కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
నిరుద్యోగిత రేటును నిలవరించేలా ప్యాకేజీ
Posted On:
14 SEP 2020 6:12PM by PIB Hyderabad
కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచ వ్యాప్తి ఆ తరువాత దాని నియంత్రణకు చేపట్టిన లాక్‌డౌన్లు భారతదేశంతో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేశాయని కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ సంతోష్ గంగ్వార్ అన్నారు. కోవిడ్-19 ఫలితంగా అధిక సంఖ్యలో వలస కార్మికులు తమతమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారని, ఇదే సమయంలో భారతదేశంలోనూ కొందరు ఉద్యోగాలు కోల్పోవడం కూడా గమనించబడిందని గంగ్వార్ తెలిపారు. ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు మంత్రి గంగ్వార్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు.
రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ..
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనా (పీఎంజీకేవై), ఆత్మనిర్భర్ భారత్ & ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ (పీఎమ్‌జీకేఆర్ఏ) ద్వారా స్థానిక స్థాయిలోనే ఉద్యోగాలు కల్పించడానికి మరియు వలస కార్మికులకు మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చొరవ తీసుకుందని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, విధానం, శక్తిమంతమైన జనాభా, డిమాండ్ ఆధారంగా దేశంలో యువతకు తగిన ఉద్యోగాలు సృష్టించేలా రూపొందించడమైనది. దేశంలో తగిన ఉపాధి అవకాశాలను కల్పించడానికి వీలుగా రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇది కలిగి ఉందని ఆయన అన్నారు. పీఎంజీకేవై కింద, ఆహార ధాన్యాలు, ఎక్స్-గ్రేషియా చెల్లింపులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అందించడంతో పాటు, కొన్ని సంస్థలలో పనిచేసే పలువురు ఉద్యోగులకు ఈపీఎఫ్ చందా దెల్లింపులను ప్రభుత్వమే జరిపిందన్నారు. దేశంలో ఎంఎస్‌ఎంఈ రంగం పరిశ్రమలకు తగిన తోడ్పటును అందించేలా ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టిందని మంత్రి తెలిపారు.
ఎంజీఎన్‌ఆర్ఈజీఏ వేతనం పెంపు..
కేంద్రం ఎంజీఎన్‌ఆర్ఈజీఏ కింద అందజేస్తున్న వేతనాన్ని రోజుకు రూ.182 నుంచి రూ.202 లకు పెంచడం ద్వారా 13.62 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని శ్రీ గంగ్వార్ తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ (పీఎంజీకేఆర్ఏ) కింద భారత ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాలు మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఊతం ఇచ్చేలా వివిధ కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి వివరించారు. ముఖ్యంగా వలస వచ్చిన వారికి స్థానికంగా తగిన విధంగా ఉపాధి అవకాశాలను కల్పించే చర్యలు చేపట్టినట్టుగా మంత్రి తెలిపారు. రూ.50 వేల కోట్ల మేర రిసోర్స్ ఎన్వలప్‌తో ఆరు రాష్ట్రాలు 116 జిల్లాలలో ఇది అమలవుతోందని మంత్రి తెలిపారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 125 రోజుల మిషన్ మోడ్ విధానంలో ఇది అమలవుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. వ్యవసాయం, మత్స్య రంగం, ఆహార ప్రాసెసింగ్ రంగం. మౌలిక సదుపాయాలు లాజిస్టిక్స్, సామర్థ్యపు పెంపు, వ్యవసాయ రంగంలో పాలన మరియు పరిపాలన సంస్కరణలను బలోపేతం చేసే చర్యలను ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి వివరించారు. వీధి విక్రేతలు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి భారత ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించినట్లు శ్రీ గంగ్వార్ తెలియజేశారు. ఈ పథకం కింద ప్రభుత్వం సంవత్సరం గడువుతో రూ.10,000 వరకు అనుషంగిక ఉచిత నిర్వహణ మూలధనాన్ని అందించనున్నట్టుగా తెలిపారు. సుమారు 50 లక్షల మంది వీధి విక్రేతలు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని శ్రీ సంతోష్ గంగ్వార్ వివరించారు.
****
(Release ID: 1654403)
Visitor Counter : 166