గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఘనంగా ఆవాస్ దివస్, ఆవాస్ సప్తాహ్ ఉత్సవాలు

లబ్ధిదారుల గౌరవ మర్యాదలను రక్షణగా నిలిచిన

పి.ఎం.ఎ.వై. గ్రామీణ్: నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 20 NOV 2020 6:32PM by PIB Hyderabad

 

  

“ఆవాస్ దివస్” సందర్భంగా,  వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులతో, అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, వ్యవసాయం, రైతు సంక్షేమం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,..గ్రామీణ ప్రాంతాల వారికి ఇళ్ల నిర్మాణంకోసం “అందరికీ ఇళ్లు” అనే లక్ష్యంతో పలు రకాల సేవలందిస్తున్న వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అభినందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ (పి.ఎం.ఎ.వై-జి) పథకం, లబ్ధిదారులకు ఇళ్ల సదుపాయంతో పాటుగా, వారి గౌరవ మర్యాదలను కాపాడేందుకు కూడా కృషి చేస్తోందన్నారు. లబ్ధిదారుల జీవన ప్రమాణాలు కూడా పెరగడం ఈ పథకం అదనపు సానుకూల పరిణామమన్నారు. ఆవాస్ దినం/ఆవాస్ వారోత్సవం, లేదా ఆవాస్ సప్తాహ్ కార్యక్రమాలు విజయోత్సవ వేడుకలు మాత్రమే కాదని, ఈ పథకం కింద ప్రయోజనం పొందిన, నిరీక్షణ జాబితాలో ఉన్న కోట్లాది మంది గ్రామీణ కుటుంబాలతో అనుసంధానమయ్యే తరుణానికి ఇది నిదర్శనమని అన్నారు. ఈ పథకం భాగస్వామ్య వర్గాల వారందరికీ అవగాహన కల్పించేందుకు ఈ వేడుక ఒక సదవకాశమన్నారు. వివిధ రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులు మాట్లాడుతూ,.. ‘2022నాటికి అందరికీ ఇళ్లు’ అనే లక్ష్య సాధనకోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ ప్రయత్నంలో తమకు ఎదురవుతున్న సమస్యలను కూడా వారు వివరించారు.

 

  కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి, కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా, అదనపు కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ్, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గయా ప్రసాద్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 16రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రులు, అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, కార్యక్రమ నిర్వాహక అధికారులు పాలుపంచుకున్నారు.

  గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణంకోసం పి.ఎం.ఎ.వై-జి పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబరు 20న ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ప్రారంభించారు. ‘2022 నాటికి అందరికీ ఇళ్లు’ అనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమ ప్రారంభానికి గుర్తుగా, ప్రతి ఏడాదీ నవంబరు 20ని “ఆవాస్ దివస్”గా పాటించాలని నిర్ణయించారు.

  పి.ఎం.ఎ.వై.-జి కింద 2022కల్లా 2.95కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో పూర్తి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016-17నుంచి 2018-19వరకూ అమలు చేసిన తొలి దశలో కోటి వరకూ పక్కా ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్ణయించారు.  2019-20నుంచి 2021-22 వరకు రెండవ దశలో మిగిలిన కోటీ 95లక్షల ఇళ్ల నిర్మాణాన్ని నిర్మించనున్నారు. ఇప్పటివరకూ 2.26కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యంకాగా, మొత్తం కోటీ 75లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం రాగా,  కోటీ 20లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది.

   పి.ఎం.ఎ.వై-జి పథకం కింద నిర్మించే ఈ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం పలు సంస్కరణలను అమలు చేస్తోంది. నిర్మాణంలో పారదర్శకతను, వేగాన్ని పెంపొందించాలని, నాణ్యతను కాపాడాలని, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా లబ్ధిదారులకు సకాలంలో నిధులు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. సాంకేతిక పరిజ్ఞానపరంగా తగిన సహాయం,  ఆయా ప్రాంతాలకు అనువైన నమూనాలను లబ్ధిదారులకు అందించాలని, ఎం.ఐ.ఎస్. ఆవాస్ సాఫ్ట్, ఆవాస్ యాప్ ల ద్వారా పథకం అమలుపై పూర్తి స్థాయి పర్యవేక్షణను చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

   2017, 2018, 2019 సంవత్సరాల్లో కూడా ఆవాస్ దినం/ఆవాస్ వారోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పలు కార్యకలాపాలను చేపట్టాయి. పథకం లబ్ధిదారులు కూడా క్రియాశీలకంగా పాలుపంచుకున్నారు.

   ఈ ఏడాది కూడా నవంబరు 20న ఆవాస్ దినాన్ని, నవంబరు 16నుంచి 22వరకూ ఆవాస్ వారోత్సవం లేదా ఆవాస్ సప్తాహ్ కార్యక్రమాలను నిర్వహించాలని ఆయా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. రాష్ట్రం, జిల్లా, బ్లాకు, గ్రామ పంచాయతీ స్థాయిల్లో వివిధ రకాల కార్యకలాపాలను చేపట్టాలని సూచించారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా, కేంద్ర హోమ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల ఆదేశాలకు, మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా కార్యకలాపాలు చేపట్టాలని కేంద్రం సూచించింది.

ఆవాస్ దివస్, ఆవాస్ సప్తాహ్ సందర్భంగా ఈ కింది కార్యక్రమాలు చేపడుతున్నారు.

  • పి.ఎం.ఎ.వై.-జి పథకం గురించి లబ్ధిదారుల్లో అవగాహన కల్పించడం.
  • ఇళ్ల ప్రదర్శనా ప్రాంతాలకు లబ్ధిదారులతో సందర్శనలను నిర్వహించడం.
  • పి.ఎం.ఎ.వై.-జి లబ్ధిదారులకు రుణ సదుపాయం అందేలా చేసేందుకు, స్థానిక బ్యాంకర్లతో వారికి సమావేశాలు, సంప్రదింపులు ఏర్పాటు చేయడం
  • భూమి పూజలు, గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం.
  • ఆవాస్ దివస్/ఆవాస్ సప్తాహ్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ఇతర కార్యక్రమాలు సముచితం అనుకుంటే అలాంటి కార్యకలాపాలను నిర్వహించడం.

  పి.ఎం.ఎ.వై.-జి పథకం అమలులో అంకిత భావంతో కృషి చేసిన ఆ పథకానికి సంబంధించిన అన్ని సంస్థలకు, వ్యక్తులకు కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసి విజయవంతం చేసినందుకు  క్షేత్ర స్థాయి సిబ్బందినుంచి, బ్లాకు, జిల్లా, రాష్ట్ర స్థాయి, కేంద్ర ప్రభుత్వ స్థాయి అధికారుల వరకూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత, కోవిడ్-19 మార్గదర్శక సూత్రాలను పాటిస్తూ ఇళ్ల నిర్మాణంలో వేగాన్ని పునరుద్ధరించేందుకు తీసుకున్న చర్యలను కూడా కేంద్రమంత్రి అభినందించారు.

*********



(Release ID: 1674590) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi