PIB Headquarters
ఆటిజం పై పోస్టర్ విడుదల
Posted On:
02 APR 2019 5:55PM by PIB Hyderabad
తల్లిదండ్రులు పిల్లల పెరుగుదల సమయంలో జాగరూకత వహించినట్లయితే ఆటిజం ఉన్న పిల్లలను గుర్తించి వారికి సరైన చికిత్స అందించడం వీలవుతుందని, పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి), అడిషనల్ డైరెక్టర్ జనరల్, శ్రీ టి.వి.కె. రెడ్డి అన్నారు. ప్రపంచ ఆటిజం దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో మాట్లాడుతూ, ఆటిజం ఉన్న పిల్లలు ఇతరులతో సరిగా మాట్లాడలేరనీ, పదే పదే ఒకే పని చేయడం, లేదా ఒకే మాట అంటుండటం చేస్తారనీ, వివిధ పరిస్థితులలో వారి స్పందన నెమ్మదిగా ఉంటుందనీ అన్నారు. ప్రతి 125 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. ప్రపంచం లో 70 కోట్ల మంది పిల్లలకు ఆటిజం ఉందని ఒక అంచనా. ఈ వ్యాధికి కారణం తెలియదు. కానీ, జన్యుపరమైన మార్పుల వల్ల ఇది సంభవిస్తుందని భావిస్తున్నారు.
నేషనల్ కెరీర్ సెంటర్ ఫర్ డిజేబుల్డ్, డిప్యూటీ డైరెక్టర్, శ్రీ విజయ మోహన్ ఆటిజం గురించి అవగాహన పెంచుకొని తల్లిదండ్రులు, ఆటిజం బారిన పడిన పిల్లలకు చికిత్స అందించాలని అన్నారు. పత్రికలు, మీడియా ఇందులో చురుకైన పాత్ర పోషించాలని అన్నారు.
అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక, అధ్యక్షుడు, శ్రీ కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆటిజం ఉన్న పిల్లలను గుర్తించడం ఒక సవాలనీ, వారికి మెరుగైన చికిత్స అందించినట్లయితే, ఆ లక్షణాలను కొంత వరకు తగ్గించవచ్చని అన్నారు.
తర్వాత శ్రీ టి.వి.కె. రెడ్డి ఆటిజం గురించి అవగాహన కల్పించే ఒక పోస్టర్ ను విడుదల చేశారు. పత్రికా సమాచార కార్యాలయం, డిప్యూటీ డైరెక్టర్ శ్రీ రత్నాకర్ వందన సమర్పణ చేశారు.
***
(Release ID: 1569988)
Visitor Counter : 231