జల శక్తి మంత్రిత్వ శాఖ
3.77కోట్ల ఇళ్లకు మంచినీటి కుళాయిలు
జలజీవన్ మిషన్ అమలుతో 7కోట్ల
గ్రామీణ కుటుంబాలకు నీటి కనెక్షన్లు
కోవిడ్ మహమ్మారి, లాక్ డౌన్ ఆంక్షలున్నా
రోజూ లక్షకుపైగా నీటి కనెక్షన్ల ఏర్పాటు
Posted On:
09 MAR 2021 4:15PM by PIB Hyderabad
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఇంటికీ 2024నాటికి మంచినీటి కనెక్షన్ అందించే లక్ష్యంతో జల జీవన్ మిషన్ (జె.జె.ఎం.) అనే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15న ప్రకటించారు. మంచినీటి సరఫరాతో ప్రజాజీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఈ పథకాన్ని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోట బురుజునుంచి ప్రధాని ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రకటించే సమయానికి దేశంలోని 18.93 కోట్ల గ్రామీణ కుటుంబాలకుగాను, 3.23 కోట్ల కుటుంబాలకు మాత్రమే అంటే 17శాతం ఇళ్లకు మాత్రమే నీటి కుళాయిల కనెక్షన్లు ఉన్నాయి. అందువల్ల, 2024 నాటికి సుమారు 15.70 కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్లు అందించాల్సి ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న అన్ని నీటి సరఫరా వ్యవస్థలు తప్పనిసరిగా పనిచేసేలా చూడాల్సిన అవసరం ఉంది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 19 కోట్లకు పైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూరడంతోపాటుగా, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది.
కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తితో లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ, దేశంలో తాగునీటి సరఫరా పథకాల పనులు మాత్రం యథావిధిగా నిరాటంకంగా కొనసాగాయి. తొలిదశ లాక్ డౌన్ కాలాన్ని ఈ పథకం కార్యాచరణ ప్రణాళికపై చర్చలకు వినియోగించుకున్నారు. ప్రణాళికపై వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలతో పలుదఫాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చర్చలు జరిపారు. పైగా, నీటి సరఫరా ప్రాజెక్టును అత్యవసర కార్యక్రమంగా పరిగణించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూనే పనులు కొనసాగించారు. ప్రతిరోజూ దాదాపు 1 లక్షమేర తాగునీటి కనెక్షన్లు అందించారు.
తాజా సమాచారం ప్రకారం జలజీవన్ మిషన్ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటి వరకూ 3.77కోట్లకు పైగా ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు అందించారు. అంటే,..గ్రామీణ ప్రాంతాల్లోని 7కోట్లకు పైగా కుటుంబాలకు,.. అంటే 36.5శాతం కుటుంబాలకు వారి ఇంటికే నేరుగా కుళాయిల ద్వారా మంచినీరు అందుతోంది. గామీణ ప్రాంతాల్లోని మూడింట ఒక వంతు కుటుంబాలకు పరిశుద్ధమైన మంచినీరు కుళాయిల ద్వారా అందుతోంది. 52 జిల్లాలు, 670 సమితులు, 42,100 గ్రామ పంచాయతీలు, 81,123 గ్రామాలకు నేరుగా ఇళ్లకే కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతోంది. వందశాతం కుళాయి కనెక్షన్లు అందించిన రాష్ట్రాల్లో గోవా ప్రథమ స్థానంలో, తెలంగాణ రెండవ స్థానంలో ఉన్నాయి. ప్రతి కుటుంబానికి తాగునీటి కనెక్షన్లు అందించాలన్న లక్ష్య సాధనపై వివిధ రాష్ట్రాలు పోటాపోటీగా దృష్టిని కేంద్రీకరించాయి.
జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద జరిగే పనుల విషయంలో పారదర్శకత, జవాబ్దారీతనం, నిధుల సక్రమ వినియోగం, సేవల బట్వాడా వంటి అంశాలను సజావుగా నిర్వహించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. ఈ పథకం భౌతిక, ఆర్థిక ప్రగతిని లెక్కించేందుకు సమగ్ర నిర్వహణా సమాచార వ్యవస్థ (జె.జె.ఎం.-ఐ.ఎం.ఐ.ఎస్.) పేరిట ఒక పటిష్ట వ్యవస్థను రూపొందించారు. ఇంటర్నెట్ లో పబ్లిక్ డొమైన్ ద్వారా వాస్తవిక వివరాలతో ఒక ప్రత్యేకమైన ‘డ్యాష్ బోర్డు’ను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో జరిగే నీటిసఫరా, నీటి పరిమాణం, నీటి నాణ్యత, నిరంతరాయంగా జరుగుతోందా లేదా.. తదితర అంశాలను ఈ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. నీటిసరఫరా పథకానికి సంబంధించిన ప్రతి ఆస్తిని జియోట్యాగింగ్ తో అనుసంధానానికి ఏర్పాట్లు చేశారు. కుటుంబానికి అందించే నీటి కనెక్షన్.ను కుటుంబ పెద్ద ఆధార్ నంబరుతో అనుసంధానం చేశారు. నీటిసరఫరాకు సంబంధించిన అన్ని లావాదేవీలను పబ్లిక్ ఫైనాన్స్ మేనేజిమెంట్ వ్యవస్థ (పి.ఎఫ్.ఎం.ఎస్.) ద్వారా చేపడుతున్నారు.
‘సమానత్వం, సమ్మిళితం’ అన్న సూత్రం ప్రాతిపదికగా జలజీవన్ మిషన్ కింద కొన్ని సమస్యాత్మక ప్రాంతాలకు నాణ్యమైన నీటి సరఫరా చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యేకించి ఆమ్లకలుషిత, ఫ్లోరైడ్ కలుషిత నీరున్న సమస్యాత్మక ప్రాంతాలకు, ఎస్.సి., ఎస్.టి.ల జనాభా ప్రాబ్యం ఉన్న గ్రామాలకు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్.ఎ.జి.వై.) పథకం అమలులో ఉన్న గ్రామాలకు, దుర్భిక్ష ప్రభావిత, ఎడారి ప్రాంతాలకు, ఆశావహ జిల్లాలకు, మెదడువాపు వ్యాధి ప్రభావిత గ్రామాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
కోవిడ్ వైరస్ సంక్షోభంనుంచి ప్రపంచం అంతా క్రమంగా కోలుకుంటున్న తరుణంలో దాదాపు ఏడాది కాలం విరామం తర్వాత చిన్నపిల్లలను వారి వారి విద్యాసంస్థలకు జలజీవన్ మిషన్ ఆహ్వానిస్తోంది. నీటి కాలుష్యం ద్వారా వ్యాపించే వ్యాధులు చిన్నపిల్లలకే సులభంగా సోకే ఆస్కారం ఉంది. వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించాలంటే క్రమం తప్పకుండా చేతులను శుభ్రపరుచుకోవడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా పరిణమించింది. ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు, ఆశ్రమశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చొరవతో గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పాఠశాలలకు వందశాతం నీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చేశాయి. వీటిలో గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని వందశాతం అంగన్వాడీ కేంద్రాలకు కూడా నీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. నీటి సఫరాకు సంబంధించి మిగిలిన రాష్ట్రాలెన్నో వందశాతం లక్ష్యాలకు చేరువలోనే ఉన్నాయి. ఇప్పటివరకూ, 5.43లక్షలకు పైగా పాఠశాలలకు, 4.86లక్షలకుపైగా అంగన్వాడీ కేంద్రాలకు కుళాయిల ద్వారా శుద్ధమైన నీటి సరఫరా ఇప్పటికే ప్రారంభమైంది. కార్యక్రమంలో సాధించిన ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం గడువును 2021 మార్చి నెలాఖరువరకూ పొడిగించారు.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని అమలుచేస్తూ వస్తున్నారు. దీర్ఘకాలిక ప్రాతిపదికపై తగిన పరిమాణంలో, నిర్దేశిత నాణ్యతో నీటిని క్రమం తప్పకుండా సరఫరా చేయడంపై ఈ కార్యక్రమంలో దృష్టిని కేంద్రీకరిస్తారు. ఈ పథకం కింద కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నిరాటంకంగా మంచి నీటిని సరఫరా చేస్తారు. నీటి సరఫరా పథకాల ప్రణాళిక, అమలు, నిర్వహణ విషయాల్లో గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇందుకు సంబంధించి ప్రతి గ్రామం సొంతంగా గ్రామస్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటుంది. నీటి వనరుల నిర్వహణ, నీటి సరఫరా మౌలిక సదుపాయాలు, మురుగు కాల్వల నిర్వహణ వంటివి ఈ కార్యాచరణ ప్రణాళికలో అంతర్భాగాలుగా ఉంటాయి. గ్రామసభల ఆమోదంతో ఈ అంశాలను అమలు చేస్తారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవితాలను మార్చేందుకు జలజీవన్ మిషన్ వివిధ సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇందులో భాగంగా జాతీయ జలజీవన్ మిషన్ (ఎన్.జె.జె.ఎం.), ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలసి ఐ.సి.టి. గ్రాండ్ చాలెంజ్ వ్యవస్థను గత ఏడాది సెప్టెంబరు 15న ప్రారంభించింది. ‘అధునాతన క్రియాశీలక నీటి సరఫరా, నిర్వహణా వ్యవస్థ’ రూపకల్పనలో భాగంగా, సృజనాత్మక, మాడ్యూల్స్ ఆధారిత పరిష్కారం లక్ష్యంగా ఈ వ్యవస్థను తయారు చేశారు. నీటి సరఫరాపై గ్రామస్థాయిలో వాస్తవిక ప్రాతిపదికపై లెక్కలను తేల్చేందుకు ఈ వ్యవస్థను వినియోగించుకోవచ్చు. గ్రామాల నీటి సరఫరా వ్యవస్థను సక్రమంగా పర్యవేక్షించేందుకు ఐ.సి.టి. గ్రాండ్ చాలెంజ్ వ్యవస్థ దోహపడుతుంది.
అలాగే,.నీటి నాణ్యతా పరీక్షకోసం అవసరమైన పోర్టబుల్ పరికరాలను రూపొందించే లక్ష్యంతో పాశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డి.పి.ఐ.ఐ.టి.) భాగస్వామ్యంతో మరో సృజనాత్మక వ్యవస్థను కూడా ప్రారంభించారు. గ్రామస్థాయిలో, ఇంటింటి స్థాయిలో తాగునీటి నాణ్యతను అక్కడికక్కడే, సులభంగా, కచ్చితత్వంతో నిర్ధారించగల పోర్టబుల్ పరికరాలను రూపొందించేందుకు, ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది.
***
(Release ID: 1703719)
Visitor Counter : 186