ఉప రాష్ట్రపతి సచివాలయం
సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే శాస్త్ర పరిశోధనల పరమావధి కావాలి: ఉపరాష్ట్రపతి
- బాల్యం నుంచే చిన్నారుల్లో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించాలి, ప్రశ్నించే తత్వాన్ని అలవాటుచేయాలి
- స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన కరోనా టీకా త్వరలో అందుబాటులోకి రానుంది
- ఈ ప్రయత్నంలో కృషిచేసిన శాస్త్రవేత్తలందరికీ హార్దిక అభినందనలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
- మనం స్వయం సమృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను కరోనా మరోసారి గుర్తుచేసింది
- ఆత్మనిర్భర భారత్ నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో మనమంతా భాగస్వాములమవుదాం- ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ముగింపు సమావేశంలో అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి సూచన
Posted On:
25 DEC 2020 5:26PM by PIB Hyderabad
సామాన్యులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారమే శాస్త్ర, సాంకేతిక రంగ ప్రయోగాల అంతిమ లక్ష్యం కావాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బాల్యంనుంచే చిన్నారుల్లో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందింప జేయాలని.. ఆయన సూచించారు. ప్రశ్నలకు జవాబులు చెప్పే విధానానికి బదులు.. వారిలో ఉత్సుకతను పెంచి ప్రశ్నలు అడిగే తత్వంతో చిన్నారులను ప్రోత్సహించాల్సిన విధానాలను పెంపొందించుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
‘ఆత్మనిర్భరత, ప్రపంచ సంక్షేమంలో సైన్స్ పాత్ర’ అనే అంశంపై.. సీఎస్ఐఆర్, విజ్ఞాన భారతితో పాటు పలు మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్’ ముగింపును పురస్కరించుకుని అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. స్వదేశీ తయారీ కరోనా టీకా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందన్న ఆయన, ఈ టీకా తయారీలో అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలను అభినందించారు.
కరోనాకు ముందు భారతదేశంలో లేని పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, మాస్కులు, కరోనా పరీక్షల కిట్ల తయారీలో భారతదేశం పాత్రను.. గత ఐదారు నెలల్లో ఈ అంశాల్లో సాధించిన ప్రగతిని, వివిధ దేశాలకు ఎగుమతి చేసే స్థితికి చేరుకోవడం.. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో దేశం ముందుకెళ్తున్న తీరును అర్థం చేసుకోవచ్చని ఉపరాష్ట్రపతి తెలిపారు. కరోనా టీకా గురించి సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, అలాంటి భయాందోళనలకు అక్కర్లేదని ఆయన సూచించారు. ప్రజల్లో టీకా హేతుబద్ధతపై విశ్వాసం పెరగాలని సూచించారు.
సైన్స్ మానవాభివృద్ధికి జీవనరేఖ అని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, శాస్త్రీయ దృష్టికోణాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ దృష్టికోణం ద్వారా శాస్త్రీయ పరిశోధన పద్ధతిపై ఆసక్తి పెరుగుతుందని, అది మానవజీవనాన్ని మరింత సరళీకృతం చేసేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
శాస్త్రీయ రంగంలో భారతదేశానికి ఘనమైన చరిత్ర ఉందని, ఈ రంగంలోనూ ‘వసుధైవ కుటుంబకం’ అనే మనదేశ మూలతత్వాన్ని, సాధించిన ప్రగతిని మిగతావారితో పంచుకోవడమనే సిద్ధాంతాన్ని భారత్ నాటినుంచీ కొనసాగిస్తూ వస్తోందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఎన్నో పరిశోధనలు చేసిన భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరైన శ్రీ జగదీశ్ చంద్రబోస్ ఏనాడూ పేటెంట్ హక్కులకోసం ప్రయత్నించలేదన్న ఆయన, ఆ స్ఫూర్తినే నేటికీ కొనసాగిస్తున్న భారత్ ప్రపంచ ఫార్మాసూటికల్ హబ్ గా గుర్తింపు పొందినప్పటికీ, ప్రపంచానికి అవసరమైన మందులను అందించడంలో ఏనాడూ వెనుకంజవేయలేదన్నారు. కరోనా సమయంలోనూ భారతదేశ సేవానిరతిని ప్రపంచం గమనించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
శాస్త్ర, సాంకేతిక రంగంలో భారతదేశం సాధించిన ప్రగతికి మన పౌరులంతా గర్వపడాలన్న ఉపరాష్ట్రపతి, ఈ ప్రేరణతో ప్రపంచ పరిశోధనల కేంద్రంగా భారత్ ను నిలిపే దిశగా బాల్యంనుంచే చిన్నారుల్లో శాస్త్ర, సాంకేతిక రంగంపై ఆసక్తిని పెంపొందింపజేయాలని, యువత కూడా ఈ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు.
చిన్నారుల్లో కొత్త విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలం, ఆసక్తి ఉంటాయన్న ఉపరాష్ట్రపతి, ఆ ఆసక్తికి చిన్నప్పటినుంచే సానబెట్టడం ద్వారా వారిని ప్రోత్సహించాలన్నారు. కొత్త విషయాలను కనుగొనేలా వారికి నిరంతర మార్గదర్శన చేయడంపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
పరిశోధనల రంగంపై భారతదేశం మరింత దృష్టిపెట్టి సుస్థిరాభివృద్ధిపై దృష్టిసారించాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసిందన్న ఉపరాష్ట్రపతి, మన అంతరిక్ష పరిశోధల కార్యక్రమం ద్వారా ఆత్మనిర్భరతను ఎలా సాధించవచ్చో నిరూపించామన్నారు. ఎలక్ట్రానిక్స్, రక్షణ వంటి కీలక రంగాల్లో ఆత్మనిర్భరతను పెంపొందించే దిశగా ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలకు, ప్రైవేటు రంగం కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని, మనదేశ యువశక్తి సామర్థ్యానికి పదునుపెట్టి, శాస్త్ర, సాంకేతిక రంగంలో భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఐఐఎస్ఎఫ్ చైర్మన్ డాక్టర్ శేఖర్ మండే, కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, భూవిజ్ఞానశాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రాజీవన్, విజ్ఞాన భారతి జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ జయంత్ సహస్రబుద్ధే, ఐఐఎస్ఎఫ్ చీఫ్ కొ-ఆర్డినేటర్ డాక్టర్ రంజన్ అగర్వాల్‌తోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
***
(Release ID: 1683621)
Visitor Counter : 215