రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్-19పై పోరాటంలో డిఆర్ డిఓ కృషి

Posted On: 27 MAR 2020 8:33PM by PIB Hyderabad

చైనాలోని వుహాన్ నగరంలో కరోనా (కోవిడ్-19) విశ్వరూపం ప్రదర్శిస్తున్నట్టు ప్రపంచ మీడియాలో వార్తలు రావడం మొదలైన నాటి నుంచి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఓ) ఆ వ్యాధి విస్తరణను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంది. భారతదేశంలో దాని విస్తరణను నిలువరించేందుకు 2020 మార్చి మొదటి వారంలో చర్యలు ప్రారంభమైన నాటి నుంచి డిఆర్ డిఓ కూడా తన వంతు కృషి ప్రారంభించింది. అప్పటికే భారత్ లో కరోనా వ్యాధి బాధితుల సంఖ్య 30కి చేరింది. కోవిడ్-19 ఒక సంక్షోభంగా మారినట్టయితే అత్యంత కీలకమైన వైద్యపరికరాల సరఫరా భారీ ఎత్తున చేపట్టేందుకు దృష్టి సారించింది. ఆ కృషి ఫలితంగానే ప్రస్తుతం డిఆర్ డిఓ చేతిలో “కరోనాపై పోరాటం”లో భాగంగా అందించడానికి నాలుగు విభిన్నమైన ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నాయి.
హ్యాండ్ శానిటైజర్లు
కరోనా విస్తరణను అరికట్టడంలో అత్యంత మౌలికమైన హ్యాండ్ శానిటైజర్లను డిఆర్ డిఓ అభివృద్ధి చేసింది. శానిటైజర్లను భారీ పరిమాణంలో తయారుచేసి మార్చి మూడో వారానికల్లా రాజధానిలోని ప్రధాన కార్యాలయాలు, సంస్థలకు అందచేసింది. భారత సాయుధ దళాల, సాయుధ దళాల వైద్య విభాగం, రక్షణ భద్రతా దళాలకు సుమారు 4 వేల లీటర్లు, రక్షణ మంత్రిత్వ శాఖకు 1500 లీటర్లు, పార్లమెంటుకు 300 లీటర్లు, విభిన్న భద్రతా కార్యాలయాలు, ఉన్నత స్థాయి కార్యాలయాలకు 500 లీటర్ల శానిటైజర్ ను సరఫరా చేసింది. పాలనా యంత్రాంగం కరోనా విస్తరణ భయం లేకుండా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ పోలీసులు శాంతిభద్రతలు కాపాడడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఈ సమయంలో వారు సురక్షితంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉన్నదని గుర్తించిన డిఆర్ డిఓ వారికి 20 వేల త్రీప్లై మాస్క్ లు, వెయ్యిలీటర్ల శానిటైజర్లు అందించింది. ఇది కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న 40 నకాలకు (రాత్రి ఆశ్రయాలు) కూడా హ్యాండ్ శానిటైజర్లను డిఆర్ డిఓ అందించింది. 
అవసరమైన సంస్థలన్నింటికీ మరింత అధికంగా హ్యాండ్ శానిటైజర్లు అందించేందుకు డిఆర్ డిఓ సిద్ధంగా ఉంది. ప్రారంభంలో గ్వాలియర్ లోని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఇ) అనుబంధ డిఆర్ డిఓ ల్యాబ్ తమ ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాలు/మంత్రిత్వ శాఖల కోసం సుమారు 20 వేల లీటర్ల శానిటైజర్ ఉత్పత్తి చేసింది. ఇదిలా ఉండగా గ్వాలియర్ కు చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉన్న వెండార్ మెసర్స్ గ్వాలియర్ ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ ను (డిఆర్ డిఇ గ్వాలియర్ సాంకేతిక మద్దతు ఇవ్వడంతో పాటు నాణ్యత పరీక్షలకు శాస్త్రవేత్తలను నియమించింది) గుర్తించింది. ఆ సంస్థ 200-500 ఎంఎల్ పరిమాణం గల 20 వేల నుంచి 30 వేల బాటిళ్లను రోజూ తయారుచేసింది. వాటి ధర జిఎస్ టితో కలిపి లీటర్ కు రూ.120 లోపే ఉంది.
వెంటిలేటర్లు
కోవిడ్-19 ఊపిరితిత్తుల పనితీరును (పల్మోనరీ) ప్రభావితం చేస్తున్నందు వల్ల భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని డిఆర్ డిఓకి చెందిన సొసైటీ ఫర్ బయోమెడికల్ టెక్నాలజీ (ఎస్ బిఎంటి) విభాగాన్ని ప్రస్తుత అవసరాలకు దీటుగా నవీకరించారు. క్రిటికల్ కేర్ వెంటిలేటర్ ఉత్పత్తి చేసే బాధ్యత నిర్వర్తించేందుకు ఒక వెండార్ ను (మెసర్స్ స్కాన్రే టెక్ ప్రైవేట్ లిమిటెడ్, మైసూరు) బెంగళూరులోని డిఆర్ డిఓకి చెందిన రక్షణ బయో ఇంజనీరింగ్, ఎలక్ర్టో మెడికల్ లేబరేటరీ (డిఇబిఇఎల్) గుర్తించింది. ఆ సంస్థ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి బ్రీత్ రెగ్యులేటర్లు, ప్రెషర్/ ఫ్లో సెన్సర్లు తయారుచేస్తోంది. ప్రస్తుతం ఎక్కువ మంది రోగులకి అమర్చేందుకు వీలు గల సింగిల్ వెంటిలేటర్ (మల్టీ పేషెంట్ వెంటిలేటర్) తయారుచేసేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ సరికొత్త ఉత్పత్తి అందుబాటులోకి రావచ్చునంటున్నారు. మొదటి నెలలో 5 వేల వెంటిలేటర్లు తయారుచేసి ఆ తర్వాత నెలకి 10 వేల వెంటిలేటర్లు తయారుచేయాలని భావిస్తున్నారు. అలాగే అత్యంత కీలకమైన పరికరాల సరఫరాకు స్థానిక ప్రత్యామ్నాయాలను డిఆర్ డిఓ గుర్తించింది. ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా డిజైన్ బదిలీకి 9 కంపెనీలను, ఆ కాంపోనెంటట్ల ఫ్యాబ్రికేషన్ కు ఆనంద్ మహీంద్రా కంపెనీని ఇప్పటికే ఫార్మాస్యూటికల్స్ కార్యదర్శి  గుర్తించారు. ఒక్కో వెంటిలేటర్ యూనిట్ ధర రూ.4 లక్షల వరకు ఉంటుంది.
ఎన్ 99 మాస్క్ లు
రెండు పొరల నానో మెష్ తో కూడిన ఐదు పొరలుండే ఎన్ 99 మాస్క్ లు అత్యంత అధునాతనమైనవి. కరోనా వ్యాధి వ్యాప్తిని నిరోధించవలసిన అత్యంత సంక్లిష్ట సమయం ఇది. వీటి తయారీ బాధ్యతను ముంబైకి చెందిన మెసర్స్ వీనస్ ఇండస్ర్టీస్ కంపెనీకి, కోల్కతాకు చెందిన మెసర్స్ ఐఎంటెక్ కంపెనీని అప్పగించారు. వీటి తయారీకి కావలసిన మెటీరియల్ ను అహ్మదాబాద్ టెక్స్ టైల్ పరిశ్రమ పరిశోధన సంఘం నుంచి సేకరిస్తున్నారు. ఒక్కోటి రూ.70 ధర ఉండే ఈ మాస్క్ ల సరఫరా కోసం ఇప్పటికే ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్లున్నాయి. 
బాడీ సూట్ లు 
కోవిడ్-19 రోగుల చికిత్సలో నిరంతరం పని చేసే వైద్యులు,  వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు అది సోకుండా ఈ బాడీ సూట్ లు రక్షణ కల్పిస్తాయి. తొలుత రేడియో ధార్మిక ఎమర్జెన్సీలు ఏర్పడిన సమయంలో మరణించిన వారి మృతదేహాలను తరలించే పనులు నిర్వహించే వారు, ఆ కార్యకలాపాలను పర్యవేక్షించే వైద్య, పారామెడికల్ సిబ్బంది కోసం డిఆర్ డిఓ ఈ బాడీ సూట్ లు తయారుచేసింది. ఇప్పుడు కోవిడ్-19 పోరాటంలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి వ్యాధికారక క్రిములు వ్యాపించకుండా ఉండేందుకు వాటిని పూర్తి శరీరపు సూట్ లుగా మార్పులు చేశారు. ఎటిఎస్ఎం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సూట్ ను ఉతికి తిరిగి వినియోగించే అవకాశం ఉంటుంది. డిఆర్ డిఓ, ఇతర సంస్థలు దీన్ని సమగ్రంగా పరీక్షించి ప్రస్తుత అవసరాలకు సరిపోతుందని ధ్రువీకరించాయి. ఇప్పటికే టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తున్న కోల్కతాకు చెందిన మెసర్స్ ఫ్రాంటియెర్ ప్రొటెక్టివ్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబైకి చెందిన మెసర్స్ మెడికిట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు వీటి తయారీకి అవసరం అయిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి గుర్తించారు. ఒక్కో సూట్ ధర రూ.7 వేలు ఉంటుంది.
 


(Release ID: 1608760) Visitor Counter : 180


Read this release in: English , Urdu , Hindi , Bengali