రైల్వే మంత్రిత్వ శాఖ
భారతదేశంలో మొదటి జాతీయ రైలు మరియు రవాణా విశ్వవిద్యాలయాన్ని వడోదరా లో స్థాపించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
* సాంకేతిక విజ్ఞాన సంబంధమైన మరియు అవస్థాపన పరమైన సదుపాయాలలో విస్తృతమైన మెరుగుదల ద్వారా ఆధునికీకరణ బాటలో సాగనున్న భారతీయ రైల్వేలు
* ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘స్కిల్ ఇండియా’ ల తోడ్పాటు తో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు సహాయపడడం
* నవ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం మరియు ‘స్టార్ట్-అప్ ఇండియా’ కార్యక్రమానికి ఊతం అందించడం
* అతి నూతన బోధన పద్ధతులను, సాంకేతిక విజ్ఞాన సేవలను వినియోగించుకొంటూ అధిక నాణ్యత కలిగిన విద్యను, శిక్షణను అందించే ఒక ఉత్తమమైన సంస్థకు రూపకల్పన చేయడం
* అత్యధునాతన సాంకేతిక విజ్ఞానం మరియు నైపుణ్యం కలిగిన సిబ్బంది అండదండలతో రవాణా రంగంలో ప్రపంచ శ్రేణి నాయకత్వం కలిగినటువంటి దేశాల సరసన నిలువనున్న భారతదేశం
Posted On:
20 DEC 2017 8:09PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలలో పని చేస్తున్న సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించి, వారి సామర్థ్యానికి సాన పెట్టడం కోసం దేశంలోకెల్లా ప్రథమ జాతీయ రైలు మరియు రవాణా విశ్వవిద్యాలయాన్ని (ఎన్ఆర్‌టియు ను) వడోదరా లో నెలకొల్పాలంటూ రైల్వేల మంత్రిత్వ శాఖ సంకల్పించినటువంటి ఒక పరివర్తనాత్మక కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నుండి పొందిన ప్రేరణ తో రూపుదిద్దుకొన్న వినూత్నమైన ఆలోచన మన రైలు మరియు రవాణా రంగంలో మార్పును తీసుకురాగల ఒక ఉత్ప్రేరకం కాగలదు; ఇది ‘న్యూ ఇండియా’ దిశగా పయనించేందుకు భారతీయ రైల్వేలను సిద్ధం చేయగలదు కూడాను.
ఈ విశ్వవిద్యాలయాన్ని యుజిసి [ఇన్‌స్టిట్యూషన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్] రెగ్యులేశన్స్, 2016 లో పేర్కొన్న డీ నోవో కేటగిరి లో భాగంగా ‘ఒక విశ్వవిద్యాలయంగా పరిగణింపబడేటట్లు’ నెలకొల్పుతారు. అవసరమైన అన్ని అనుమతులను పొందే పనులను 2018 ఏప్రిల్ కల్లా పూర్తి చేసి తొలి విద్యా ప్రణాళికను 2018 జులై లో ఆరంభించే దిశగా ప్రభుత్వం సాగుతోంది.
కంపెనీల చట్టం, 2013 లోని 8వ సెక్షన్ లో భాగంగా రైల్వేల మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయనున్న ఒక కంపెనీ ప్రతిపాదిత విశ్వవిద్యాలయం యొక్క నిర్వహణ కంపెనీగా ఉంటుంది. ఈ కంపెనీ లాభాపేక్ష లేనటువంటి కంపెనీగా పని చేస్తుంది. విశ్వవిద్యాలయానికి ఆర్థికపరమైన మరియు అవస్థాపన పరమైన మద్ధతును ఈ కంపెనీ అందజేస్తుంది. అంతేకాకుండా ఈ విశ్వవిద్యాలయానికి కులపతిని మరియు ప్రో-చాన్స్ లర్ ను నియమిస్తుంది. విద్యావేత్తలు, వృత్తి నిపుణులు సభ్యులుగా ఉండే పాలక మండలి నిర్వాహక కంపెనీతో సంబంధం లేకుండా, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. అలాగే, ఈ పాలక మండలికి విద్య పరమైన మరియు పాలన పరమైన బాధ్యతలను నెరవేర్చడానికి సంపూర్ణ స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది.
ఈ విశ్వవిద్యాలయాన్ని సాకారం చేయడం కోసం గుజరాత్ లోని వడోదరా లో నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ (ఎన్ఎఐఆర్)కు ప్రస్తుతం ఉన్న భూమి మరియు మౌలిక సదుపాయాలలో తగిన విధంగా మార్పులు చేపట్టడమే కాకుండా నవీకరిస్తారు కూడా. పూర్తి స్థాయిలో విద్యార్థులను నమోదు చేసుకొన్నప్పుడు ఇందులో 3000 మంది పూర్తి కాలపు విద్యార్థులు ఉండగలరని ఒక అంచనా. ఈ సరికొత్త విశ్వ విద్యాలయం/ సంస్థ కు అయ్యే నిధులనన్నింటిని రైల్వేల మంత్రిత్వ శాఖే అందిస్తుంది.
భారతీయ రైల్వేలు ఆధునికీకరణ పథంలో సాగేందుకు ఈ విశ్వవిద్యాలయం దోహదపడుతుంది. అలాగే, ‘మేక్ ఇన్ ఇండియా’ ను ప్రోత్సహిస్తూ ఉత్పాదకతను పెంచడం ద్వారా భారతదేశం ప్రపంచ రవాణా రంగంలో ఒక నాయకత్వ స్థానాన్ని పొందడంలో సైతం ఈ విశ్వవిద్యాలయం తోడ్పడుతుంది. నిపుణులైన మానవ వనరుల రాశిని ఈ విశ్వవిద్యాలయం తయారు చేస్తుంది. భారతీయ రైల్వేలకు మరింత మెరుగైన భద్రతను, వేగాన్ని మరియు సేవ లను సమకూర్చడం కోసం అత్యధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని ఈ విశ్వవిద్యాలయం వినియోగించుకొంటుంది. ‘స్టార్ట్-అప్ ఇండియా’ మరియు ‘స్కిల్ ఇండియా’ లకు వెన్నుదన్నుగా ఈ విశ్వవిద్యాలయం ఉంటుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండదండలను అందిస్తుంది. తద్వారా ప్రయాణికులను చేరవేయడంలో మరియు సరుకులను తరలించడంలో త్వరిత గతిని జత చేస్తుంది. ప్రపంచ శ్రేణి భాగస్వామ్యాలు మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడం ద్వారా నైపుణ్యపరంగా ఒక ప్రపంచ స్థాయి కేంద్రంగా భారతదేశం ఆవిర్భవిస్తుంది.
బోధన ప్రక్రియలలో తాజా మార్పులను గ్రహించడంతో పాటు ఉత్పాదకతను మరియు పనితీరులోను మెరుగుదలను సాధించడం కోసం ఉపగ్రహ ఆధారిత సేవలను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ను ఇంకా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక విజ్ఞాన సేవలను వినియోగించుకోవడం ఈ విశ్వవిద్యాలయం ప్రణాళికలలో భాగంగా ఉన్నాయి. భారతీయ రైల్వేలతో సన్నిహిత సమన్వయాన్ని కలిగివున్న కారణంగా రైల్వేల సదుపాయాలు సంబంధిత వర్గాలకు అందుబాటు లోకి వస్తాయి. ఈ సదుపాయాలు ‘ప్రత్యక్ష ప్రయోగశాలల’ వలె ఉపయోగపడతాయి. అవి నిజ జీవిత సమస్యల పరిష్కారం దిశగా సహకరించగలుగుతాయి. హై స్పీడ్ ట్రైన్ వంటి అత్యంత ఖరీదైన, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానానికి అద్దం పట్టే ‘ప్రావీణ్యతా కేంద్రాల’ను ఈ విశ్వవిద్యాలయం కలిగి ఉంటుంది.
పూర్వరంగం:
‘‘తదుపరి శతాబ్దంలో సైతం ప్రభావాన్ని చూపగల ఒక అతి ముఖ్యమైన నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకొంది. ఈ నిర్ణయమే దేశంలో తొలి రైల్వే విశ్వవిద్యాలయాన్ని వడోదరా లో నిర్మించాలన్న నిర్ణయం’’
- 2016 అక్టోబరు లో వడోదరా లో రైలు విశ్వవిద్యాలయాన్ని గురించి వెల్లడిస్తూ మాన్య ప్రధాన మంత్రి చెప్పిన మాటలివి.
బులెట్ ట్రైన్ గా పేరుపొందిన హై స్పీడ్ ట్రైన్ లు, భారీ ఎత్తున మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లు (డిఎఫ్ సిలు), భద్రతపై అత్యున్నత స్థాయి శ్రద్ధ వహించడం వంటి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టనున్నటువంటి భారతీయ రైల్వేలకు అత్యున్నత స్థాయి కౌశలం మరియు నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. అంతేకాకుండా, భారతదేశ రవాణా రంగం ఇంతకు ముందు లేనటువంటి స్థాయిలో పెరిగిపోవడం, అర్హత కలిగిన శ్రామిక సిబ్బంది యొక్క ఆవశ్యకత హెచ్చు కావడం మరియు నైపుణ్యాల స్థాయిని పెంపొందించుకోవలసిన ఆవశ్యకత లతో పాటు భారతీయ రైల్వేల రూపాంతరీకరణకు చోదక శక్తి కాదగ్గ సామర్థ్యం యొక్క ఆవశ్యకత.. వెరసి ఒక ప్రపంచ శ్రేణి శిక్షణ నిలయం ఆవిర్భవించిన పరిస్థితిని కల్పించాయి.
***
(Release ID: 1513781)
Visitor Counter : 86