మంత్రిమండలి
భారత జనగణన-2021 నిర్వహణ-జాతీయ జనాభా పుస్తక నవీకరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
Posted On:
24 DEC 2019 4:22PM by PIB Hyderabad
భారత జనగణన-2021తోపాటు జాతీయ జనాభా పుస్తక (NPR) నవీకరణ నిమిత్తం ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు జనగణన కోసం రూ.8,754.23 కోట్లు, జనాభా పుస్తక నవీకరణ కోసం రూ.3,941.35 కోట్లతో రూపొందించిన వ్యయ అంచనాలను కూడా ఆమోదించింది.
లబ్ధిదారులు:
జనగణన భారతదేశంలోని మొత్తం జనాభాకు సంబంధించినది కాగా, జాతీయ జనాభా పుస్తకం అసోం రాష్ట్రం మినహా దేశమంతటికీ వర్తిస్తుంది.
వివరాలు:
- భారత జనగణన ప్రపంచంలోనే అత్యంత భారీ పాలనాపరమైన, గణాంకపరమైన కసరత్తు. దశాబ్దానికి ఒకసారి నిర్వహించే ఈ జనగణన కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు.
- తొలుత నివాసాలన్నిటి జాబితా రూపొందించి, ఇళ్ల లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియ 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెలవరకూ కొనసాగుతుంది.
- ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 9 నుంచి 28వ తేదీదాకా జనాభా లెక్కింపు సాగుతుంది.
ఈ మేరకు అసోం రాష్ట్రం మినహా దేశవ్యాప్తంగా ఇళ్ల జాబితా రూపకల్పనతోపాటు జాతీయ జనాభా పుస్తక నవీకరణ ప్రక్రియ కూడా పూర్తవుతుంది.
- జాతీయ ప్రాధాన్యంగల ఈ మహా యజ్ఞం సందర్భంగా 2011లో 28 లక్షలమంది క్షేత్రస్థాయి సిబ్బంది విధులు నిర్వర్తించగా ఈసారి 30 లక్షల మంది ఇందులో పాలుపంచుకుంటారు.
- గణాంక సేకరణ కోసం మొబైల్ యాప్, పర్యవేక్షణ నిమిత్తం కేంద్ర పోర్టల్ వినియోగించనున్న నేపథ్యంలో మెరుగైన నాణ్యతతో జనాభా గణాంకాలను త్వరగా ప్రకటించే అవకాశం ఉంటుంది.
- గణాంక విస్తృతి మరింత మెరుగ్గా, వినియోగహితంగా ఉంటుంది కాబట్టి విధాన రూపకల్పన పరామితులకు అనుగుణంగా అన్ని వివరాలూ ఒక్క మీట నొక్కితే లభ్యమయ్యేలా అందుబాటులో ఉంటాయి.
- జనగణన... ఒక-సేవ రూపేణా అన్ని మంత్రిత్వ శాఖలకూ అవసరమైనప్పుడల్లా కచ్చితమైన, యాంత్రికంగా అర్ధమయ్యే, కార్యాచరణహిత రూపంలో లభ్యమవుతుంది.
ఉద్యోగావకాశాల సృష్టి సామర్థ్యంసహా ప్రధాన ప్రభావం:
- జనగణన కేవలం గణాంక కసరత్తు కాదు... దీని ఫలితాలు సాధారణ ప్రజానీకానికి కూడా వినియోగహిత రూపంలో అందుబాటులో ఉంటాయి.
- మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశోధన సంస్థలుసహా అందరు వినియోగదారులకు, భాగస్వాములకు మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుంది.
- చివరకు గ్రామ/వార్డు వంటి అత్యంత దిగువస్థాయి పాలన వ్యవస్థదాకా కూడా గణాంక పంపిణీకి వీలుంటుంది.
- సమితి స్థాయి జనగణన వివరాలు పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల సరిహద్దుల నిర్ణయానికి వీలుగా సంబంధిత కమిషనుకు అందుబాటులో ఉంటాయి.
- పాలనపరమైన లేదా అధ్యయనపూర్వక గణాంకాలతో కలిస్తే జనగణన సమాచారం ప్రభుత్వ విధాన రూపకల్పనకు శక్తిమంతమైన ఉపకరణం అవుతుంది. జనగణన... ఒక-సేవ రూపేణా అన్ని మంత్రిత్వ శాఖలకు/రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర భాగస్వాములకు అవసరమైనప్పుడల్లా కచ్చితమైన, యాంత్రికంగా అర్ధమయ్యే, కార్యాచరణహిత రూపంలో డ్యాష్‘బోర్డు వంటి సదుపాయాలతో లభ్యమవుతుంది.
- ఈ రెండు మహా యజ్ఞాలవంటి కసరత్తు ఫలితంగా సుదూర ప్రాంతాలుసహా దేశమంతా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. జనగణన, జనాభా పుస్తక కసరత్తు విధుల్లో ఉండేవారికి చెల్లించే గౌరవ వేతనానికి ఇది అదనం. ఆ మేరకు స్థానిక స్థాయిలో దాదాపు 2,900 రోజులపాటు సుమారు 48వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఒక్కమాటలో చెబితే- 2.4కోట్ల పనిదినాల ఉపాధి సృష్టించబడుతుంది. అంతేకాకుండా డిజిటల్ పద్ధతిలో, సమన్వయంతో చేసే ఈ పని స్వభావం గణాంక సేకరణకు సంబంధించింది కాబట్టి విధుల్లో ఉన్నవారితోపాటు రాష్ట్ర/జిల్లా స్థాయిలో సాంకేతిక మానవశక్తి వినియోగంవల్ల సామర్థ్య నిర్మాణం కూడా జరుగుతుంది. దీనివల్ల ఆయా వ్యక్తులకు భవిష్యత్ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే వీలుంటుంది.
అమలు వ్యూహం - లక్ష్యాలు:
- జనగణన ప్రక్రియలో ప్రతి ఇంటికీ వెళ్లి, ఇళ్ల జాబితా, జనాభా లెక్కింపునకు సంబంధించిన వేర్వేరు ప్రశ్నపత్రాలను అందజేయాల్సి ఉంటుంది.
- జనగణన చేపట్టేవారు సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వారిని నియమిస్తాయి. వారు తమకు అప్పగించిన ప్రధాన బాధ్యతతోపాటు జాతీయ జనాభా పుస్తక సంబంధిత పని కూడా చేస్తారు.
- సబ్-డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనూ జనగణన విధుల్లో సిబ్బందిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా జిల్లా యంత్రాంగం నియమిస్తాయి.
- 2021 జనగణనలో వినూత్న చర్యలేమిటంటే:-
- సమాచార సేకరణ కోసం దేశంలో తొలిసారిగా మొబైల్ యాప్ వినియోగం.
- జనగణనలో పాల్గొనే అధికారులు/ఉన్నతాధికారుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం ఏకైక ఆధార వనరుగా బహుళ భాషా మద్దతుతో పోర్టల్ వినియోగం.
- జనాభా లెక్కింపు దశలో ప్రజలకు స్వీయ-లెక్కింపు దిశగా ఆన్ లైన్ సదుపాయం. సమాచార విశ్లేషణలో సమయం పొదుపు నిమిత్తం వివరణాత్మక స్పందనల నమోదుకు కోడ్ డైరెక్టరీ
- ప్రభుత్వ ద్రవ్య చెల్లింపుల వ్యవస్థ (PFMS), ప్రత్యక్ష లబ్ధి బదిలీ వ్యవస్థలద్వారా జనగణన, జాతీయ జనాభా పుస్తక నవీకరణ విధుల్లోగల సిబ్బంది బ్యాంకు ఖాతాలకు నేరుగా గౌరవ వేతనం బదిలీ రూపంలో మొత్తం వ్యయంలో 60 శాతం లావాదేవీలు.
- క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి నాణ్యమైన శిక్షణ, జాతీయ-రాష్ట్రస్థాయి శిక్షకులను సిద్ధం చేయడం కోసం జాతీయ/రాష్ట్రస్థాయి శిక్షణ సంస్థల సేవల వినియోగం.
నేపథ్యం:
భారతదేశంలో 1872 నుంచీ క్రమం తప్పకుండా దశవార్షిక జనగణన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ మేరకు 2021 కసరత్తు 16వ జనగణన కాగా, స్వాతంత్ర్యం తర్వాత ఈ ప్రక్రియ చేపడుతుండటం ఇది 8వ సారి. వార్డు, గ్రామ, పట్టణ స్థాయులలో ప్రాథమిక సమాచారానికి అతిపెద్ద వనరు జనగణనే. ఇళ్ల స్థితిగతులు, సౌకర్యాలు-ఆస్తులు, జనాభా, మతం, ఎస్సీ/ఎస్టీల సంఖ్య, భాష, సాహిత్యం-విద్య, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు, సంతాన సాఫల్యత తదితర అనేక పరామితుల సంబంధిత సూక్ష్మస్థాయి సమాచారానికి జనగణనే మూలాధారం. జనాభా లెక్కింపు నిమిత్తం జనగణన చట్టం-1948, జనాభా నిబంధనలు-1990 చట్టబద్ధ చట్రాన్ని సమకూరుస్తున్నాయి.
ఇక పౌరసత్వ చట్టం-1955, పౌర నిబంధనలు-2003కు అనుగుణంగా జాతీయ జనాభా పుస్తకం (NPR) 2010లో రూపొందించబడింది. ఆ తర్వాత ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్యను జోడించడంద్వారా 2015లో ఇది నవీకరించబడింది.
*****
(Release ID: 1597521)
Visitor Counter : 2268