మంత్రిమండలి

‘ప్రైం మినిస్టర్ స్ రిసర్చ్ ఫెలోస్ (పిఎమ్ఆర్ఎఫ్)’ ప‌థ‌కానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 07 FEB 2018 8:17PM by PIB Hyderabad

కేంద్ర మంత్రివ‌ర్గం 2018-19 సంవ‌త్స‌రం నుండి ఏడు సంవత్సరాల కాలానికి మొత్తం రూ.1650 కోట్ల వ్య‌యంతో ‘ప్రైం మినిస్టర్ స్ రిసర్చ్ ఫెలోస్ (పిఎమ్ఆర్ఎఫ్)’ ప‌థ‌కాన్ని అమలు చేసేందుకు ఈ రోజు ఆమోదం తెలిపింది.

దేశం అభివృద్ధి చెందాలన్నా, దేశం పురోగమించాలన్నా సాంకేతిక విజ్ఞానానికి మరియు నూతన ఆవిష్కరణలకు ప్రాముఖ్యం ఇవ్వవలసి ఉంటుందని ప్రధాన మంత్రి నొక్కి పలికారు.  నూతన ఆవిష్కరణల ద్వారా అభివృద్ధిని సాధించాలంటున్న ఆయన దార్శనికతను సాకారం చేయడంలో ఈ పథకం కీలక పాత్రను పోషించనుంది.  ఈ పథకాన్ని 2018-19 బడ్జెట్ ఉపన్యాసం లో ప్రకటించడం జరిగింది.

ఈ పథకంలో భాగంగా, ఐఐఎస్ సి/ ఐఐటి లు/ ఎన్ఐటి లు/ ఐఐఎస్ఇఆర్ లు/ఐఐఐటి ల‌ నుండి శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానం విభాగాలలో బి.టెక్.  ఆఖరు సంవత్సరంలో ఉన్న విద్యార్థులు లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్. టెక్. లేదా ఎమ్.ఎస్ సి.  పూర్తి చేసిన ఉత్తమ విద్యార్థులకు ఐఐటి లు/ ఐఐఎస్ సి లో  పిహెచ్‌.డి. ప్రోగ్రామ్ లో నేరుగా ప్రవేశాన్నిస్తారు.  అర్హత ప్రమాణాలతో తులతూగిన విద్యార్థులతో పాటు ఎంపిక ప్రక్రియలో పాల్గొని తాత్కాలిక జాబితాలో స్థానాలు సంపాదించుకొన్న వారికి పిఎమ్ఆర్ఎఫ్ మార్గదర్శక సూత్రాలలో పేర్కొన్న ప్రకారం, మొద‌టి రెండు సంవ‌త్స‌రాలలో నెలకు రూ. 70,000 వంతున, మూడో సంవ‌త్స‌రంలో నెలకు రూ.75,000 వంతున, నాలుగో, ఐదో సంవ‌త్స‌రాల‌లో నెలకు రూ. 80,000 వంతున ఫెలోషిప్ ను అందిస్తారు.  దీనికి తోడు, విద్యార్థులు వారి పరిశోధన పత్రాలను అంతర్జాతీయ సమావేశాలలోను, చర్చాసభలలోను సమర్పించేందుకు గాను విదేశీ ప‌ర్య‌ట‌న‌లకు అయ్యే ఖర్చుల‌ను భరించుకొనేందుకు 5 సంవత్సరాల పాటు  పరిశోధకులలో ప్రతి ఒక్కరికి రూ. 2 ల‌క్ష‌ల రిసర్చ్ గ్రాంటును ఇస్తారు.  2018-19 లో మొదలుపెట్టి  మూడు సంవత్సరాల కాలంలో గరిష్ఠంగా 3,000 మంది పరిశోధకులను ఎంపిక చేయనున్నారు.
 
ఈ పథకం అధునాతనమైన శాస్త్ర  విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞాన రంగాలలో దేశీయంగా పరిశోధనలను కొనసాగించడం కోసం ప్రతిభావంతులైన అభ్యర్థులను గుర్తించడంలో ఎంతగానో తోడ్పడగలదు.  ఈ పథకంలో భాగంగా సాగించే పరిశోధనలు ఒక పక్క మన దేశ ప్రాథమ్యాలకు పట్టం కడుతూనే, మరొక పక్క దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలలో సమర్ధులైన అధ్యాపక బృందాల లోటును భర్తీ చేయడంలో తోడ్పాటును అందించగలదు.


***



(Release ID: 1519971) Visitor Counter : 103


Read this release in: Tamil , English