ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ‌ను కలిసిన - మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా

Posted On: 19 NOV 2020 6:08PM by PIB Hyderabad

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (డి.ఓ.ఎన్.ఈ.ఆర్) సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్); ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి, డాక్టర్ జితేంద్ర సింగ్ ను  మేఘాలయ ముఖ్యమంత్రి, కాన్రాడ్ సంగ్మా న్యూఢిల్లీలో కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలతో పాటు, కేంద్ర నిధులతో రాష్ట్రంలో అమలౌతున్న అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించారు. 

ఢిల్లీ నుంచి షిల్లాంగ్‌కు విమాన సర్వీసు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయాన్ని, డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు.  చాలా కాలం నుండీ ఈ విషయం పెండింగ్‌లో ఉందని ఆయన పేర్కొంటూ, పూర్వపు అస్సాం రాష్ట్రానికి రాజధానిగా ఉన్న షిల్లాంగ్ ఈ సదుపాయాన్ని కలిగి ఉండటానికి అన్ని విధాలా అర్హత కలిగి ఉందని, అన్నారు.

 

ఢిల్లీ నుండి షిల్లాంగ్ ‌కు నేరుగా విమాన సర్వీసు వల్ల రెండు ప్రదేశాల మధ్య ప్రయాణం సౌకర్యంగా ఉండడంతో పాటు, రాష్ట్రంలో పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తుందని,  ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి పేర్కొన్నారు.  కోవిడ్ మహమ్మారి ప్రభావం తక్కువగా ఉన్న కారణంగా మేఘాలయతో సహా ఈశాన్య ప్రాంతంలోని, కొన్ని పర్యాటక కేంద్రాలకు ఇప్పడు క్రమంగా ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ రంగాలను  వివిధ మార్గాల్లో ప్రోత్సహిస్తుందని ఆయన వివరించారు.  

డాక్టర్ జితేంద్ర సింగ్  మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారని, కాన్రాడ్ సంగ్మా కు చెప్పారు.   ప్రధాన మంత్రి సూచనల మేరకు, కొత్త విమానాశ్రయాలు, వివిధ మార్గాలలో విమాన సర్వీసులు, ఈశాన్య ప్రాంత వ్యాప్తంగా డబుల్ గేజ్ రైలు మార్గాలు, రహదారులు, కొత్త దేశీయ జలమార్గాల ద్వారా అనుసంధానతను, రవాణాను మెరుగుపరచడానికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.   

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డి.ఓ.ఎన్.ఈ.ఆర్) మరియు ఈశాన్య మండలి (ఎన్.ఈ.సి) పరిధిలోని వివిధ పథకాలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనల గురించి శ్రీ సంగ్మా, ఈ సందర్భంగా, డాక్టర్ జితేంద్ర సింగ్ కు వివరించారు. దీనికి కేంద్ర మంత్రి స్పందిస్తూ, ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తానని ముఖ్యమంత్రికి హామీ ఇస్తూ, కోవిడ్ మహమ్మారి కారణంగా నెలకొన్న కొన్ని అవరోధాల గురించి తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న ప్రోత్సాహక విధానాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు, కేటాయించిన బడ్జెట్టును పెంచే అవకాశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.

 

<><><>



(Release ID: 1674169) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Hindi