ఆర్థిక మంత్రిత్వ శాఖ

రూ. 1,278కోట్ల మేర నకిలీ బిల్లుల పన్నాగం భగ్నం


ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ కోసం భారీ అక్రమాలు
సి.జి.ఎస్.టి. అధికారుల దాడులతో బట్టబయలు

Posted On: 29 OCT 2020 7:17PM by PIB Hyderabad

దాదాపు రూ. 1,278కోట్ల మేర నకిలీ బిల్లుల ద్వారాభారీ స్థాయిలో ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ (ఐ.టి.సి.) రాయితీని పొందడానికి సాగించిన పన్నాగాన్ని అధికారులు వమ్ము చేశారు.కేంద్ర వస్తుసేవల పన్ను (సి.జి.ఎస్.టి.)శాఖ, ఢిల్లీ ఈస్ట్ కమిషనరేట్ కార్యాలయానికి చెందిన పన్నుఎగవేత నియంత్రణ విభాగం అధికారులు ఈ గుట్టును బట్టబయలు చేశారు. తమకు అందిన ప్రత్యేక నిఘా సమాచారం ఆధారంగా సోదాలు జరిపారు.  ఏడు రకాల నకిలీ సంస్థలను ఏర్పాటు చేయడంద్వారా ఒక సిండికేట్ వ్యవస్థ రూ. 137కోట్ల టాక్స్ క్రెడిట్ రాయితీకి ఆమోదం పొందడానికి పన్నాగం పన్నినట్టు అధికారులు కనుగొన్నారు. ప్రభుత్వానికి చట్టబద్ధంగా అర్హమైన పన్నును చెల్లించకుండా పలు అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల పరిధిలోని తొమ్మిది ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. సరుకులను అసలు రవాణా చేయకుండానే వాటి నకిలీ రవాణాతోభోగస్ ఇన్ వాయిస్.లు, బిల్లులు సృష్టించడం తదితర అక్రమాలు ఈ సోదాల్లో బట్టబయలైంది.  సృష్టించిన ఈ వే బిల్లులన్నీ నకిలీ బిల్లులే అని తేలింది.

ఈ మొత్తం కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అయిన ఆశీస్ అగ్గర్వాల్ ను సి.జి.ఎస్.టి. చట్టంలోని 132వ సెక్షన్ కింద 2020, అక్టోబరు 29న అరెస్ట్ చేశారు. ఆశీస్ అగ్గర్వాల్ను ట్రాన్సిట్ జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ డ్యూటీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. పాటియాలా హౌస్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ దరఖాస్తుపై విచారణ జరిపేవరకూ అగ్గర్వాల్ ను జ్యుడిషియల్ రిమాండ్ లో కొనసాగేలా ఉత్తర్విలిచ్చారు. గత 60రోజులుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పన్ను ఎగవేత నియంత్రణ అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి పట్టుకుని అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నేరాన్ని అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేశారు.

బోగస్ బిల్లుల వ్యవస్థతో ప్రయోజనం పొందిన మెస్సర్స్ మాయా ఇంపెక్స్ సంస్థన, 66సంవత్సరాల అగ్గర్వాల్ తల్లి పేరిట నమోదైంది. ఇదే సంస్థ పేరుమీదుగానే రూ. 77కోట్ల ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ రాయితీకి ఆమోదం పొందారు. సి.జి.ఎస్.టి. చట్టంలోని 132(1)(b), 132(1)(c) సెక్షన్ల కింద ఆశీస్ అగ్గర్వాల్ అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఉల్లంఘనలన్నీ,. 132(5)వ సెక్షన్ ప్రకారం శిక్షార్హమైన, నాన్ బెయిలబుల్ నేరాలని తనకు తెలిసిప్పటికీ అగ్గర్వాల్ ఈ అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. పాల ఉత్పత్తుల పరిశ్రమకు సంబంధించిన ఐ.టి.సి. రాయితీని పొందడానికి ఈ నకిలీ బిల్లులను సృష్టించినట్టు తేలింది. నెయ్యి, పాలపొడి వంటి నకిలీ పాల ఉత్పత్తుల అమ్మకం సాగించినట్టు బోగస్ ఇన్వాయిస్ బిల్లులను కూడా తయారు చేశారు. ఈ అక్రమాల్లో అనేక ఇతర కంపెనీలతోపాటుగా, ప్రముఖ బ్రాండ్ అయిన మెస్సర్స్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ కూడా టాక్స్ క్రెడిట్ రాయితీ రూపంలో  అక్రమంగా ప్రయోజనం పొందడం ఇక్కడ గమనార్హం. సోదాల సందర్భంగా అక్రమాలకు సంబంధించిన అనేక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటివరకూ ఇన్ పుట్ క్రెడిట్ రాయితీకి సంబంధించిన 7కోట్ల రూపాయల సొమ్ము పట్టుబడింది. ఇదే సిండికేట్ తో సంబంధాలు సాగిస్తూ, నకిలీ బిల్లులతో ప్రభత్వ ఖజానాకు నష్టం కలిగించిన మరిన్నిఅక్రమ సంస్థల గుట్టును బట్టబయలు చేసేందుకు అధికారుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

 

****


(Release ID: 1668754) Visitor Counter : 226


Read this release in: English , Urdu , Hindi