ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కేరళలో మెగా ఫుడ్ పార్కు ప్రారంభం కేంద్రం సహాయంతో దేశంలో ఇప్పటికే 20 మెగా ఫుడ్ పార్కులు
మరో 17 ప్రాజెక్టులకు అనుమతి, అమలు దశలో పార్కులు
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఫుడ్ ప్రాసెసింగ్.కు ప్రధాన రంగంగా గుర్తింపు
Posted On:
01 OCT 2020 8:10PM by PIB Hyderabad
కేరళలో మొట్టమొదటిది, దేశంలో 20వది అయిన మెగా ఫుడ్ పార్కు,.. పాల్ఘాట్ జిల్లాలో ప్రారంభమైంది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర తోమర్,.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2020, అక్టోబరు 1న వర్చువల్ గా ఆన్ లైన్ ద్వారా ఈ మెగా ఫుడ్ పార్కును ప్రారంభించారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ కూడా కార్యక్రమానికి హజరయ్యారు. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార శుద్ధి పరిశ్రమ బలోపేతం కావడానికి ఈ మెగా ఫుడ్ పార్కు ఎంతో దోహదం చేస్తుంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ మాట్లాడుతూ,..కేరళ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధిలో మెగా ఫుడ్ పార్కు ఒక మైలురాయి వంటిదన్నారు. ఈ పార్కులో 25-30 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అదనంగా 250 కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు వెసులుబాటు ఉంటుందని, సంవత్సరానికి 450నుంచి 500కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ మెగా ఫుడ్ పార్కుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని, పార్కుకు సంబంధించిన సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సి.పి.సి.), ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల (పి.సి.సి.) పరిధిలో 25వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశాన్ని ఆహారోత్పాదనలకు వెసులుబాటు కలిగిన ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచానికి ఆహార కర్మాగారంగా తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. “ఆత్మనిర్భర్ భారత్” పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రాధాన్యతా రంగంగా ప్రభుత్వం పరిగణిస్తోందన్నారు. కేంద్రం సహకారంలో దేశంలో 20 మెగా ఫుడ్ పార్కులు ప్రారంభమయ్యాయని, కేరళలోని అలెప్పీ జిల్లాలో ఏర్పాటు చేయబోయే పార్కుతో మరో 17 ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించిందని అన్నారు.
రైతులు దేశానికి గర్వకారణమని, వారి కఠోర పరిశ్రమవల్లనే దేశంలో తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, దేశవాసుల అవసరాలు కూడా తీరుతున్నాయని, ఆహార ధాన్యాలు మిగులు స్థాయిలో ఉన్నాయని కేంద్రమంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో తలెత్తే అంతరాలను పూడ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్విరామంగా తన కృషిని కొనసాగిస్తున్నారన్నారు. లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారని, బడ్జెట్ లో ప్రకటించిన మేరకు కిసాన్ రైలు సర్వీసులు ప్రారంభించారని తెలిపారు.
విలువ జోడించిన వ్యవసాయ ఉత్పత్తులకు, సరుకులకు ఎగుమతి అవకాశాలు ఎక్కువని, ఇవి విదేశీ మారకద్రవ్యం ఆర్జించడమేకాక స్వదేశీ మార్కెట్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని అన్నారు. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తూ, రాష్ట్రాల నిధులను కూడా పెంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పి.ఎం. కిసాన్ సంపద యోజన రైతులకు ఎంతో ప్రయోజకారిగా ఉందన్నారు. దీనికి తోడు “ఆత్మనిర్భర్ భారత్” పథకం కింద పి.ఎం. సూక్ష్మ తరహా ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల రూపాంతీకరణ పథకాన్ని (పి.ఎం.ఎఫ్.ఎం.ఇ.ని) కేంద్రం ప్రారంభించిందన్నారు.
ఈ సందర్భంగా కేరళ ముఖ్యమత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, పాల్ఘాట్ జిల్లాలోని మెగా ఫుడ్ పార్కు కేరళ రైతులకు సహాయకారిగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ప్రమేయంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి కూడా మెరుగవుతుందన్నారు. కేరళలో పెట్రో పార్కు, కోచి-బెంగళూరు పారిశ్రామిక కారిడార్, డిఫెన్స్ పార్కు తదితర ప్రాజెక్టులతో పాటుగా ఈ మెగా ఫుడ్ పార్కు కూడా చాలా ముఖ్యమైదన్నారు. పెట్టుబడి దార్ల ముందు మెరుగైన అవకాశాలుగా ఈ ప్రాజెక్టులన్నీ నిలిచాయన్నారు. కేంద్రంనుంచి అందుతున్న సహాయాన్ని కేరళలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సానుకూలంగా మలుచుకోగలరని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఈ మెగా ఫుడ్ పార్కు మంచి ఊపునిస్తుందని విజయన్ అన్నారు.
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ మాట్లాడుతూ, మెగా ఫుడ్ పార్కులో కల్పించిన సదుపాయాలతో, వ్యవసాయ ఉత్పత్తుల వృథా తగ్గడమేకాక, ఉత్పత్తుల విలువ పెరుగుతుందని దీనితో రైతులకు మెరుగైన ధర లస్తుందని, వారి ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు. రైతులకు, స్వయం సహాయక బృందాలకు, సూక్ష్మ తరహా పారిశ్రామిక వేత్తలకు ఈ పార్కు ప్రాసెసింగ్ సదుపాయం అందిస్తుందని, పరిసరాల్లో ప్రజలకు మరింతగా ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని అన్నారు.
కేరళ పరిశ్రమల శాఖ మంత్రి ఇ.పి. జయరాజన్, జల వనరుల శాఖ మంత్రి కె.కె. కృష్ణన్ కుట్టీ కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుష్పా సుబ్రహ్మణియం, కేరళ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె. ఇళంగోవన్ ఈ ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరించారు. కేరళ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ కోషీ థామస్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ ప్రజా ప్రతినిధులు, ప్రాజెక్టు అధికారులు, రైతులు, మెగా ఫుడ్ పార్కు అధికారులు హాజరయ్యారు.
కిన్ఫ్రా మెగా ఫుడ్ పార్క్ పేరిట ఈ మెగా ఫుడ్ పార్కును 79.42 ఎకరాల విస్తీర్ణంలో రూ. 102.13కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ మెగా ఫుడ్ పార్కులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సి.పి.సి.)లో పలు సదుపాయాలను కల్పించారు. పలు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి వీలుగా 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో శీతలీకరణ గిడ్డంగులు, 12 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సాధారణ గిడ్డంగులు, గంటకు 10 మెట్రిక్ టన్నుల మేర ఉత్పాదనలను సార్టింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ చేయగలిగే ప్యాక్ హౌస్ సదుపాయం, 120 మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తులను పక్వానికి పెట్టే సదుపాయం ఈ పార్కులో అందుబాటులో ఉన్నాయి. అంతేకాక, రోజుకు 15 మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తులను ఆరబెట్టేందుకు తగిన యాంత్రిక సదుపాయం, ఆహార ఉత్పత్తులపై పరీక్షలు నిర్వహించే ల్యాబరేటరీ, దానికి అనుబంధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞాన మౌలిక సదుపాయాలు, కార్యాలయానికి, పారిశ్రామిక వేత్తల ఇతర వినియోగాలకోసం ఉమ్మడి పరిపాలనా భవనం, 4 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు (ఎర్నాకుళం జిల్లాలోని మళువన్నూరు, త్రిసూర్ లోని కోరట్టి, మాలాపురంలోని కక్కంచేరీ, కాల్పెట్టాలోని వైనాడ్ ప్రాంతాల్లో), రైతులకు ప్రయోజనం కోసం ప్యాక్ హౌస్ సదుపాయం ఈ పార్కు పరిధిలోనే ఉన్నాయి. ఈ మెగా ఫుడ్ పార్కుతో, పాల్ఘాట్ జిల్లా వాసులకే కాకుండా, సమీపంలోని మలప్పురం, త్రిస్సూర్ జిల్లాలకు, తమిళనాడు రాష్ట్రం పరిధిలోని కోయంబత్తూరు జిల్లా వాసులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.
****
(Release ID: 1660929)
Visitor Counter : 88