మంత్రిమండలి
భారతదేశంలో జరిగిన ప్రపంచ నవ పారిశ్రామికవేత్తల శిఖర సమావేశం 2017 (జిఇఎస్ -2017) కు సహ ఆతిథ్య దేశంగా వ్యవహరించేందుకు గాను భారతదేశం, అమెరికా ల మధ్య కుదిరిన ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
प्रविष्टि तिथि:
03 JAN 2018 2:42PM by PIB Hyderabad
ప్రపంచ నవ పారిశ్రామికుల శిఖర సమావేశం (జిఇఎస్) 2017 కు భారతదేశంలో సహ ఆతిథ్యమిచ్చేందుకు భారతదేశం, యుఎస్ఎ ల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. శిఖర సమావేశం సజావుగా నిర్వహించడానికి ఇరు పార్టీల మధ్య బాధ్యతలు, సౌకర్యాలు, సమావేశ ప్రాంగణం, తదితర అవసరాలకు సంబంధించి సహకారం ఏ విధంగా ఉండాలన్నది ఈ ఎంఒయు సవివరంగా పేర్కొంది.
జిఇఎస్-2017 ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యేందుకు వాణిజ్యవేత్తలకు, పెట్టుబడిదారులకు మంచి అవకాశాన్ని ప్రసాదించింది. ఈ సందర్బంగా నెట్‌వర్కింగ్ సెషన్‌లు, వివిధ పోటీలు, వ్యూహాత్మక కార్యశాలలు, ఆయా రంగాలలో కలసి పనిచేసేందుకు ప్రత్యేకంగా నిర్దేశించిన కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. యువ వాణిజ్య వేత్తలు వారి ఆర్థిక అవకాశాలను పెంపొందించుకొనేందుకు చక్కటి వేదికగా ఈ సమావేశాలు ఉపయోగపడ్డాయి. ఈ సమావేశాలు యువ పారిశ్రామిక వేత్తలకు, ప్రత్యేకించి మహిళా నవ పారిశ్రామిక వేత్తలకు, ప్రత్యేక వర్గాల వారికి దీర్ఘకాలంలో ఉపయోగకరంగా ఉండే రీతిలో సాగాయి.
పూర్వరంగం:
హైదరాబాద్‌లో 2017 నవంబర్ 28 నుండి 2017 నవంబర్ 30 తేదీల మధ్య జిఇఎస్ -2017 ను నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలకు విధాన రూపకర్తలు, ప్రభుత్వాధికారులకు తోడు 150 దేశాల నుండి 1500 మందికి పైగా తమ పేర్లను ముందే నమోదు చేసుకొన్న ప్రతినిధులతో పాటు ఎంఎన్ సిల కు చెందిన సిఇఒ లు హాజరయ్యారు.
జిఇఎస్ 2017ను 8వ సంచికను భారతదేశంలో నిర్వహించేందుకు 2016 జూన్ 7వ తేదీన అప్పటి యుఎస్ అధ్యక్షులు శ్రీ బరాక్ ఒబామా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ల మధ్య జరిగిన ఒక సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. 2017 జూన్ 25- 27 తేదీలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు దీనిని పునరుద్ఘాటించారు. అలాగే భారతదేశంలో జరిగే జిఇఎస్ సమావేశాలకు హాజరు కావలసిందిగా యుఎస్ ప్రతినిధివర్గానికి నాయకత్వం వహిస్తున్న యుఎస్ అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు జిఇఎస్ ఒక మంచి వేదిక. ఈ సమావేశం అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలను కలుసుకునేందుకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. అలాగే అంతర్జాతీయ వాణిజ్యవేత్తలతో సంబంధాలు నెరపుకోవడానికి, ఇన్వెస్టర్లను, నూతన ఆవిష్కర్తలను కలుసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ సమావేశాల సందర్భంగా వివిధ పోటీలు, వ్యూహాత్మక సదస్సులు, ఆయా రంగాలలో కలసి పనిచేసేందుకు ప్రత్యేకంగా నిర్దేశించిన కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. యువ వాణిజ్య వేత్తలు ప్రత్యేకించి మహిళా పారిశ్రామిక వేత్తలు, స్టార్ట్ అప్ లు తమ ఆర్థిక అవకాశాలను పెంపొందించుకొనేందుకు చక్కటి వేదికగా ఈ సమావేశాలు ఉపయోగపడ్డాయి.
***
(रिलीज़ आईडी: 1515367)
आगंतुक पटल : 318