మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

తెలంగాణలో కేంద్ర గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం


Posted On: 12 FEB 2021 5:43PM by PIB Hyderabad

దేశంలోని కొన్ని రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో గొర్రె మాంసం, ఎరువుకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. గొర్రెల పెంపక రంగంలో పేదలకు చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి.

ఒక ప్రాంతంలోని భౌగోళిక వాతావరణం, వనరుల లభ్యత ఆధారంగా గొర్రెల పెంపకం సాగుతుంది. వివిధ కాపరి వర్గాలు తరతరాలుగా సంప్రదాయ పద్ధతుల్లో గొర్రెలను పెంచుతున్నాయి. వారంతా తమ అనుభవం ద్వారా ఈ వృత్తిలో నైపుణ్యం సాధించారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర కృషి కారణంగా వారు ఆధునిక శాస్త్రీయ పద్ధతులను ఇప్పుడిప్పుడే అనుసరిస్తున్నారు. గొర్రెలకు వ్యాధులు రాకుండా టీకాలు వేయించడం వంటి ఆరోగ్య సంరక్షణను చేపడుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత, వివిధ సాంప్రదాయ పద్ధతుల్లో నైపుణ్యాభివృద్ధికి చర్యలు ప్రారంభించినట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖ తెలియజేసింది. పాల ఉత్పత్తి వృద్ధి, పశువుల ఆరోగ్య సంరక్షణ, గొర్రెల పెంపకం వంటివాటిపై రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ అందించినట్లు వెల్లడించింది. తరగతి గదుల్లో బోధన, క్షేత్ర స్థాయి అనుభవాలు, ఇతర శిక్షణ పద్ధతులతో సాంకేతికతను అందించి శిక్షణ స్థాయిని పెంచడానికి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో "సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌" ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మామిడిపల్లిలోని "లార్జ్‌ స్కేల్ షీప్‌ బ్రీడింగ్‌ ఫామ్‌" (ఎన్‌ఎస్‌ఎస్‌బీఎఫ్‌)లో "తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌"ను ఏర్పాటు చేయాలని ఈ ప్రతిపాదనలో సూచించారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన 2019-20 కింద, రూ.18.50 కోట్ల ఖర్చుతో, ఈ క్రింద లక్ష్యాల సాధన కోసం దీనిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

వివిధ పశుసంవర్ధక కార్యక్రమాల్లో రాష్ట్ర లేదా దేశ రైతులు, పారిశ్రామికవేత్తల అవసరాలను తీర్చడం; వారి జీవన ప్రమాణాలు, నైపుణ్యాలను వృద్ధి చేయడం; పశువులు, పౌల్ట్రీ పెంపకంపై ప్రాంగణ, ప్రాంగణేతర శిక్షణ ఇవ్వడం.

ప్రదర్శన ఫారాలు, సాంకేతిక పార్కును ఏర్పాటు చేయడం ద్వారా పశు పెంపక రంగాల్లో పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వడం; వీడియో పాఠాలు, కరపత్రాలు, నైపుణ్య ప్రదర్శనల ద్వారా పశువుల ఆధునిక నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించడం.

పశు జాతుల వృద్ధి, ఆరోగ్యం విషయంలో పశువైద్యులు, పారా-వెట్‌ సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడం.

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలోని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ విభాగం ఈ ప్రతిపాదనకు మద్దతునిచ్చింది.

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజీవ్‌ కుమార్‌ బల్‌యాన్‌ ఈ సమాచారాన్ని రాజ్యసభకు సమర్పించారు.

****



(Release ID: 1697582) Visitor Counter : 230


Read this release in: English , Urdu