ఆయుష్

భారతీయ ఔషధ, హోమియోపతి కోసం ఆయుష్ మంత్రిత్వశాఖ కింద ఫార్మకోపియా కమిషన్ ఏర్పాటుకు కాబినెట్ ఆమోదం

Posted On: 03 JUN 2020 5:14PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కాబినెట్ సమావేశం భారతీయ ఔషధ, హోమియోపతి కోసం ఆయుష్ మంత్రిత్వశాఖ కింద ఫార్మకోపియా కమిషన్ ఏర్పాటుకు  ఆమోదముద్ర వేసింది. ఘజియాబాద్ లో 1975 లో ఏర్పాటు చేసిన రెండు కేంద్రీయ లేబరేటరీలు - భారతీయ ఔషధాల  ఫార్మకోపియా లేబరేటరీని, హోమియోపతిక్ ఫార్మకోపియా లేబరేటరీని విలీనం చేసి ఈ కమిషన్ ఏర్పాటు చేసింది.


ప్రస్తుతం భారతీయ ఔషధాలు,  హోమియోపతి కోసం పనిచేస్తున్న ఫార్మకోపియా కమిషన్  ఆయుష్ మంత్రిత్వశాఖ కింద 2010 నుంచి పనిచేస్తున్న స్వతంత్ర సంస్థ. ఈ విలీనంతో ఆయుర్వేద, యునాని, హోమియోపతి అనే మూడు విభాగాల మౌలిక వసతులను, సాంకేతిక మానవ వనరులను, ఆర్థిక వనరులను గరిష్ఠంగా వాడుకునే వీలుంటుంది. వాటిని సమర్థంగా నియంత్రించటానికి, నాణ్యతను పరిరక్షించటానికి, ఫలితాల ప్రామీణీకరణకు వెసులుబాటు కలుగుతుంది. 


ఈ విలీనం వల్ల ఆయుష్ ఔషధాల అభివృద్ధి, ఫార్మకోపియాలు, ఫార్ములాల ప్రచురణ సులువవుతుంది. అదే విధంగా విలీనమైన సంస్థ, దాని లేబరేటరీల చట్టబద్ధతకు కూడా ఇది అవసరమవుతుంది. అందుకోసం 1945 నాటి  డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టానికి తగిన సవరణలు చేయవలసి ఉంటుంది.  వైద్య సర్వీసుల డైరెక్టర్ జనరల్, సాధారణ, ఆయుర్వేద డ్రగ్స్ కంట్రోలర్,  సిద్ధ, యునాని డ్రగ్స్ టెక్నాలజీ అడ్వైజరీ బోర్డ్ తో ఇందుకు అవసరమైన సమాలోచనలు జరిగాయి.  ఈ బోర్డు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నియంత్రణావిధానాలమీద సలహాలిస్తుంది. విలీనంతో ఏర్పడిన సంస్థ నిర్మాణం, ఉద్యోగుల హోదాలు తదితర అంశాలకు ఆర్థిక మంత్రిత్వశాఖలోని వ్యయాల విభాగం ఆమోదం తెలియజేసింది.


ఆయుష్ మంత్రిత్వశాఖ కింద ఉన్న ఈ రెండు సంస్థలూ ఇప్పుడు విలీనం అవుతున్నందున ఇక మీదట వీటిమీద పరిపాలనాపరంగా ఉమ్మడి నియంత్రణ ఉంటుంది.  విలీనం అనంతరం  ఫార్మకోపియా సంబంధమైన పనులకు వీలుగా దీనికి తగిన పరిపాలనా నిర్మాణం ఉంటుంది. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి ఔషధాలలొ ఒకటే మళ్ళీ మళ్ళీ వాడాల్సిన అవసరం లేకుండా ప్రామాణికత సాధిస్తారు. ఆవిధంగా వనరులను సమర్థంగా వాడుకునే వీలుంటుంది.

 


(Release ID: 1629156) Visitor Counter : 162