిబంధనలను తగిన విధంగా సడలించడం.
  • ఈ కింది విధంగా నిధులను వినియోగించుకునేందుకు వివిధ రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు కూడా జారీచేశారు.:
  1. లెక్కల్లో నమోదైన 3.5కోట్ల కార్మికులకు అండగా నిలిచేందుకు వీలుగా భవననిర్మాణ కార్మికుల, ఇతర కట్టడాల కార్మికుల సంక్షేమ నిధిని వినియోగానికి అనుమతించడం.
  2. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా వైద్యపరమైన పరీక్షల నిర్వహణకు, ఇతర అవసరాలకు జిల్లాల ఖనిజ వనరుల నిధి వినియోగానికి అనుమతించడం.

 

*******



(Release ID: 1704984) Visitor Counter : 157


Read this release in: English , Urdu