రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని శ్రీ గడ్కరీ చెప్పారు

కాలుష్యాన్ని తగ్గించే విస్తృత జాతీయ ఎజెండాను సాధించడానికి వాహన పరిశ్రమ కలసిరావాలి: శ్రీ గడ్కరీ

దేశవ్యాప్తంగా 69 వేల పెట్రోల్ పంపుల వద్ద కనీసం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ కియోస్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది: శ్రీ గడ్కరీ

వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశాన్ని ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 23 NOV 2020 6:32PM by PIB Hyderabad

పరిశ్రమకు అవసరమైన వనరులను, సౌకర్యాలను  ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో ప్రపంచస్థాయి కంపెనీలను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రోడ్డు రవాణా, జాతీయ రహదారులు & ఎంఎస్‌ఎంఇ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలను వేగవంతం చేయడానికి అవసరమైన విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. వర్చువల్‌లో జరిగిన 9వ ఎడిషన్ ఆటో సర్వ్ -2020 ఎలక్ట్రిక్ మొబిలిటి కాన్ఫరెన్స్‌ 2020 ప్రసంగించిన శ్రీ గడ్కరీ" వాహన పరిశ్రమ ఉమ్మడిగా సరికొత్త అవకాశాలను అందుకుంటూ కాలుష్యాన్ని తగ్గించే విస్తృత జాతీయ ఎజెండాను సాధించడానికి పనిచేయాలని" చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలను ఆయన వివరించారు. జిఎస్టిని 5% కి తగ్గించడం, బ్యాటరీ డిలింకింగ్‌కు అనుమతించడం  వాహన ధరను తగ్గించేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. బ్యాటరీ ఛార్జింగ్ అనుకూలమైన వ్యవస్థ చాలా ముఖ్యమైనదని అందుకోసం ప్రజల్లో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు దేశంలోని సుమారు 69 వేల పెట్రోల్ పంపుల వద్ద కనీసం ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కియోస్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.

శ్రీ గడ్కరీ మాట్లాడుతూ, “వచ్చే ఐదేళ్లలో భారతదేశాన్ని ప్రపంచ ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని..అది తన కల" అని చెప్పారు. ప్రధాని చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అది దోహదం చేస్తుందన్నారు.

వచ్చే 5 సంవత్సరాలలో  ప్రపంచ ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా అవతరించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. విభిన్న రకాల మోడళ్ల తయారీ, బలమైన పరిశోధన మరియు అభివృద్ది విభాగం, భారీ మార్కెట్, స్థిరమైన ప్రభుత్వం, ప్రతిభగల యువ ఇంజనీర్లు ద్వారా ఆటో పరిశ్రమ గణనీయమైన ప్రగతి సాధించినందున ఇది సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ భారత్ అని ఆయన అన్నారు.

ఈ రంగంలో భారీ అభివృద్దికి ఉన్న అవకాశాలను గుర్తించిన ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) కింద ఈ రంగానికి రూ .51000 కోట్లు కేటాయించిందని..రానున్న సమీప భవిష్యత్తులో ఆటోమొబైల్‌ రంగంలో 25 మిలియన్ల మంది నైపుణ్యం గల ఉద్యోగాల అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమ గరిష్ట ఉద్యోగాలు మరియు వృద్ధిని సృష్టించబోతున్నందున ఇది చాలా ముఖ్యమైనదని తెలిపారు.

పెట్రోల్ లేదా ఇథనల్ / సిఎన్‌జిని ఇంధనంగా ఉపయోగించుకునే ఫ్లెక్స్ ఇంజిన్‌ల తయారీకి ముందుకు రావాలని శ్రీ గడ్కరీ ఆటోమొబైల్ పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో భారత ఆటో పరిశ్రమ బ్రెజిల్, యుఎస్ ఆటో రంగాలను ఉదాహరణగా తీసుకోవచ్చని సూచించారు. సిఎన్‌జి, హైడ్రోజన్, విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ మరియు తక్కువ కాలుష్య ఇంధనాల వినియోగంలో ఉన్న అవకాశాలను మన పరిశ్రమ ఉపయోగించుకుంటుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఢిల్లీ, ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలలో ఇ-హైవే తయారీకి ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ గడ్కరీ అన్నారు. మార్కెట్ అవసరాలను తీర్చడానికి డబుల్ డెక్కర్ బస్సుల తయారీ సహా వివిధ రకాలను తయారు చేయడంపై ఆటో రంగం దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

***(Release ID: 1675329) Visitor Counter : 136