PIB Headquarters
ఇఫ్లూ ఆధ్వర్యం లో ఇరాక్, లెబనాన్, పాలస్తీనా అధికారుల కు ఆంగ్ల భాషా ప్రావీణ్యం లో ప్రత్యేక కోర్సు సర్టిఫికెట్ల ప్రదానం
Posted On:
03 MAY 2019 6:13PM by PIB Hyderabad
ఇరాక్, లెబనాన్, ఇంకా పాలస్తీనా ల నుండి వచ్చిన అధికారుల కోసం అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమం (ఐటిపి) లో భాగం గా తొమ్మిది వారాల పాటు నిర్వహించిన ‘‘ఆంగ్లభాషా ప్రావీణ్యం లో ప్రత్యేక కోర్సు’’ ముగింపు కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఇ. సురేశ్ కుమార్, న్యూ ఢిల్లీ లోని విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి.వి. నాగేంద్ర ప్రసాద్ లు హాజరయ్యారు.
అంతర్జాతీయ కార్యక్రమాలలో పాల్గొనే వారి కి ఇంగ్లీషు భాషా ప్రావీణ్యానికి మెరుగులు దిద్దేందుకు గాను ఇఎఫ్ఎల్ యూనివర్సిటీ ని ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రామ్ స్పెషల్ కామన్ వెల్త్ అసిస్టెన్స్ ఫర్ ఆఫ్రికా ప్రోగ్రామ్ (ఐటిఇసి /ఎస్ సిఎఎపి )కి సంబంధించిన సంస్థల జాబితా లో ఒక సంస్థ గా భారత ప్రభుత్వ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేర్చింది.
ఈ కోర్సు లో పాలుపంచుకొన్న వారిని ఉద్దేశించి ముఖ్య అతిథి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ, విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ‘వసుధైక కుటుంబం’ (ఈ విశ్వమంతా ఒకే కుటుంబం) అనే సూత్రాన్ని దృఢంగా విశ్వసిస్తోందన్నారు. తన కౌశలాన్ని మిత్ర దేశాలతో పంచుకోవడానికి- మరీ ముఖ్యంగా కెపాసిటీ బిల్డింగ్, పునరుత్పాదక శక్తి, ఇంకా నిలకడతనంతో కూడిన అభివృద్ధి తదితర అంశాలలో - మిత్రదేశాలతో కలసి పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఈ కోర్సు లో పాలుపంచుకొన్న వారు భాషాపరమైన నైపుణ్యాన్ని వారి వృత్తిజీవనంలో చోటు చేసుకొనే పురోగతి లో ఉపయోగించుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. వారు తాము వెళ్లే దేశాలలో భారత దేశానికి సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కూడా ఆయన కోరారు. వివిధ దేశాల నుండి కోర్సు అధ్యయనానికి వచ్చిన వారు ఆ పని ని విజయవంతంగా ముగించుకొన్నందుకు వారిని డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ అభినందించారు.
ఈ సందర్భం గా ప్రొఫెసర్ సురేశ్ కుమార్ అధ్యక్షోపన్యాసమిస్తూ, ఈ కోర్సు అధ్యయనానికి వచ్చిన వారికి సకారాత్మకమైన ఆలోచన సరళి ని అలవరచుకోవలసిందిగా సూచన చేశారు. ఇలా చేస్తే జీవితం లో పైకి ఎదగగలరని ఆయన వారితో చెప్పారు. విశ్వవిద్యాలయంలో నేర్చుకొన్న నైపుణ్యాలను అమలులో పెట్టడాన్ని కొనసాగించండని విద్యార్థులకు ఆయన ఉద్బోధించారు. కోర్సు ను విజయవంతంగా పూర్తి చేసినందుకు వారికి ఆయన అభినందనలు తెలిపారు. విదేశాల నుంచి ఇక్కడకు విచ్చేసే విద్యార్థుల, అంతర్జాతీయ ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఒక వ్యాయామశాల ను, వినోద కార్యక్రమాల కేంద్రాన్ని, అంతర్జాతీయ వంటకాలను వడ్డించే ఒక ఆహారశాల ను, రోజులో ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండే ఔషధాలయాన్ని, బహుళ విధ క్రీడా సదుపాయాలు ఉండే భవన సముదాయాన్ని, ఒక ఆరుబయలు చక్రాకార నాటకశాల ను నిర్మించనున్నట్లు, వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
తమకు ఉద్దేశించిన పాఠ్య క్రమం మంచి నాణ్యతను కలిగి ఉందని, విశ్వవిద్యాలయ బోధన సిబ్బంది కూడా చక్కగా బోధించారంటూ విద్యార్థులు ప్రశంసలు కురిపించారు. కోర్సు అభ్యర్థులకు ధ్రువీకరణపత్రాలను అతిథులు ప్రదానం చేశారు.
(Release ID: 1572202)
Visitor Counter : 94