మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఉన్నత్ భారత్ అభియాన్ ప్రగతిపై కేంద్ర విద్యామంత్రి సమీక్ష

Posted On: 20 NOV 2020 8:00PM by PIB Hyderabad

   గ్రామీణ భారతావనిలో పరిపూర్ణమైన పరివర్తన లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఉన్నత్ భారత్ అభియాన్ (యు.బి.ఎ.) పథకం అమలుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’  2020 నవంబరు 20న వీడియో కానన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే, యు.బి.ఎ. జాతీయ సారథ్య సంఘం చైర్మన్ డాక్టర్ విజయ్ భట్కర్, పాఠ్యాంశ నిపుణుల జాతీయ బృందపు సలహా సంఘం అధ్యక్షుడు  డాక్టర్ ఆర్. చిదంబరం, ఢిల్లీ ఐ.ఐ.టి. డైరెక్టర్ ప్రొఫెసర్ రాంగోపాల్ రావు, యు.బి.ఎ. జాతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ వి.కె. విజయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  ఉన్నత్ భారత్ అభియాన్ (యు.బి.ఎ.) పథకం అమలులో ప్రగతిని, ప్రొఫెసర్ వి.కె. విజయ్ ఈ సమీక్షలో వివరించారు. 2,600కు పైగా సంస్థల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని 14వేల గ్రామాలకు వర్తింపజేస్తున్నట్టు చెప్పారు. పథకం అమలుకు సంబంధించి 4,650 గ్రామాల స్థాయి సర్వే సమాచారం, 4,75,702 ఇళ్ల స్థాయి సర్వే సమాచారం యు.బి.ఎ. వెబ్ సైట్ లో అందుబాటులో ఉందని తెలిపారు.

  యు.బి.ఎ. కింద ప్రగతి సాధనలో ఢిల్లీ ఐ.ఐ.టి. సాగించన కృషిని కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ అభినందించారు. ఈ పథకం కింద గ్రామీణ సమాజంతో, గ్రామాలతో ఉన్నత విద్యాసంస్థలను అనుసంధానం చేస్తున్నట్టు చెప్పారు. ఆయా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ బద్ధమైన, క్షేత్రస్థాయి అనుభవ విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు పథకం దోహదపడుతోందన్నారు. ప్రజల మెరుగైన జీవితానికి అవసరమైన సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించేందుకు,  పరిజ్ఞానం అమలుకోసం తగిన పద్ధతులను రూపొందించేందుకు ఈ పథకం వీలు కలిగిస్తుందన్నారు.

  అన్ని గ్రామాలకు ఉమ్మడిగా ఎదురయ్యే 3నుంచి ఐదు కీలక సమస్యలను, స్థానిక పరిస్థితుల ఆధారంగా మరికొన్ని అంశాలను గుర్తించాలని, సమస్యల పరిష్కారంపై భాగస్వామ్య సంస్థలు కృషి చేయాలని మంత్రి పోఖ్రియాల్ సూచించారు. గ్రామాలకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఈ పథకం కింద గరిష్ట సంఖ్యలో ఉన్నత విద్యాసంస్థలకు ప్రమేయం కల్పించాలన్నారు. 2020 సవంత్సరపు నూతన విద్యావిధానంపై పాఠశాలల ఉపాధ్యాయులకు మరింత అవగాహన కల్పించడంలో ఉన్నత్ భారత్ యోజన పథకం మరింత కీలకపాత్ర పోషించాలన్నారు.

  వివిధ సంస్థలు తమ అభిప్రాయాలను, అనుభవాలను విజయ గాథలను పరస్పరం పంచుకునేందుకు, తద్వారా ప్రేరణ పొందేందుకు వేదికగా ఉపయోగపడే ఒక వెబ్ పోర్టల్ అవసరమమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత, ఆరోగ్య రక్షణ మెరుగుపడుతున్న తీరు, యు.బి.ఎ. పథకం ప్రమాణాల అమలు వంటి అంశాలపై రాష్ట్రాలవారీగా అధ్యయనం చేపట్టాలని, కొత్తగా లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు ఇది అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఉన్నత్ భారత్ అభియాన్ (యు.బి.ఎ.) గురించి..

   ఉన్నత విద్యా సంస్థల ప్రమేయంతో గ్రామీణాభివృద్ధిలో పరిపూర్ణమైన పరివర్తన తీసుకురావాలన్న దృక్పథం స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వ పతాక పథకంగా ఉన్నత్ భారత్ అభియాన్ రూపుదిద్దుకుంది. సమ్మిళిత భారతావని నిర్మాణానికి, అభివృద్ధి లక్ష్యాల సాధనలో సవాళ్లను గుర్తించేందుకు ఉన్నత విద్యా సంస్థలు గ్రామీణ ప్రజలతో కలసి పనిచేసేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. సుస్థిర అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కూడా దోహదపడుతుంది. 

 

******



(Release ID: 1674636) Visitor Counter : 186


Read this release in: English , Urdu , Hindi