మంత్రిమండలి

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో కమిషన్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ విధులను నిర్వర్తించేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ సర్కిల్ ఆఫీసును ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం

Posted On: 15 DEC 2017 5:55PM by PIB Hyderabad

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని, “మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మెయింటినెన్స్) యాక్ట్, 2002” లో పేర్కొన్న మెట్రో రైల్వే సేఫ్టీ కమిషన్ విధులను నిర్వర్తించేందుకుగాను సహాయక అధికారులు, సిబ్బందితో సహా  మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ (సిఎమ్ఆర్ఎస్) సర్కిల్  కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అలాగే, ప్రస్తుతమున్న ఇరువురు రైల్వే సేఫ్టీ కమిషనర్ (సిఆర్ఎస్)లు వారి వారి అధికార పరిధిలో ఈ బాధ్యతలను నిర్వర్తించేందుకు వారికి అదనపు బాధ్యతలను అప్పగించేందుకు కూడా మంత్రివర్గం అనుమతించింది. ఈ సర్కిల్స్, సిఎమ్ఆర్ఎస్ న్యూ ఢిల్లీ యొక్క అధికార పరిధిలోకి రావు.

పౌర విమానయాన శాఖ పరిధి లోని రైల్వే సేఫ్టీ కమిషన్ హెచ్ఎజి (పే లెవెల్ 15) లో మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ పదవి ఉంటుంది.  ఒక్కొక్క సర్కిల్ కార్యాలయానికి జీత భత్యాల వార్షిక వ్యయం రూ. 59,39,040 గా అంచనా వేయడం జరిగింది.  సంస్థ ప్రాథమిక స్థాపక వ్యయం దీనికి  అదనంగా ఉంటుంది.  సర్కిల్ కార్యాలయ సంబంధిత వ్యయం ఏడాదికి రూ.7,50,000 గా ఉండగలదని ఓ అంచనా.
 
ఈ కొత్త పోస్టుల ఏర్పాటు, ప్రధానంగా ప్రస్తుతం నడుస్తున్నమెట్రో రైల్ ప్రాజెక్టులతో పాటు కొత్తగా వచ్చే వివిధ మెట్రో రైల్ ప్రాజెక్టుల ప్రయాణికుల భద్రత, మెట్రో రైల్ కార్యకలాపాల సంబంధిత అంశాలపై శ్రద్ధ వహిస్తుంది.  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో రైల్వే సేఫ్టీ కమిషన్ “మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్) యాక్ట్, 2002” లో నిర్దేశించిన విధంగా ఈ నూతన వ్యవస్థ విధులను నిర్వర్తిస్తుంది.  

అమలు కు సంబంధించినటువంటి వ్యూహం మరియు లక్ష్యాలు:

మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ పోస్ట్, ప్రారంభంలో ఇండియన్ రైల్వే ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐ ఆర్ఎస్ఇ, ఐఆర్ఎస్ఇఇ, ఐఆర్ఎస్ఎస్ఇ,  ఆర్ ఎస్ఎమ్ఇ), ఐ ఆర్ టిఎస్ కేడర్ నుండి పౌర విమానయాన శాఖ, సంబంధిత అధికారుల సమ్మతి మేరకు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, రైల్వే సేఫ్టీ కమిషన్ లోని రైల్వే సేఫ్టీ కమిషనర్ నియామక నియమ నిబంధనల ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది.  ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రెండు మాసాలలో ప్రారంభం కావలసివుంటుంది.

మెట్రో రైల్వే సేఫ్టీ డిప్యూటీ కమిషనర్ (డిప్యూటీ సిఎమ్ఆర్ఎస్), సహాయక సిబ్బంది నియామక ప్రతిపాదన వ్యయం  ఆర్ధిక మంత్రిత్వ శాఖ భరిస్తుంది. ఆర్ధిక మంత్రిత్వ శాఖ అనుమతి లభించిన వెంటనే, నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి.

పూర్వరంగం:

రైల్వే ప్రయాణికుల భద్రతకు, రైల్వే నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలను భారత ప్రభుత్వ పౌర విమానయాన శాఖ పరిపాలన సంబంధ ఆధీనంలో పనిచేసే రైల్వే సేఫ్టీ కమిషన్ చూస్తుంది.  అలాగే, రైల్వే చట్టం 1989  లో నిర్దేశించిన చట్టపరమైన విధులను కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ పరిపాలన నియంత్రణలో పనిచేస్తున్న రైల్వేసేఫ్టీ  కమీషన్ నిర్వర్తిస్తుంది.  ఈ విధులు ప్రధానంగా పర్యవేక్షణ/విచారణ, పరిశోధన, సలహాల రూపంలో ఉంటాయి.  రైల్వే చట్టం లోని కొన్ని నిబంధనలు,  కాలానుగుణంగా జారీచేసే ఆదేశాల ప్రకారం కమిషన్ పనిచేయవలసి ఉంటుంది.  కొత్తగా నిర్మించిన రైల్వే లైన్ ప్రారంభానికి ముందు రైల్వే మంత్రిత్వ శాఖ  నిర్దేశించిన భద్రత ప్రమాణాలకు అన్ని విధాలా అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే రైళ్ళ రాక పోకలను అనుమతించడం కమిషన్ విధులలో అన్నింటి కన్నా ప్రధానమైంది.  ఇది ప్రస్తుత రైలు  మార్గాల గేజి మార్పిడి, డబ్లింగ్, విద్యుద్దీకరణ ల వంటి పనులకు కూడా వర్తిస్తుంది.  అలాగే తీవ్రమైన రైలు ప్రమాదాలపై చట్టపరమైన విచారణ జరిపి దేశంలో రైలు ప్రయాణం భద్రత ప్రమాణాలను మెరుగుపరచేందుకు కమిషన్  అవసరమైన సూచనలు చేస్తుంది.  

రైలు ప్రయాణికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యాన్ని ఇచ్చేందుకు, భద్రత ధ్రువీకరణ పత్రాల జారీలో ఏకీకృత విధానాన్ని అమలు చేసేందుకు,‘‘మెట్రో రైల్వేస్, (ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్) యాక్ట్, 2002” కు రూపకల్పన చేసిన  కేంద్ర  గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మెట్రో రైల్వేసుకు సంబంధించి ఇదే విధమైన బాధ్యతలను మెట్రో రైల్వే సేఫ్టీ ( సిఎమ్ఆర్ఎస్) కమిషనర్ కు అప్పగించింది.  పౌర విమానయాన శాఖ పరిధి లోని రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ నియంత్రణలో సిఎమ్ఆర్ఎస్ పనిచేయవలసి ఉంటుంది.        

 



(Release ID: 1512881) Visitor Counter : 91


Read this release in: English , Kannada