పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
జీవ ఇంధనాలపై జాతీయ విధానం-2018కి కేంద్ర మంత్రిమండలి ఆమోదం
Posted On:
16 MAY 2018 3:27PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి నేడు జీవ ఇంధనాలపై జాతీయ విధానం2018కి ఆమోదముద్ర వేసింది.
ప్రధానాంశాలు:
i. ఈ విధానం కింద జీవ ఇంధనాలు ‘‘ప్రాథమిక జీవ ఇంధనాలు’’గా వర్గీకరించబడ్డాయి. తొలితరం (1G)బయో-ఇథనాల్, బయో-డీజిల్... ‘ఆధునిక జీవ ఇంధనాలు’ రెండో తరం (2G)ఇథనాల్, పురపాలిక ఘన వ్యర్థాల (MSW) నుంచి మిశ్రమ ఇంధనాలదాకా... మూడోతరం (3G) జీవ ఇంధనాలు, జీవ-సంక్షేపిత సహజవాయువు వంటివి ఈ వర్గీకరణలో భాగంగా ఉన్నాయి. ఈ మూడు విభాగాల కింద సముచిత ఆర్థిక సహాయం, ద్రవ్య ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు వీలుగా ఇవి వర్గీకరించబడ్డాయి.
ii. ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకు రసం, ముల్లంగి, తీపిజొన్నతోపాటు మొక్కజొన్న, దుంపలుసహా పాడైపోయిన గోధుమ, ధాన్యం, బియ్యం, చెడిపోయిన బంగాళాదుంపలు వంటివాటినుంచి తయారైన పిండి తదితర మానవ వినియోగానికి పనికిరానివాటిని ముడి పదార్థాలుగా వినియోగించేలా ఈ విధానం వీలు కల్పిస్తుంది.
iii. దేశంలో ఆహారధాన్యాల మిగులు దశ సందర్భంలో రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ జీవ-ఇంధన సమన్వయ కమిటీ అనుమతితో పెట్రోలులో మిశ్రమం కోసం ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు మిగులు ఆహారధాన్యాలను వినియోగించుకోవడానికి ఈ జాతీయ విధానం వీలు కల్పిస్తుంది.
iv. ఆధునిక జీవ ఇంధనాలకు ఊపునిస్తూ రాబోయే ఆరేళ్లలో రెండో తరం ఇథనాల్ జీవఇంధన శుద్ధి కర్మాగారాలకు స్వయంసామర్థ్య సిద్ధినిధి పథకం కింద రూ.5వేల కోట్లను కేటాయించాలని ఈ విధానం ప్రతిపాదిస్తోంది. తొలితరం జీవ ఇంధనాలకు వర్తింపజేస్తున్న అదనపు పన్ను ప్రోత్సాహకాలు, అధిక కొనుగోలు ధరలతో పోలిస్తే రెండో తరం ఇంధనాలకు కొత్త విధానం కింద అదనంగా ఇవన్నీ లభిస్తాయి.
v. బయో డీజిల్ ఉత్పాదన కోసం ఖాద్యేతర చమురు గింజలు, వాడేసిన వంటనూనె, స్వల్ప వ్యవధి ఫలసాయమిచ్చే పంటలద్వారా ముడిపదార్థాల సరఫరా శృంఖలాల ఏర్పాటును ఈ విధానం ప్రోత్సహిస్తుంది.
vi. జీవ ఇంధనాలకు సంబంధించి సమష్టి కృషి దిశగా అన్ని మంత్రిత్వశాఖలు/విభాగాల పాత్రలు, బాధ్యతలు ఈ విధానపత్రంలో పొందుపరచబడ్డాయి.
ఆశిస్తున్న ఫలితాలు:
• దిగుమతి పరాధీనత తగ్గుదల: ప్రస్తుత ధరల ప్రకారం కోటి లీటర్ల E10 ఇంధనంతో రూ.28 కోట్ల మేర విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఈ మేరకు 2017-18 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో 150 కోట్ల లీటర్ల మేర సరఫరా ఉంటుందని, తద్వారా రూ.150 కోట్లదాకా విదేశీ ద్రవ్యం ఆదా అవుతుందని అంచనా.
• పరిశుభ్ర పరిసరాలు: కోటి లీటర్ల E10 ఇంధనం ఉత్పత్తిద్వారా సుమారు 20వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఈ మేరకు 2017-18 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో సుమారు 30 లక్షల టన్నుల మేర కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఎండిన పొలాలను తగులబెట్టడాన్ని తగ్గించడం, వ్యవసాయ అవశేషాలు/వ్యర్థాలను జీవ ఇంధన ఉత్పత్తికి వినియోగించడద్వారా హరిత వాయు ఉద్గారాలను మరింత తగ్గించే వీలుంటుంది.
• ఆరోగ్య ప్రయోజనాలు: వాడిన వంటనూనెను ఆహార తయారీకోసం మళ్లీమళ్లీ వాడటంవల్ల ప్రత్యేకించి వేపుళ్లకోసం వినియోగిస్తే ఆరోగ్యపరంగా పెనుముప్పుతోపాటు పలు వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. వాడేసిన వంటనూనె బయో డీజిలు తయారీలో అత్యంత అనువైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా దీనివల్ల ఆహార పరిశ్రమలో వంటనూనె పునరుపయోగం కూడా తగ్గుముఖం పడుతుంది.
• పురపాలికల వ్యర్థాల నిర్వహణ: భారతదేశంలో పురపాలికలపరంగా ఏటా 62 మిలియన్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. చెత్త/ప్లాస్టిక్, పురపాలికల ఘన వ్యర్థాలను మిశ్రమ ఇంధనాలుగా రూపొందించగల సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులో ఉన్నాయి. ఆ విధంగా మిశ్రమ ఇంధన ఉత్పాదనలో 20 శాతాన్ని ఒక టన్ను వ్యర్థాలతో సాధించవచ్చు.
• గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక పెట్టుబడులు: రోజుకు 100 కిలోలీటర్ల జీవ ఇంధనం ఉత్పత్తి చేయగల శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు రూ.800 కోట్లదాకా పెట్టుబడి అవసరమని అంచనా. ప్రస్తుతం దేశంలోని చమురు కంపెనీలు దాదాపు రూ.10వేల కోట్ల పెట్టుబడితో 12 రెండోతరం జీవ ఇంధన శుద్ధి కర్మాగారాలను నెలకొల్పే పనిలో ఉన్నాయి. ఈ రెండోతరం జీవ ఇంధన కర్మాగారాల ఏర్పాటుతోపాటు వాటిద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల రంగంలోనూ పెట్టుబడులు పెరిగే అవకాశాలున్నాయి.
• ఉపాధి అవకాశాల సృష్టి: రోజుకు 100 కిలోలీటర్ల రెండోతరం జీవ ఇంధన శుద్ధి కర్మాగార కార్యకలాపాలు, గ్రామస్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సరఫరా శృంఖలాల నిర్వహణ తదితర రూపాల్లో 1,200 ఉద్యోగాలు లభిస్తాయి.
• రైతులకు అదనపు ఆదాయ లబ్ధి: రెండోతరం సాంకేతికతలను అనుసరించడంద్వారా పంట అవశేషాలు/వ్యర్థాలతో జీవ ఇంధనాల తయారీవల్ల ఏటా వాటిని దహనం చేసే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఇథనాల్ ఉత్పత్తి కోసం ముడిపదార్థాల మార్కెట్ అభివృద్ధి చెందితే వీటిని తగులబెట్టే బదులు వీటిద్వారా రైతులు అదనపు ఆర్థిక లబ్ధిపొందవచ్చు. అంతేకాకుండా ఆహార ధాన్యాల మిగులు ఉత్పత్తి ఉన్నపుడు గిట్టుబాటు ధర లభించని దుస్థితినుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఆ మేరకు మిగులు ఆహార ధాన్యాలను, వ్యవసాయ జీవ వ్యర్థాలను ఇంధన ఉత్పత్తికి మళ్లిస్తే పంటల ధరల స్థిరీకరణ కూడా సాధ్యమవుతుంది.
నేపథ్యం:
దేశంలో జీవ ఇంధన ఉత్పాదనను ప్రోత్సహించే దిశగా కేంద్ర నవ్య-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ 2009లో జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని రూపొందించింది. జీవ ఇంధన ఉత్పాదనలో పురోగమన వేగాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన నేపథ్యంలో దశాబ్ద కాలంనుంచీ జీవ ఇంధనాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్ అభియాన్, నైపుణ్యాభివృద్ధివంటి’ వినూత్న చర్యలు చేపడుతున్న నేపథ్యంలో వాటికి తోడ్పడే విధంగా దేశంలో జీవ ఇంధన ఉత్పాదన ప్రగతికి వ్యూహాత్మక ప్రాధాన్యం కూడా ఉంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, దిగుమతుల తగ్గింపు, ఉపాధి అవకాశాల సృష్టి, వ్యర్థాల నుంచి సంపద సృష్టి తదితర ప్రతిష్ఠాత్మక లక్ష్యాల సాధనకూ ఇదొక గొప్ప ఉపకరణంగా అందివస్తుంది. అయితే, దేశీయంగా జీవ ఇంధనాల ఉత్పత్తికి తగినట్లు వాటికి అవసరమైన ముడి పదార్థాల సరఫరా లేనందువల్ల జీవ ఇంధన కార్యక్రమంపై ప్రభావం పడిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారంపై నిశితంగా దృష్టి సారించాల్సి ఉంది.
(Release ID: 1532440)
Visitor Counter : 758