మంత్రిమండలి
హైదరాబాద్ లో ఇంటర్‌నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓశనోగ్రఫీ ఏర్పాటుకుగాను యునెస్కో తో ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
15 DEC 2017 5:39PM by PIB Hyderabad
హైదరాబాద్ లో యునెస్కో యొక్క కేటగిరి- 2 సెంటర్ (సి2సి) స్థాయిలో ఇంటర్‌నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓశనోగ్రఫీ ని నెలకొల్పేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇండియన్ ఓషన్ రిమ్ (ఐఒఆర్) వెంబడి ఉన్న దేశాలు, హిందూ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రాలతో సరిహద్దులను కలిగి ఉన్న ఆఫ్రికన్ దేశాల యొక్క సామర్ధ్యాన్ని అభివృద్ధి పరచేందుకు గాను ఒక శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాన్నదే ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. మత్స‌్యకారులు, విపత్తుల నిర్వహణ, షిప్పింగ్, ఓడరేవులు, కోస్తా తీర ప్రాంతాలను కలిగి ఉన్న దేశాలు, నౌకాదళం, కోస్తా తీర రక్షక దళం, పర్యావరణం, సముద్ర తీరానికి దూరంగా ఏర్పాటయ్యే పరిశ్రమలు వంటి వేరు వేరు రంగాలు వాటి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి సంబంధించిన సమాచార సేవలను అందించే సముద్ర విజ్ఞాన సంబంధ అధ్యయనాలను నిర్వహించడాన్నే ఆపరేషనల్ ఓషనోగ్రఫీ కార్యకలాపాలుగా పేర్కొంటున్నారు.
శిక్షణను ఇవ్వడం, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంతో పాటు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే కార్యకలాపాలలో కెపాసిటీ బిల్డింగ్ కు సంబంధించి ఈ సెంటర్ సహాయాన్ని అందిస్తుంది. తద్వారా యునెస్కోకు మరియు యునెస్కోకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫీ కమిషన్ (ఐఒసి) కి ఒక విలువైన వనరుగా ఈ సెంటర్ తన పాత్రను పోషించగలదు.
యునెస్కో కేటగిరి- 2 సెంటర్ ను ఏర్పాటు చేస్తే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ప్రముఖ దేశంగా అవతరించే అవకాశం భారతదేశానికి దక్కుతుంది. అంతేకాకుండా ఈ చర్య హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల తోను, హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ ఆసియా మరియు ఆఫ్రికా దేశాల తోను సహకారాన్ని ఏర్చరచుకొని, సంబంధాలను మెరుగుపరచుకోవడంలో కూడా భారతదేశానికి సహాయకారి అవుతుంది. దీనికి తోడు సముద్ర సంబంధిత మరియు కోస్టల్ సస్టెయినబిలిటీ అంశాలను పరిష్కరించడానికి సాంకేతికపరమైన మరియు నిర్వహణ పరమైన సామర్ధ్యాలను పెంపొందించుకోవలసిన అవసరం ప్రపంచంలో పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సరైన చర్య కాగలదు. అలాగే, సముద్ర సంబంధిత ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు ఈ ప్రాంతం తగిన విధంగా సన్నద్ధమై ఉండి, దీటుగా ప్రతిస్పందించేందుకు సైతం ఈ చర్య దోహదం చేస్తుంది.
విద్యార్థుల మరియు ఇతర భాగస్వాముల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిందీ ఈ సి2సి. దీని ద్వారా భారతదేశం లోపల, భారతదేశం వెలుపల ఉద్యోగావకాశాలు అధికమవుతాయి. అలాగే, భారతదేశంలో ఉద్యోగ కల్పనతో ముడిపడినటువంటి అనుబంధ రంగాల వికాసానికి కూడా ఈ సి2సి తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఇండియన్ సెంటర్ ఫర్ ఓశన్ ఇన్ఫర్మేశన్ సర్వీసెస్ (ఐఎన్‌సిఒఐఎస్)లో అందుబాటులో ఉన్న అత్యధునాతన సదుపాయాలతో ఈ కేంద్రం విధులను నిర్వహిస్తోంది. ఇంతవరకు భారతదేశానికి చెందిన 576 మంది శాస్త్రవేత్తలు మరియు 34 ఇతర దేశాలకు చెందిన 105 మంది శాస్త్రవేత్తలు.. మొత్తం 681 మంది శాస్త్రవేత్తలు ఈ కేంద్రంలో ఆపరేషనల్ ఓశనోగ్రఫీ కి చెందిన వేరు వేరు అంశాలలో శిక్షణ పొందారు. ఇక్కడ ఒక హాస్టల్ భవనం వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చే పనులు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అధ్యాపకులను మరియు శిక్షణార్థులను ఇక్కడకు ఆహ్వానించాలని, 3 నుండి 9 నెలల వ్యవధి కలిగిన కోర్సులను బోధించాలన్న ప్రణాళికలు కూడా ఉన్నాయి.
***
(Release ID: 1512867)