ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు
Posted On:
15 MAR 2021 2:39PM by PIB Hyderabad
"ప్రజారోగ్యం, ఆసుపత్రి" అంశం రాష్ట్ర జాబితాలోది కాబట్టి, ప్రభుత్వ ఆసుపత్రులు సహా ప్రజారోగ్య కేంద్రాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలతో ముడిపడి ఉంది.
దేశవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రూపుమాపేందుకు; ప్రజారోగ్య కేంద్రాలను వినియోగించుకునే అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు తోడుగా జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాన్ని (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కేంద్ర ప్రభుత్వం 2005లో తీసుకొచ్చింది. ప్రస్తుతం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌హెచ్‌ఎం)లో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఒక భాగం.
బాలింతలు, చిన్నారులు, నవజాత శిశువుల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, జాతీయ టీకా కార్యక్రమం, క్షయ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వంటి పెద్ద రోగాలు, మలేరియా, డెంగ్యూ, కుష్టు మొదలైన వాటికి ఎన్‌హెచ్‌ఎం కింద ఉచిత వైద్య సేవలను ఎన్‌ఆర్‌హెచ్‌ఎం అందిస్తోంది.
'జనని శిశు సురక్ష కార్యక్రమం' (జేఎస్‌ఎస్‌కే) (ఈ పథకం కింద మందులు, వైద్య పరీక్షలు, రక్తం, ఆహారం, ఇంటి నుంచి ఆసుపత్రికి, వైద్య సంస్థల మధ్య, తిరిగి ఇంటికి రవాణా ఉచితం), 'రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం' (ఆర్‌బీఎస్‌కే) (నవజాత శిశువులు, చిన్నారుల ఆరోగ్య పరీక్షలతోపాటు, పుట్టుక సమస్యలు, వ్యాధులు, లోపాలు, పెరుగుదలలో ఆలస్యం వంటివాటికి సంబంధించిన ముందస్తు ఆరోగ్య సేవలు ఉచితం), ఉచిత ఔషధాలు, ఉచిత వైద్య పరీక్షలు, 'పీఎం జాతీయ డయాలసిస్ కార్యక్రమం', 'జాతీయ నాణ్యత హామీ విధానం' అమలు వంటి ప్రధాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల అందుబాటును పెంచడానికి చలన వైద్య కేంద్రాలు (ఎంఎంయూ), టెలీ మెడిసిన్ కూడా ఎన్‌హెచ్‌ఎం మద్దతుతో అమలవుతున్నాయి.
ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెల్‌నెస్ కేంద్రాలుగా (ఏబీ-హెచ్‌డబ్ల్యూసీ) మార్చేలా, ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రాష్ట్రాలకు కేంద్రం మద్దతునిస్తోంది. నిరంతరాయ సంరక్షణ విధానంతో సమాజ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ కోసం ఈ మద్దతు రాష్ట్రాలకు కేంద్రం నుంచి లభిస్తోంది.
ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద, ఒక కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల ఆరోగ్య కవరేజీ లభిస్తోంది. సాంఘిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ) ప్రకారం, 10.74 కోట్ల పేద, వ్యాధి ప్రభావిత కుటుంబాలు దీని కిందకు వచ్చాయి. ఈ పథకం కింద వైద్య సేవలు అందిస్తే, ప్రైవేటు ఆసుపత్రులతో సమానంగా ప్రభుత్వ ఆసుపత్రులకు చెల్లింపులు ఉంటాయి.
"ప్రజారోగ్యం" రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం కాబట్టి, అవసరమైన వైద్య పరికరాలు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.
2021-22 బడ్జెట్ ప్రసంగంలో, 'ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన' (పీఎం-ఏఎస్‌బీవై)ని రూ.64,180 కోట్లతో ప్రకటించారు. అంటు వ్యాధుల చికిత్సల కోసం దేశంలోని 602 జిల్లాల్లో 50 లేదా 100 పడకల క్లిష్ట సంరక్షణ విభాగాలను ఏర్పాటు చేయడం, 12 కేంద్ర సంస్థల్లో 150 పడకల క్లిష్ట సంరక్షణ విభాగాలను ఏర్పాటు చేయడం ప్రతిపాదిత పథకంలో భాగం.
కొవిడ్ టీకాలకు ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదు. అయితే, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటినవారు, గుర్తించిన ఇతర వ్యాధులు కలిగిన 45-59 ఏళ్ల వయసు ఉన్నవారికి 'కొవిడ్ టీకా కార్యక్రమ నిర్వహణ జాతీయ నిపుణుల బృందం' (నెగ్‌వాక్) ప్రాధాన్యం కల్పించింది.
ప్రస్తుతం, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటినవారు, గుర్తించిన ఇతర వ్యాధులు కలిగిన 45-59 ఏళ్ల వయసు ఉన్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో కొవిడ్ టీకాను అందిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.
***
(Release ID: 1704896)