సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
లండన్ లో భారత హై కమిషన్ లో దేశానికి చెందిన మూడు కళాఖండాల అప్పగింత కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి
ఈ కళాఖండాలు క్రీస్తుశకం 15వ శతాబ్ది నాటి రామ, లక్ష్మణ, సీతా కంచు లోహమూర్తులు
Posted On:
15 SEP 2020 7:04PM by PIB Hyderabad
కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, పర్యాటక శాఖ ఇన్ చార్జి మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ లండన్ లోని భారత హై కమిషన్ కార్యాలయంలో దేశానికి చెందిన మూడు విలువైన ప్రాచీన కళాఖండాల అప్పగింత కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామ లక్ష్మణులు, మాతా సీత కంచు విగ్రహాలను బ్రిటిష్ పోలీసులు లండన్ లోని భారత హై కమిషన్ కు అప్పగించారు.
ఆ విలువైన లోహ విగ్రహాలను తిరిగి భారత్ కు తీసుకురావడంలో చేసిన కృషికి బ్రిటిష్ పోలీసులకు, తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక విగ్రహ విభాగానికి, భారత పురావస్తు సర్వే విభాగానికి, లండన్ లోని భారత హై కమిషన్ కు మంత్రి శ్రీ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక విగ్రహ విభాగం, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, లండన్ లోని భారత హై కమిషన్ నిరంతరాయంగా చేపట్టిన చర్యల వల్లనే ఆ విగ్రహాలను తీసుకురావడం సాధ్యమయిందని ఆయన అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2014 వరకు కేవలం 13 విలువైన పురాతన విగ్రహాలు విదేశాల నుంచి దేశానికి అందగా 2014 నుంచి ఇప్పటికి 40 విగ్రహాలు రావడం ఆనందదాయకమైన విషయమని సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అన్నారు. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని కళాఖండాలు తీసుకురావడానికి తాము కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. వాగ్దేవి విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు బ్రిటిష్ మ్యూజియంతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.
భగవాన్ రామ, లక్ష్మణ, సీతామాత విగ్రహాలు 90.5 సెంటీమీటర్లు, 78 సెంటీమీటర్లు, 74.5 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్న భారత లోహకళాఖండాలు. విజయనగర్ కాలానికి చెందిన దేవాలయం నుంచి ఈ విగ్రహాలను చౌర్యం చేశారు. ఇవి క్రీస్తు శకం 15వ శతాబ్ది నాటి లోహవిగ్రహాలు.
*****
(Release ID: 1654909)
Visitor Counter : 113