ఆర్థిక మంత్రిత్వ శాఖ

అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాలు, చిట్‌ఫండ్‌ల (స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2018 కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 20 FEB 2018 1:24PM by PIB Hyderabad

ఇన్వెస్ట‌ర్ల పొదుపు మొత్తాల‌ను కాపాడే దిశ‌గా తీసుకున్న ప్ర‌ధాన విధాన‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌లో భాగంగా, ఈ దిగువన పేర్కొన్న బిల్లుల‌ను పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్రధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది:-

ఎ)  అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాల నిషేధం బిల్లు, 2018 మరియు

బి) చిట్‌ఫండ్స్ (స‌వ‌ర‌ణ‌)బిల్లు,2018
 
అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాల నిషేధానికి బిల్లు, 2018

 అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాల బిల్లు, 2018 ని పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  దేశంలో త‌గిన అనుమ‌తి లేకుండా అక్ర‌మంగా డిపాజిట్ల సేక‌ర‌ణ‌కు పాల్ప‌డే బెడ‌ద‌ను అరిక‌ట్టడం ఈ బిల్లు ఉద్దేశం.   నియంత్రణ వ్య‌వ‌స్థ‌ లోని లొసుగుల‌ను వాడుకుంటూ కొన్ని కంపెనీలు, సంస్థ‌లు ఇలాంటి ప‌థ‌కాల‌ను తీసుకువ‌స్తుండ‌డం, పేద‌లు, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు వారి క‌ష్టార్జితాన్ని ఈ తరహా పథకాలలో డిపాజిట్‌గా పెట్టి మోస‌పోకుండా అడ్డుకొనేందుకు ప‌టిష్ట‌మైన పాల‌నాప‌ర‌మైన చ‌ర్య‌లు కొర‌వ‌డ‌డంతో ఈ బిల్లును తీసుకువస్తున్నారు.

వివ‌రాలు:

దేశంలో అక్ర‌మంగా డిపాజిట్లను సేక‌రించే ప‌థ‌కాల యొక్క ముప్పును అరికట్టడానికి అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాల నిషేధం బిల్లు, 2018
 స‌మ‌గ్ర‌మైన చ‌ట్టాన్ని కింది చ‌ర్య‌ల ద్వారా తీసుకువ‌స్తున్న‌ది.

ఎ. అనియంత్రిత డిపాజిట్ స్వీక‌ర‌ణ కార్య‌కలాపాల‌ను ఇది పూర్తిగా నిషేధిస్తుంది.

బి.అనియంత్రిత డిపాజిట్ల స్వీక‌ర‌ణ కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌డం, వాటిని ప్ర‌మోట్ చేసినందుకు క‌ఠిన శిక్ష‌

సి.  డిపాజిటర్ల‌కు తిరిగి చెల్లింపులు చేయ‌కుండా మోసం చేస్తే క‌ఠిన శిక్ష‌

డి. డిపాజిట్లు స్వీక‌రించిన సంస్థ డిఫాల్ట్ అయితే డిపాజిట్ల తిరిగి చెల్లింపుజ‌రిగేలా చూసేందుకు రాష్ట్ర‌ప్ర‌భుత్వంచే కాంపిటెంట్ అథారిటీ ఏర్పాటు

ఇ.  డిఫాల్ట్ అయిన సంస్థ ఆస్తుల‌ను అటాచ్ చేసే అధికారంతోపాటు కాంపిటెంట్ అథారిటీ విధులు, అధికారాలు

ఎఫ్‌.డిపాజిట‌ర్ల సొమ్ము తిరిగి చెల్లింపు జ‌రిగేలా చూసేందుకు కోర్టుల ఏర్పాటు, ఈ చ‌ట్టం కింద నేరాల విచార‌ణ‌

జి. నియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాల జాబితాను బిల్లులో పొందుప‌ర‌చ‌డం,ఈ జాబితా పొడిగింపు లేదా త‌గ్గింపునకు కేంద్ర ప్ర‌భుత్వానికి వీలు క‌ల్పించ‌డం

ముఖ్యాంశాలు:

ఈ బిల్లు లోని ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

ఈ బిల్లు ప్ర‌ధానంగా నిషేధ క్లాజును ప్ర‌స్తావిస్తోంది.  డిపాజిట్ స్వీక‌ర‌ణదారులు ఏదైనా అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కానికి సంబంధించి ప్ర‌మోటింగ్‌, ఆప‌రేటింగ్‌, వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల జారీ డిపాజిట్ లను అంగీక‌రించ‌కుండా నిషేధిస్తోంది.  ఈ బిల్లు ప్ర‌ధాన సూత్రం, మొత్తంగా అనియంత్రిత డిపాజిట్ల స్వీక‌ర‌ణ కార్య‌క‌లాపాల‌ను ఈ బిల్లు నిషేధించ‌నుంది.  వాటిని ముంద‌స్తు అంచ‌నా ప్ర‌కారం (ఎక్స్- యాంటి) నేరంగా ప‌రిగ‌ణించ‌డానికి వీలుంది.  అలా కాకుండా ప్ర‌స్తుత చ‌ట్ట‌ప‌ర‌మైన , రెగ్యులేట‌రీ ఫ్రేమ్ వ‌ర్క్ ప్ర‌కారం అయితే కొంత కాలం గ‌డిచిన‌ త‌రువాత వాస్త‌వ పరిస్థితి ప్ర‌కారం (ఎక్స్-  పోస్ట్) అది ప‌రిగ‌ణ‌న‌లోకి వ‌స్తుంది.
 - ఈ బిల్లు వివిధ ర‌కాలైన మూడు నేరాల‌ను ప్ర‌స్తావిస్తోంది.  అవి: అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాలను న‌డ‌ప‌డం, అనియంత్రిత డిపాజిట్ల‌కు సంబంధించి మోసపూరితంగా ఎగ‌వేత‌, అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాల‌కు సంబంధించి త‌ప్పుడు ప‌ద్ధ‌తిలో ఆక‌ర్షించ‌డం.
- ఇందుకు ఈ బిల్లు క‌ఠిన శిక్ష‌ను, భారీ జ‌రిమానాల‌ను సూచిస్తోంది.
- అక్ర‌మంగా డిపాజిట్లు సేక‌రించిన సంద‌ర్భాల‌లో వాటిని డిపాజిట‌ర్ల‌కు తిరిగి చెల్లింప‌చేసేందుకు బిల్లులో త‌గిన నిబంధ‌న‌లు ఉన్నాయి.
- కోంపిటంట్ అథారిటీ చేత ఆస్తుల స్వాధీనానికి, ఆ త‌రువాత వాటి నుండి వ‌చ్చిన మొత్తాన్ని డిపాజిట‌ర్ల‌కు తిరిగి చెల్లింపున‌కు వాడ‌డానికి బిల్లు అవ‌కాశం క‌ల్పిస్తోంది.
- ఆస్తుల స్వాధీనానికి, వాటిని డిపాజిట‌ర్ల‌కు తిరిగి చెల్లింపున‌కు సంబంధించి స్ప‌ష్టమైన నిర్ణీత కాల వ్య‌వ‌ధులను బిల్లులో పేర్కొన‌డం, 
- దేశంలో డిపాజిట్ల స్వీక‌ర‌ణ కార్య‌క‌లాపాల‌కు సంబంధించి స‌మాచారాన్ని అందించేందుకు ఆన్‌ లైన్‌, సెంట్ర‌ల్‌ డేటా బేస్ ఏర్పాటుకు ఈ బిల్లు  వీలు క‌ల్పిస్తోంది.
- ఈ బిల్లు డిపాజిట్ స్వీక‌ర్త‌, డిపాజిట్ ప‌దాలకు స‌మ‌గ్ర నిర్వ‌చనం ఇస్తుంది.
- డిపాజిట్ స్వీక‌ర‌ణ దారులు అంటే వ్య‌క్తులతో పాటు డిపాజిట్ల‌ను స్వీక‌రించే , అభ్య‌ర్థించే అన్ని సంస్థ‌లు దీని కిందకు వ‌స్తాయి.  అయితే చ‌ట్టం ద్వారా ఏర్ప‌రచిన ప్ర‌త్యేక సంస్థ‌లకు ఇది మిన‌హాయింపు.
- డిపాజిట్ అనే ప‌దానికి ఇచ్చిన నిర్వ‌చ‌నం ప్ర‌కారం, డిపాజిట్ స్వీక‌ర్త‌లు ప‌బ్లిక్ డిపాజిట్ల‌ను జ‌మాప‌ద్దుగా ముసుగు వేయ‌కుండా చూసేలా నిర్వ‌చించ‌డం జ‌రిగింది. అయితే అదే స‌మ‌యంలో ఆయా సంస్థ‌లు త‌మ సాధార‌ణ వ్యాపార లావాదేవీల‌లో భాగంగా డ‌బ్బును తీసుకోకుండా అడ్డుకునేదిగా లేదా నిరోధించేదిగా కాకుండా నిర్వ‌చించారు.
- స‌మ‌గ్ర‌మైన కేంద్ర చ‌ట్టం కోసం రూపొందిన బిల్లు క‌నుక‌, ఈ బిల్లు రాష్ట్రాల చ‌ట్టాల‌లోని మేలైన అంశాల‌ను స్వీక‌రించ‌డం జ‌రిగింది. 
ఈ చ‌ట్టంలోని నిబంధ‌న‌లను అమ‌లు చేసే బాధ్య‌త‌ను రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు అప్ప‌గిస్తోంది.

పూర్వరంగం:

ఆర్థిక‌ మంత్రి 2016-2017 బ‌డ్జెట్ ప్ర‌సంగం చేస్తూ, అక్ర‌మ డిపాజిట్ల సేక‌ర‌ణ బెడ‌ద‌ను అరిక‌ట్టేందుకు స‌మ‌గ్ర‌మైన కేంద్ర చ‌ట్టాన్ని తీసుకురానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇటీవ‌లి కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల‌లో అక్ర‌మ డిపాజిట్ల సేక‌ర‌ణ ప‌థ‌కాల వ‌ల్ల ప్ర‌జ‌లు మోస‌పోతున్న సంఘ‌ట‌న‌లు పెరిగిపోతుండ‌డంతో ఈ చ‌ర్య తీసుకున్నారు.  ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌లో బాధితులుగా ఉంటున్న‌ వారు ఎక్కువ‌ మంది నిరుపేద‌లు, ఆర్థిక అంశాల‌పై అవ‌గాహ‌న లేని వారు.  ప‌లు సంద‌ర్భాల‌లో ఇలాంటి అక్ర‌మ కార్య‌క‌లాపాలు ప‌లు రాష్ట్రాల‌కు విస్తరించి ఉంటున్నాయి.  ఆ త‌రువాత‌, ఆర్థిక‌ మంత్రి 2017-2018 బ‌డ్జెట్ ప్ర‌సంగంలో అక్ర‌మ డిపాజిట్ల సేక‌ర‌ణ బెడ‌ద‌ను నివారించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లును ప్ర‌క‌టించి దానిని ప‌బ్లిక్ డమేన్‌ లో ఉంచారు.  దీనిని ఖ‌రారు చేసిన అనంతరం త్వ‌ర‌లోనే పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

చిట్‌ఫండ్స్ (స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2018

చిట్‌ఫండ్ (స‌వ‌ర‌ణ‌) బిల్లు 2018ను పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  చిట్‌ఫండ్ రంగం క్ర‌మ‌బ‌ద్ధ‌మైన అభివృద్ధిని సాధించేందుకు వీలు క‌ల్పించ‌డానికి, చిట్‌ఫండ్ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న అడ్డంకుల‌ను తొల‌గించ‌డానికి, ఇత‌ర ఆర్థిక ప‌థ‌కాలను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డానికి చిట్‌ఫండ్ చ‌ట్టం,1982 కు ఈ కింది స‌వ‌ర‌ణ‌లను తీసుకురావ‌డానికి ప్ర‌తిపాదించ‌బ‌డింది.

చిట్ ఫండ్ చ‌ట్టం, 1982 లోని సెక్ష‌న్ లు 2 (బి), 11 (1) ల కింద ఫ్ర‌ట‌ర్నిటీ ఫండ్ ప‌దాలను దాని అంత‌ర్గ‌త స్వ‌భావాన్ని తెలిపే విధంగా వాడ‌కం, అలాగే ప్ర‌త్యేక చ‌ట్టం కింద నిషేధించిన ప్రైజ్ చిట్స్ ప‌నితీరుకు భిన్నంగా దానిని చూప‌డం.
- చిట్ డ్రా నిర్వ‌హించ‌డానికి, చిట్ ప్రొసీడింగ్స్ మినిట్స్ త‌యారు చేయ‌డానికి క‌నీసం ఇద్ద‌రు స‌బ్‌స్క్ర‌యిబ‌ర్లు ఉండాల‌న్న నిబంధ‌న‌ను అలాగే ఉంచుతూ, చిట్‌ఫండ్స్ (స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2018, అవ‌స‌ర‌మైన ఇద్ద‌రు స‌బ్‌స్క్ర‌యిబ‌ర్లు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా అందుబాటులోకి రావ‌డానికి, దానిని ఫోర్‌మ‌న్ రికార్డు చేయ‌డానికి అనుమ‌తిస్తోంది.  చిట్ చివ‌రి ద‌శ‌లో స‌బ్‌స్క్ర‌యిబ‌ర్లు స్వ‌యంగా హాజ‌రు కావ‌డం సుల‌భం కాక‌పోవ‌డంతో ఈ మార్పు చేశారు.  అయితే మినట్స్‌పై ఫోర్‌మ‌న్‌, ప్రొసీడింగ్స్ అనంత‌రం రెండు రోజుల లోప‌ల ఆ స‌బ్‌స్క్ర‌యిబ‌ర్ల నుండి సంత‌కాలు తీసుకోవల‌సి ఉంటుంది.
- ఫోర్‌మ‌న్ క‌మిష‌న్ సీలింగ్ ను గ‌రిష్ఠంగా 5 శాతం నుండి 7 శాతానికి పెంచ‌నున్నారు.  ఈ చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చిన నాటి నుండి ఇందులో మార్పు లేక‌పోవ‌డం, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు ఎన్నో రెట్లు పెరిగిపోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.
-స‌బ్‌స్క్ర‌యిబ‌ర్ల‌ నుండి బ‌కాయిల‌కు ఫోర్‌మన్‌కు గ‌ల‌ లీన్‌ హ‌క్కును అనుమ‌తిస్తారు.  అందువ‌ల్ల అప్ప‌టికే ఫండ్స్ డ్రా చేసిన స‌బ్‌స్క్ర‌యిబ‌ర్ల విష‌యంలో చిట్‌ కంపెనీ సెట్ ఆఫ్‌కు అనుమ‌తిస్తారు.  వారు డిఫాల్ట్‌కు  పాల్ప‌డ‌కుండా చూసేందుకు ఈ చ‌ర్య తీసుకుంటారు.
చిట్‌ఫండ్ చ‌ట్టం,1982 లోని సెక్ష‌న్ 85 (బి) కి స‌వ‌ర‌ణను తీసుకు వ‌స్తూ, వంద రూపాయ‌ల సీలింగ్‌ ను తొల‌గించ‌నున్నారు.  1982లో  చిట్‌ఫండ్ చ‌ట్టం రూపొందించే స‌మ‌యంలో నిర్ణ‌యించిన వంద‌ రూపాయ‌ల సీలింగ్ ఇప్పుడు దాని ప్రాధాన్య‌ాన్ని కోల్పోయింది.  అందువ‌ల్ల  రాష్ట్ర ప్ర‌భుత్వాలు సీలింగ్‌ను నిర్ణ‌యించేందుకు, ఎప్ప‌టికప్పుడు దానిని పెంచేందుకు అనుమ‌తించేలా ప్ర‌తిపాదించ‌నున్నారు.


***



(Release ID: 1521195) Visitor Counter : 95


Read this release in: English , Tamil