PIB Headquarters
కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య విధానాలను అమలు చేస్తున్న ఎన్టీపీసీ సింహాద్రి
Posted On:
29 APR 2020 4:12PM by PIB Hyderabad
ఆర్దిక వ్యవస్థ సజావుగా సాగడానికి అవసరమైన విద్యుత్ ను నిరంతరం అందించడంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ప్రాధాన్యత పాత్ర అత్యధికంగా వుంది.కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మార్గదర్శకాలను, సామాజిక దూర నియమాన్ని పాటిస్తూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనలకు అనుగుణంగా జాతీయ బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కార్పొరేషన్ ( ఎన్టీపీసీ) పని చేస్తూ..దేశానికి అవసరమైన కరెంటును నిరంతరం ఉత్పత్తి చేస్తూ వుంది.
విద్యుత్ ఉత్పత్తిలో ఎన్టీపీసీ కనబరుస్తున్న స్ఫూర్తిని కరోనా మహమ్మారి ఏమీ చేయలేకపోతోంది. ఎందుకంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎన్టీపీసీ నిరంతరం విద్యుత్‌ను ఉత్పత్తి చేసి దేశానికి అందించడమే దీనికి నిదర్శనం. ఎన్టీపీసీ కింద వున్న ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొంటూ ఉత్తమ స్థాయిలో పని చేస్తోంది. కోవిడ్ -19 వైరస్ సంక్షోభమనేది దేశంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ప్రాధాన్యతను చాటుతోంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పలు రంగాలు సజావుగా నడవాలంటే వాటికి విద్యుత్ చాలా ముఖ్యం. బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిరంతరం పని చేయడానికి వీలుగా వాటికి ఎప్పటికప్పుడు ఎన్టీపీసీ నుంచి తగిన బొగ్గు నిల్వల సరఫరాలు వెలుతున్నాయి.
24 గంటలూ విద్యుత్ సరఫరా జరగడానికిగాను ఎన్టీ పీసి ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. లాక్ డౌన్ కు సంబంధించిన అన్ని నిబంధనల్ని ఎన్టీపీసీ అమలు చేస్తోంది. విద్యుత్ ఉత్పత్తితోపాటు సామాజిక సేవలో కూడా ఎన్టీపీసీ ముందుంది. ప్లాంట్ల పరిధిలోని వలస కార్మికులకు, పేద ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను, ఆరోగ్య వైద్య సేవలను ఎన్టీపీసీ అందిస్తోంది. కరోనా మహమ్మారికి సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దేశంలో ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవడానికి ఎన్టీపీసీ యాజమాన్యం తన వంతు పాత్ర పోషిస్తోంది.
ఎన్టీపీసీ కింద పని చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ముఖ్యమైంది ఎన్టీపీసీ సింహాద్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలో వున్న ఈ విద్యుత్ కేంద్రం 2 వేల మెగావాట్ల సామర్థ్యంగలది. అంతరాయం కలగకుండా విద్యుత్ ను సరఫరా చేస్తూనే ఉద్యోగుల, కార్మికుల సంక్షేమంకోసం కృషి చేస్తోంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా యుద్ద ప్రాతిపదికన అనేక సహాయక చర్యలు చేపడుతూ, అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు జిల్లా అధికారులకు ఎన్టీపీసీ సింహాద్రి సహకారం అందిస్తోంది. వలస కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించడమే కాకుండా విశాఖ జిల్లా యంత్రాంగానికి రూ. 30 లక్షల విరాళాన్ని ఎన్టీపీసీ సింహాద్రి అందించింది. పిపిఇలు, కిట్లు, శానిటైజర్లు, మాస్కుల సరఫరా చేయడానికిగాను ఈ విరాళాన్ని అందించింది. దీనికితోడు సిజిఎం శ్రీ వి. సుదర్శన్ బాబు రూ. 5 లక్షల వ్యక్తిగత విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు అందించారు.
ఎన్టీపీసీ సింహాద్రి నిర్వహణలో అన్ని లాక్ డౌన్ మార్గదర్శకాలను అమలు చేస్తూనే ఉద్యోగులు, కార్మికులు, ఇతర సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ వస్తోంది. ప్లాంటులోకి వచ్చేవారికి, టౌన్ షిప్‌లోకి వచ్చేవారికి ఎప్పటికప్పుడు థెర్మల్ స్క్రీనింగ్ చేస్తూనే వున్నారు. అంతేకాదు ఎలాంటి సమావేశాలున్నా సరే వాటిని వీడియా కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా నిర్వహించడం జరుగుతోంది.
ఎన్టీపీసి ఉద్యగులు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి దేశంలోను, విదేశాల్లోను ప్రయాణం చేసినవారందరి వివరాలను ఎన్టీపీసీ ఆసుపత్రులు సేకరించాయి. అలాగే కరపత్రాలు, పోస్టర్లు, వీడియోలద్వారా ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కరోనా మహమ్మారి వైరస్ పై తగిన చైతన్యం కలిగించడం జరిగింది. పారిశుద్ధ్యం, సామాజిక దూరంపై తగిన అవగాహన కల్పించారు. సమావేశాలను, క్లబ్బులను, జిమ్ములను పూర్తిగా మూసేయడం జరిగింది.
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఎన్టీపీసీ సింహాద్రి ఆధ్వర్యంలో 24 పడకల ఐసోలేషేన్ వార్డును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి తలెత్తినా దాన్ని ఎదుర్కోవడానికి వీలుగా ఎన్టీపీసీ ఆసుపత్రిలో తగిన వైద్య ఆరోగ్య సామగ్రిని సమకూర్చుకోవడం జరిగింది. దీనికితోడుగా కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 24 గంటలూ పని చేస్తూ లాక్ డౌన్ కు సంబంధించిన అన్ని మార్గదర్శకాల అమలును పర్యవేక్షిస్తోంది. ఇక ప్లాంట్ లోను, చుట్టుపక్కల ప్రదేశాల్లోను, టౌన్ షిప్పులోను, చుట్టుపక్కల గ్రామాల్లోను యంత్రాలద్వారా క్రిమిసంహారక మందులను విస్తృతంగా పిచికారీ చేయడం జరిగింది.
ఇక వైరస్ ను నిరోదించడంలో భాగంగా మరో ముఖ్యమైన పనిని ఎన్టీపీసీ సింహాద్రి చేపట్టింది. మనిషి శరీరమంతా శానిటైజ్ చేసే ప్రత్యేక ఛాంబర్లను ఏర్పాటు చేసింది. ఈ ఛాంబర్లను వీటిలో ఉపయోగించే రసాయన మందులను ఎన్టీపీసీ సింహాద్రిలోనే తయారు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని విధానాలుంటే అన్నటినీ ఎన్టీపీసీ సింహాద్రిలో ఆచరించడం జరుగుతోంది. ఎన్టీపీసీ సింహాద్రికి చెందిన దీపికా మహిళల క్లబ్ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాస్కులను, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది.
విద్యుత్ ఉత్పత్తిలో గతంలో పలు రికార్డులు సాధించిన ఎన్టీపీసీ సింహాద్రి ఈ కరోనా మహమ్మారి సమయంలో కూడా చిత్తశుద్ధితో పని చేస్తూ ప్రజల సేవకు అంకితమైంది. షెడ్యూల్ ప్రకారం విద్యుత్ సరఫరాను కొనసాగిస్తోంది. అంతే కాదు పవర్ స్టేషన్ కు క్రమం తప్పకుండా బొగ్గు సరఫరా జరుగుతోంది. మనకు తగినన్ని నిలువలు కూడా వున్నాయి.
ఇక ఎన్టీపీసీ విరాళాల విషయానికి వస్తే ...ప్రధాని కేర్స్ ఫండ్‌కు రూ. 250 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని అంటే రూ. 7.5 కోట్లను ప్రధాని కేర్స్ ఫండ్ కు అందించారు.
..............
(Release ID: 1619265)
Visitor Counter : 176