మంత్రిమండలి
ఐసిటి& ఇ రంగంలో పరస్పర సహకారానికి భారతదేశం, బెల్జియమ్ ల మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
03 JAN 2018 2:40PM by PIB Hyderabad
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ (ఐసిటి& ఇ) రంగంలో పరస్పర సహకారానికి భారతదేశం, బెల్జియమ్ ల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎంఒయు) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకురావడమైంది. ఉభయ దేశాల మధ్య ఎంఒయుపై 2017 నవంబర్ 7 వ తేదీన బెల్జియమ్ రాజు ఫిలిప్ భారతదేశంలో ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా సంతకాలయ్యాయి.
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్, డిజిటల్ అజెండా టెక్నాలజీ, ఐసిటి & ఇ తయారీ మరియు సేవల రంగంపై ప్రత్యేక దృష్టితో పరిశోధన, ఇ-గవర్నెన్స్,ఇ-పబ్లిక్ సర్వీస్ డెలివరి, సదస్సులలో పాల్గొనడం, అధ్యయనాత్మక యాత్రలు, సైబర్ సెక్యూరిటీ, డాటా అడెక్వసీలకు సంబంధించిన అంశాల పరిష్కారం, విపణి అనుసంధానం, వాణిజ్యం, సేవలకు సంబంధించి అత్యుత్తమ విధానాలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొనేందుకు ఈ ఎంఒయును ఉద్దేశించారు.
పూర్వరంగం:
ఐసిటి రంగంలో పరస్పర సహకారాన్ని వృద్ధిపరచుకొనేందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) పలు దేశాలతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుత విజ్ఞానదాయక శకంలో ఆర్థికాభివృద్ధి సాధన, దేశ సామాజికాభివృద్ది, ఇతర ఆర్థిక పార్శ్వాలలో ఐసిటి కీలక పాత్ర వహిస్తుంది. ఐసిటి రంగంలో సన్నిహిత సహకారానికి, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకొనేందుకు వివిధ దేశాలకు చెందిన సంస్థలతో ఎంఒయు లు/ఒప్పందాలు కుదుర్చుకొంది. ప్రత్యేకించి ప్రభుత్వం ప్రారంభించిన ‘‘డిజిటల్ ఇండియా’’, ‘మేక్ ఇన్ ఇండియా’ తదితర కార్యక్రమాల నేపథ్యంలో ఈ సహకారాన్ని మరింతగా విస్తృతపరచేందుకు ఈ చర్యలు తీసుకొన్నారు. అలాగే వ్యాపార అవకాశాలను పెంపొందించుకోవడం, సాంకేతిక విజ్ఞాన రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ఇందులో ముఖ్యోద్దేశం.
భారతదేశం, బెల్జియమ్ ల మధ్య సన్నిహిత స్నేహ సంబంధాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్‌లో బెల్జియమ్ కు భారతదేశం రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగం ప్రత్యేకించి ఇ-గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ ఐడి కార్డులు, టాక్స్ ఆన్ వెబ్ తదితర రంగాలలో బెల్జియమ్కు నైపుణ్యం ఉంది. 2016 మార్చిలో ప్రధాన మంత్రి యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా బ్రసల్జ్ కు వెళ్లి బెల్జియమ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సందర్భంగా ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశం, బెల్జియమ్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకొనేందుకు ప్రతిపాదించడం జరిగింది. ఆ తరువాత 2017 ఫిబ్రవరి 7 వ తేదీన ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ME&IT) శాఖ మంత్రి న్యూ ఢిల్లీ లో బెల్జియమ్ ఉప ప్రధాని, అభివృద్ధి సహకార శాఖ, డిజిటల్ అజెండా, టెలికం, పోస్టల్ సర్వీసెస్ శాఖల మంత్రి శ్రీ అలెగ్జాండర్ డి క్రూ నాయకత్వం లోని ప్రతినిధివర్గంతో సమావేశమై, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉభయ పక్షాలు ‘డిజిటల్ ఇండియా’, ‘డిజిటల్ బెల్జియమ్’లలో డిజిటల్ సాధికారితకు సంబంధించి వాటి చిత్తశుద్ధిని పునరుద్ఘాటించాయి.
***
(Release ID: 1515365)
Visitor Counter : 190