ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా అంశాలు
Posted On:
13 MAR 2020 7:06PM by PIB Hyderabad
కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, నిర్వహణల కోసం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి భారత ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రయాణ పరిమితులు, వీసాల రద్దు, స్వీయ నిర్బంధం వంటి అనేక ప్రజా ఆరోగ్య రక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇస్తోంది.
విమానాశ్రయాలు మరియు ఓడ రేవుల్లో స్వదేశానికి తిరిగి వస్తున్న వారికి పరీక్షలు నిర్వహించడం అదే విధంగా బాధిత దేశాల్లో ఉన్న భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి ఎంతో దోహదపడ్డాయి. కమ్యూనిటీ నిఘా, దిగ్బంధం, ఐసోలేషన్ వార్డులు, తగినంత పిపిఈలు, సుశిక్షుతులైన ఆరోగ్య సేవకులు, వేగమైన ప్రతిస్పందన బృందాలు, అవసరమైన సౌకర్యాలు వెరసి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ -19 నిరోధక చర్యలు మరింత బలోపేతం అవుతున్నాయి.
ఇప్పటివరకు మాల్దీవులు, మయన్మార్, బంగ్లాదేశ్, చైనా, అమెరికా, మడగాస్కర్, శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా మరియు పెరూ వంటి దేశాల నుంచి 48 విదేశీయులతో కలిపి 1031 మందిని భారత ప్రభుత్వం తరలించగలిగింది.
ఈ రోజు వరకు కోవిడ్ -19 బాధిత దేశాల నుంచి తరలివచ్చిన 890 మంది 14 రోజుల పరిశీలన తర్వాత ఇళ్ళకు వెళ్ళారు. 2020 ఫిబ్రవరి 1 మరియు 3 తేదీల్లో చైనాలోని వూహాన్ నుంచి వచ్చిన 654 మంది 2020 ఫిబ్రవరి 18న వారి కుటుంబాల వద్దకు వెళ్ళారు. రెండవ రౌండ్ పరీక్షల తర్వాత జపాన్ నుంచి వచ్చిన 124 మంది, చైనా నుంచి వచ్చిన 112 మంది పూర్తి పరిశీలన అనంతరం ఈ రోజు ఇళ్ళకు వెళ్ళారు.
కోవిడ్ -19 బాధిత దేశాల నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం నిర్వరామంగా కృషి చేసింది. శాస్త్రవేత్తలను, ప్రయోగ పరికరాలు పంపించి పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తోంది. ఇరాన్ లో ఇప్పటికే 1199 నమూనాలు సేకరించి, భారత్ కు తీసుకువచ్చారు.
భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం 2020 మార్చి 10న ఇరాన్ నుంచి 58 మందిని భారత్ తీసుకువచ్చింది. ఇరాన్ నుంచి ప్రజలను తీసుకువచ్చేందుకు భారతదేశం మహాన్ నుంచి కూడా విమాన సదుపాయం కల్పించింది. ఈ రోజు 44 మంది ప్రయాణికులతో ఓ విమానం ముంబైలో అడుగు పెట్టింది. ప్రస్తుతం వీరిని ముంబై లోని నేవీ కేంద్రం వద్ద పరిశీలనలో ఉంచారు. మరో మహాన్ విమానం రేపు రావచ్చని భావిస్తున్నారు. అవసరాన్ని బట్టి పరీక్షలు చేసి, భారతీయులను తీసుకు వచ్చేందుకు ఇలాంటి మరిన్ని విమానాలను ప్రభుత్వం నడపనుంది. ప్రోటో కాల్ ప్రకారం ఇరాన్ నుంచి వస్తున్న వ్యక్తుల పరీక్షలు, చికిత్సలను భారత ప్రభుత్వం సమన్వయం చేస్తోంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన నలుగు వైద్యుల బృందాన్ని భారత ప్రభుత్వం రోమ్ కు పంపింది. వారు భారతదేశంలో తదుపరి పరీక్షల కోసం అక్కడి భారతీయుల నమూనాలు సేకరించడానికి కావలసిన ప్రయోగ పరికరాలతో రోమ్ కు చేరుకున్నారు.
ఎంపిక చేసిన 30 విమానాశ్రయాల్లో 10,876 విమానాల నుంచి స్వదేశానికి చేరుకున్న మొత్త 11,71,061 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,062 మంది ప్రయాణికులు, 583 పరిచయస్తులు ఉన్న వారిని గుర్తించి ఆస్పత్రులకు తరలించారు. 42,296 మంది ప్రయాణికులను ప్రస్తుతం పరిశీలనలో ఉంచారు. వారిలో 2,559 మందికి అనారోగ్య లక్షణాలు కనిపించగా, అందులో 522 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పెద్ద మరియు చిన్న ఓడరేవుల్లో 25,504 మంది ప్రయాణికులను అదనంగా పరీక్షించారు. ల్యాండ్ పోర్ట్ లలో 14 లక్షలకు పైగా ప్రజలకు పరీక్షలు నిర్వహించారు.
నేటికి దేశంలో మొత్తం 81 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. వీరిలో కేరళకు చెందిన ముగ్గురిని చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. సప్దార్ జంగ్ లో మరో 7 మంది కోలుకున్నారు. ధృవీకరించబడిన కేసుల్లో 64 మంది భారతీయ పౌరులు కాగా, 16 మంది ఇలాలియన్ జాతీయులు మరియు 1 కెనడా జాతీయుడు ఉన్నారు. వీరికి సంబంధించిన వివరాల సేకరణ చురుగ్గా సాగుతోంది. వీరితో ప్రత్యక్ష పరిచయం ఉన్న మరో 4000 మందిని సైతం రోగ లక్షణాల పరిశీలనలో ఉంచారు.
ధృవీకరించిన కేసుల్లో కర్ణాటకకు చెందిన 76 ఏళ్ళ వ్యక్తికి కోవిడ్ -19 తో పాటు ఉబ్బసం, రక్తపోటు లాంటి ఇతర అనారోగ్యాలు కూడా ఉన్న కారణంగా మరణించినట్లు నిర్ధారణ అయ్యింది. పరిచయాల స్క్రీనింగ్ మరియు స్వీయ నిర్బంధం లాంటి అన్ని ముందస్తు చర్యలను కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రారంభించింది.
భారతీయ పౌరులు అవసరమైతే తప్ప విదేశాలకు వెళ్ళడాన్ని వాయిదా వేసుకోవాలని ప్రభుత్వ జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది. అదే విధంగా అధిక కేసులు, మరణాలు ఉన్న దేశాలకు వెళ్ళడాన్ని పూర్తిగా నిషేధించింది. భారతదేశానికి తిరిగి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులందరూ స్వీయ ఆరోగ్య పరీక్షలకు వెళ్ళడం, అదే విధంగా అవసరమైన జాగ్రత్తలు పాటించే నియామాలు ఇవ్వడం జరిగింది.
జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సంకేతాలు లేదా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించడం లేదా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క హెల్ప్ లైన్ - 011-23978046 కు కాల్ చేయండి. వైద్యుని వద్దకు వెళ్ళే ముందు ముక్కుకు అడ్డంగా మాస్క్ ధరించడం మరచిపోకండి.
*****
(Release ID: 1607020)
Visitor Counter : 126