జౌళి మంత్రిత్వ శాఖ
చేనేత రంగం అభివృద్ధి
Posted On:
17 SEP 2020 1:48PM by PIB Hyderabad
దేశంలో చేనేత రంగాన్ని కాపాడి, అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ప్రయత్నం. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధి మరియు చేనేత చేనేత కార్మికుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా ఈ క్రింది పథకాలను అమలు చేస్తోంది: -
1. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్.హెచ్.డి.పి)
2. సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం (సి.హెచ్.సి.డి.ఎస్)
3. చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం (హెచ్.డబ్ల్యు.సి.డబ్ల్యు.ఎస్)
4. నూలు సరఫరా పథకం (వై.యస్.ఎస్)
ఈ పథకాల కింద, ముడి పదార్థాలు, మగ్గాలు మరియు ఉపకరణాల కొనుగోలు, డిజైన్ ఆవిష్కరణ, ఉత్పత్తుల ప్రొడక్ట్ వైవిధ్యీకరణ , మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి మొదలైన కోసం ఆర్థిక సహాయం అందించబడుతుంది.
1. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డిపి)
i. బ్లాకు స్థాయి క్లస్టర్:
జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్.హెచ్.డి.పి) యొక్క భాగాలలో ఒకటిగా 2015-16 లో ప్రవేశపెట్టబడింది. నైపుణ్యాభివృద్ధి, హాత్ కార్గ సంవర్ధన్ సహాయత, ఉత్పత్తి అభివృద్ధి, వర్క్‌షెడ్ నిర్మాణం, ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయం, డిజైన్ అభివృద్ధి, సాధారణ సౌకర్యాల కేంద్రం (సి.ఎఫ్.సి) ఏర్పాటు మొదలైన వివిధ కార్యక్రమాల కోసం బి.ఎల్.సి. కి 2.00 కోట్ల రూపాయల చొప్పున ఆర్ధిక సహయం అందించడం జరిగింది. వీటితోపాటు, జిల్లా స్థాయిలో ఒక "డై హౌస్" ఏర్పాటుకు 50.00 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది.
ii. చేనేత మార్కెటింగ్ సహాయం :
జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం యొక్క భాగాలలో చేనేత మార్కెటింగ్ సహాయం ఒకటి.
చేనేత ఏజెన్సీలు / చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి వీలుగా, మార్కెటింగ్ వేదికను అందించడానికి, దేశీయ మరియు విదేశీ మార్కెట్లలో మార్కెటింగ్ ఈవెంట్లను నిర్వహించడానికి రాష్ట్రాలు / అర్హతగల చేనేత ఏజెన్సీలకు, ఆర్థిక సహాయం అందించబడుతుంది.
iii. నేత కార్మికుల ముద్ర స్కీం:
వీవర్ ముద్రా పథకం కింద, చేనేత కార్మికులకు 6 శాతం రాయితీ వడ్డీ రేటుతో ఋణం అందించబడుతుంది. మార్జిన్ డబ్బు సహాయం గరిష్టంగా చేనేత కార్మికునికి 10,000 రూపాయలు చొప్పున, 3 సంవత్సరాల కాలానికి రుణహామీ కూడా ఇవ్వబడుతుంది. మార్జిన్ మనీ మరియు వడ్డీ ఉపసంహరణ కోసం నిధుల పంపిణీ ఆలస్యాన్ని తగ్గించడానికి ముద్రా పోర్టల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహకారంతో అభివృద్ధి చేయబడింది.
iv. హత్కర్గా సంవర్ధన్ సహాయత (హెచ్.ఎస్.ఎస్.) :
చేనేత ఉత్పత్తుల యొక్క మెరుగైన ఉత్పాదకత మరియు నాణ్యత ద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించడానికి వీలుగా, చేనేత కార్మికులకు మగ్గాలు / ఉపకరణాలు అందించే లక్ష్యంతో, 2016 డిసెంబర్, 1వ తేదీన, హత్కర్గా సంవర్ధన్ సహాయత (హెచ్.ఎస్.ఎస్.) పధకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద, మగ్గం, అనుబంధ ఖర్చు లో 90 శాతం భారత ప్రభుత్వం భరిస్తుంది, మిగిలిన 10 శాతం లబ్ధిదారుడు భరించవలసి ఉంటుంది. భారత ప్రభుత్వ వాటా చేనేత కార్మికుల సేవా కేంద్రం ద్వారా, సరఫరాదారులకు విడుదల అవుతుంది.
v. చేనేత కార్మికులకు మరియు వారి పిల్లల విద్య:
నేత కార్మికులకు మరియు వారి కుటుంబాలకు విద్యా సదుపాయాలను కల్పించడానికి జౌళి మంత్రిత్వ శాఖ ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్.ఐ.ఓ.ఎస్) లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. చేనేత కార్మికుల కోసం, డిజైన్, మార్కెటింగ్, వ్యాపార అభివృద్ధి మొదలైన ప్రత్యేక విషయాలతో, దూర విద్యా విధానం ద్వారా, సెకండరీ మరియు సీనియర్ సెకండరీ స్థాయి విద్యను ఎన్.ఐ.ఓ.ఎస్. అందిస్తోంది. అదేవిధంగా, కెరీర్ పురోగతి కోసం చేనేత కార్మికులు, వారి పిల్లల ఆకాంక్షలకు సంబంధించిన ప్రాప్యత మరియు సౌకర్యవంతమైన అభ్యాస అవకాశాల ద్వారా ఇగ్నో నిరంతర విద్యా కార్యక్రమాలను అందిస్తోంది.
చేనేత కార్మికుల కుటుంబాలకు చెందిన, ఎస్.సి., ఎస్.టి., బి.పి.ఎల్., మరియు మహిళా అభ్యాసకుల విషయంలో ఎన్.ఐ.ఓ.ఎస్. / ఇగ్నో కోర్సుల్లో ప్రవేశానికి 75 శాతం ఫీజును తిరిగి చెల్లించాలని ఈ కార్యక్రమం సంకల్పించింది.
vi. “భారత చేనేత” బ్రాండ్ :
2015 ఆగష్టు, 7వ తేదీన, జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా, అధిక నాణ్యత గల చేనేత ఉత్పత్తుల బ్రాండింగ్ కోసం గౌరవ ప్రధానమంత్రి ‘భారత చేనేత’ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఇది లోపే రహితంగా మరియు పర్యావరణ హితంగా, అధిక నాణ్యత, ప్రామాణికమైన సాంప్రదాయ డిజైన్లతో సముచిత చేనేత వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ బ్రాండు ప్రారంభించినప్పటి నుండి, 184 ఉత్పత్తి వర్గాల కింద 1590 రిజిస్ట్రేషన్లు జారీ చేయడం జరిగింది, మరియు 926.23 కోట్ల రూపాయలు వసూలయ్యాయి.
తమ బ్రాండ్‌లో ప్రత్యేక శ్రేణి చేనేత వస్త్రాలను, వివిధ ప్రముఖ బ్రాండ్ లతో ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కార్యక్రమాలు చేపట్టారు
vii. ఈ-కామర్సు :
చేనేత ఉత్పత్తుల ఈ-మార్కెటింగ్ ను ప్రోత్సహించడానికి, ఒక విధానాన్ని రూపొందించడం జరిగింది. దీని కింద మంచి మార్కెటింగ్ చరిత్ర, అనుభవం ఉన్న ఏదైనా ఈ-కామర్సు వేదిక, చేనేత ఉత్పత్తుల ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో పాల్గొనవచ్చు. ఈ నేపథ్యంలో, చేనేత ఉత్పత్తుల ఆన్ లైన్ మార్కెటింగ్ కోసం 23 ఈ-కామర్సు సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మొత్తం 110.46 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగాయి.
viii. అర్బన్ హాట్స్ :
హస్త కళాకారులు, చేనేత కార్మికులకు తగిన ప్రత్యక్ష మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడానికి మరియు మధ్య ఏజెన్సీలను తొలగించడానికి పెద్ద పట్టణాలు, మెట్రోపాలిటన్ నగరాల్లో అర్బన్ హాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇటువంటి 39 అర్బన్ హాట్స్ మంజూరయ్యాయి.
2. సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం:
సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం (సి.హెచ్.సి.డి.ఎస్) 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్కొక్క క్లస్టర్ కు 40 కోట్ల రూపాయల చొప్పున భారత ప్రభుత్వ (జి.ఓ.ఐ) సహకారంతో, కనీసం 15 వేల చేనేత మగ్గాలను స్పష్టంగా గుర్తించదగిన భౌగోళిక ప్రదేశాలలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. డయాగ్నొస్టిక్ స్టడీని నిర్వహించడం, ముడిసరుకు కోసం కార్పస్ మొదలైన వాటికి భారత ప్రభుత్వం (జి.ఓ.ఐ) పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. ఇక్కడ లైటింగ్ యూనిట్లు, మగ్గాలు మరియు ఉపకరణాల సాంకేతిక పరిజ్ఞానం వంటి సౌకర్యాలకు 90 శాతం జి.ఓ.ఐ. ద్వారా నిధులు సమకూరుతాయి. డిజైన్ స్టూడియో / మార్కెటింగ్ కాంప్లెక్స్ / గార్మెంటింగ్ యూనిట్ కోసం మౌలిక సదుపాయాల కల్పన, మార్కెటింగ్ అభివృద్ధి, ఎగుమతులకు సహాయం మరియు ప్రచారం వంటి ఇతర మౌలిక సదుపాయాలకు 80 శాతం నిధులతో ఉన్నాయి. 08 మెగా చేనేత సమూహాలు - వారణాసి (ఉత్తర ప్రదేశ్), శివసాగర్ (అస్సాం), విరుధునగర్, తిరుచ్చి (తమిళనాడు), ముర్షిదాబాద్ (పశ్చిమ బెంగాల్), ప్రకాశం, గుంటూరు జిల్లాలు (ఆంధ్రప్రదేశ్), గొడ్డా మరియు పొరుగు జిల్లాలు (జార్ఖండ్), భాగల్పూర్ (బీహార్) లను అభివృద్ధి కోసం చేపట్టారు.
3. చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం :
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి.ఎమ్.జె.జె.బి.వై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పి.ఎం.ఎస్.బి.వై) మరియు కన్వర్జ్డ్ మహాత్మా గాంధీ బంకర్ బీమా యోజన (ఎమ్.జి.బి.బి.వై) ల కింద చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం (హెచ్.డబ్ల్యు.సి.డబ్ల్యు.ఎస్) చేనేత కార్మికులకు జీవిత బీమాతో పాటు ప్రమాదవశాత్తు మరియు వైకల్యం భీమా కవరేజీని అందిస్తోంది.
4. నూలు సరఫరా పథకం:
మిల్ గేట్ దగ్గర ఉండే ధరతో అన్ని రకాల నూలును అందుబాటులో ఉంచడానికి దేశవ్యాప్తంగా నూలు సరఫరా పథకం అమలు చేయబడుతోంది. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ద్వారా ఈ పధకం అమలౌతోంది. పథకం కింద సరుకు రవాణా చార్జీలు తిరిగి చెల్లించడం జరుగుతుంది మరియు డిపో నిర్వహణ ఛార్జీల కింద డిపో ఆపరేటింగ్ ఏజెన్సీలకు 2 శాతం అందజేస్తారు. నూలు కండె నూలు ధరపై కూడా 10 శాతం సబ్సిడీ ఉంది. పత్తి, దేశీయ పట్టు, ఉన్ని మరియు నార నూలుపై ఈ సబ్సిడీ, పరిమాణ పరిమితులతో వర్తిస్తుంది.
జనతా పథకాన్ని పునరుద్ధరించే ప్రణాళిక లేదు.
కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని పేర్కొన్నారు.
****
(Release ID: 1655842)
Visitor Counter : 1355