రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
జన ఔషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ షిల్లాంగ్‌లోని ఎన్.ఇ.ఐ.జి.ఆర్.ఐ.హచ్.ఎం.ఎస్ వద్ద 7500వ జన ఔషధి కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ.
జన ఔషధి పథకం పేద ప్రజలను అధిక మందుల ఖర్చునుంచి విముక్తి చేసింది: ప‌్రధానమంత్రి
జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే మందులు కోనుగోలు చేయాల్సిందిగా కోరిన ప్రధానమంత్రి
మీరు నా కుటుంబ సభ్యులు, మీ అనారోగ్యం, నా కుటుంబ సభ్యుల అనారోగ్యంతో సమానం.అందుకే దేశప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటాను : ప‌్రధానమంత్రి
Posted On:
07 MAR 2021 3:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జన ఔషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన షిల్లాంగ్‌లో ఎన్.ఇ.ఐ.జి.ఆర్.ఐ.హెచ్.ఎం.ఎస్ వద్ద 7500 వ జన ఔషధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో ముచ్చటించారు.అలాగే ఈ పథకానికి సంబంధించి అద్భుత పని చేసిన వారికి తగిన విధంగా గుర్తించారు. కేంద్ర మంత్రులు శ్రీ డి.వి.సదానంద గౌడ,శ్రీ మన్‌సుఖ్ మాండవీయ,శ్రీ అనురాగ్ ఠాకూర్,హిమాచల్ ప్రదేశ్ , మేఘాలయ ముఖ్యమంత్రులు, మేఘాలయ ,గుజరాత్ రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి ,హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, డయ్యూ, కర్ణాటకలోని మంగుళూరు ల కు చెందిన జన ఔషధి మిత్రల కేంద్ర సంచాలకులు, లబ్ధిదారులతో ముచ్చటించారు. ఆరోగ్యవంతమైన జీవన విధానాన్నిఅలవరచుకోవలసిందిగా ఆయన వారిని కోరారు. తక్కువ ధరకే మందులు అందుబాటులో ఉన్నందున పేషెంట్లు అవసరమైన మందులు కొని వాడగలుగుతున్నారని , దీనివల్ల వారు మెరుగైన ఆరోగ్యంతో ఉంటున్నారని అన్నారు. జనౌషధి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నందుకు యువతను ఆయన అభినందించారు. అలాగే ప్రస్తుత వాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లవలసిందిగా ప్రధానమంత్రి యువతకు పిలుపునిచ్చారు.
జనౌషధి ప్రయోజనాలను ప్రచారం చేయాల్సిందిగా ప్రధానమంత్రి వారిని కోరారు. మీరు నా కుటుంబ సభ్యులు. మీ అనారోగ్యం , నా కుటుంబ సభ్యుల అనారోగ్యం వంటిదే . అందువల్ల నేను నా దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగ ఉండాలని కోరుకుంటాను, అని ప్రధానమంత్రి అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు మంచి స్నేహితుడిగా జన ఔషధి యోజన ఉంటున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఇది ఒక వైపు సేవాభాగ్యం, మరోవైపు ఉపాధి కల్పిస్తున్నదని ఆయన అన్నారు. షిల్లాంగ్‌లో 7500 వ జన ఔషధి కేంద్రాన్నిజాతికి అంకితం చేయడం ఈశాన్య రాష్ట్రాలలో జన ఔషధి కేంద్రాల విస్తరణకు ఒక సూచన అని ఆయన అన్నారు.
ఈ పథకం కింద కొండప్రాంత ప్రజలు, ఈశాన్యరాష్ట్రాల ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలు తక్కువధరకు మందులు పొందగలుగుతున్నారని ప్రధానమంత్రిచెప్పారు. ఆరు సంవత్సరాల క్రితం జన ఔషధి కేంద్రాలు వందకూడా ఉండేవి కాదని,అలాంటిది ఇప్పుడు అవి 7500 కేంద్రాలకు చేరడం చెప్పుకోదగిన విషయమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ కేంద్రాల సంఖ్యను 10,000కు తీసుకువెళ్లే లక్ష్యాన్ని చేరుకోవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు దీని ద్వారా ప్రతిసంవత్సరం సుమారు 3,600 కోట్ల రూపాయలు మందుల కొనుగోలు ఖర్చుపై మిగుల్చుకో గలుగుతున్నారని అన్నారు. ఈ పథకం మహిళల్లో ఆత్మ నిర్భరతను ప్రోత్సహిస్తున్నదని , ఈ కేంద్రాలలో సుమారు వెయ్యికేంద్రాలను మహిళలు నిర్వహిస్తున్నారని ప్రధానమంత్రి తెలిపారు. ఈ పథకాన్ని ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాన్ని రెండున్నర లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని, దళితులు,ఆదివాసీ మహిళలకు , ఈశాన్య రాష్ట్రాల వారికి మరో రెండు లక్షల రూపాయల అదనపు ప్రోత్సాహకం ఇవ్వడం జరుగుతున్నదని ఆయన అన్నారు..
భారత్‌లో తయారైన మందులకు, ఇండియాలో జరిగే ఆపరేషన్లకు డిమాండ్ పెరిగిందని అన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచడం జరుగుతున్నదని ఆయన అన్నారు. దీనిద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. జన ఔషధి కేంద్రాలలో 75 ఆయుష్ మందులు కూడా లభ్యమౌతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఆయుష్ మందులు తక్కువ ధరకు జన ఔషధి కేంద్రాలలో లభ్యమవడం వల్ల పేషెంట్లు ప్రయోజనం పొందుతున్నారన్నారు. ఆయుర్వేద, ఆయుష్ మందులు కూడా ప్రయోజనం పొందుతాయి.
చాలా కాలం వరకు ప్రభుత్వం ఆరోగ్యాన్నికేవలం వ్యాధి,చికిత్స కిందనేచూస్తూవచ్చిందని అన్నారు.అయితే ఆరోగ్యానికి సంబంధించిన అంశం కేవలం వ్యాధి, చికిత్సకు మాత్రమే పరిమితమైనది కాదు, ఇది దేశ ఆర్ధిక , సామాజిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశం. ఆరోగ్యానికి సంబంధించి సంపూర్ణ దృష్టిగల వైఖరిని అనుసరించేందుకు ప్రభుత్వం ఆయా వ్యాధులకు గల కారణాలపై కూడా దృష్టి సారించిందని అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్, ఉచిత ఎల్.పి.జి కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్,మిషన్ ఇంద్ర ధనుష్, పోషణ్ అభియాన్, యోగాకు గుర్తింపు తీసుకురావడం వంటివి ఆరోగ్యానికి సంబంధించి సంపూర్ణ దృష్టితో ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి గుర్తింంచిన విషయాన్ని ప్రధానమంత్రి తెలిపారు. ముతకధాన్యం పై విస్తృత ప్రచారం అవసరమని ఇది పుష్టికరమైన ఆహారమని దీనివల్ల రైతులకూ రాబడి పెరుగుతుందని అన్నారు.
పేద కుటుంబాలపై వైద్యఖర్చుల భారం తీవ్రప్రభావం చూపే అవకాశం ఉందని అంటూప్రధానమంత్రి,ఇటీవలి కాలంలో వైద్యచికిత్సలో ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి పేద వ్యక్తికి మెరుగైన వైద్యం అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు అత్యావశ్యక మందులు, గుండె స్టెంటుల, మోకాలిసర్జరీలకు సంబంధించిన పరికరాల ధరలను పెద్ద ఎత్తున తగ్గించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ఆయుష్మాన్ యోజన కింద 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స దేశంలోని 50 కోట్ల మంది పేద కుటుంబాలకు చెందిన వారికి లభిస్తుందని ఆయన అన్నారు. ఇప్పటివరకూ 1.5 కోట్ల మంది కిపైగా ప్రజలు ఈపథకం కింద ప్రయోజనం పొంది సుమారు 30,000 కోట్ల రూపాయలు ఆదాచేసుకున్నారని ప్రధానమంత్రి తెలిపారు..
భారతదేశంలో తయారైన కరోనా వాక్సిన్‌కు కృషి చేసిన శాస్త్రవేత్తల కృషిని ప్రధానమంత్రి అభినందించారు. ఇవాళ దేశంలో వాక్సిన్‌ను వాడుకోవడమే కాక, ఇండియా . ప్రపంచానికి సహాయపడుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. వాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకున్నదని ప్రధానమంత్రి అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో వాక్సినేషన్ ఉచితంగా చేపడతారని,ప్రైవేటుఆస్పత్రులలో రూ 250లు వసూలుచేస్తారన్నారు. ప్రపంచంలో ఇది అత్యల్ప ధర అని ఆయన తెలిపారు.
ప్రజలకు సరైన వైద్యం అందడానికి తగిన మౌలిక సదుపాయాలు, తగిన శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు. గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాపన నుంచి టెర్టియరీఆస్పత్రులు, ఎయిమ్స్ వంటి మెడికల్ కాలేజీల వరకు ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో సమగ్రదృష్టితో పనిచేస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
.గత ఆరు సంవత్సరాలలో వైద్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. గత ఆరు సంవత్సరాలలో 2014 లోకేవలం 55 వేల ఎం.బి.బి.ఎస్ సీట్లు మాత్రమే ఉండగా దానిఇక 30 వేల సీట్లను అదనంగా చేర్చినట్టు ప్రధానమంత్రి చెప్పారు. అలాగే 30 వేల పిజి సీట్లు ఉండగా వాటికి అదనంగా 24 వేల సీట్లు చేర్చినట్టు తెలిపారు. గత ఆరు సంవత్సరాలలో కొత్తగా 180 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసినట్టు ప్రధానమంత్రి వివరించారు. గ్రామాలలో ఒకటిన్నర లక్ష హెల్త్ వెల్‌నెస్‌కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఇందులో 50 వేల కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈ కేంద్రాలు తీవ్రమైన జబ్బులకు చికిత్సందిస్తున్నాయని,అధునాతన పరీక్షలను ఇవి స్థానికంగానే అందుబాటులోకి తెస్తున్నాయని ఆయన చెప్పారు. బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులను పెంచిన విషయాన్నిప్రధానమంత్రి ప్రత్యేకంగా గుర్తుచేశారు. సంపూర్ణ ఆరోగ్య సమస్యలకు ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్త్యయోజన గురించి ఆయన ప్రస్తావించారు. ప్రతిజిల్లాలో డయాగ్నస్టిక్‌కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని,600 కు పైగా క్రిటికల్ కేర్ ఆస్పత్రులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి మూడు లోక్‌సబ నియోజకవర్గాల పరిధిలో ఒకమెడికల్ సెంటర్‌ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.
చికిత్స ఖర్చులు తక్కువగా ఉండేట్టుచూడడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అలాగే ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండేట్టు చూస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. ఈరకమైన దృక్పథంతోటే ప్రస్తుత విధానాలు, కార్యక్రమాలు రూపుదిద్దు కుంటున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. ప్రధానమంత్రి జన ఔషధి ప్రాజెక్టునెట్‌వర్కు సత్వరం విస్తరించిందని,ఇది వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు చేరిందని ప్రధానమంత్రి తెలిపారు.
***
(Release ID: 1703032)
Visitor Counter : 149