మంత్రిమండలి
రూ. 2000 కన్నా తక్కువ విలువ కలిగిన డెబిట్ కార్డ్/బిహెచ్ఐఎమ్ యుపిఐ/ఎఇపిఎస్ లావాదేవీలపై ఎమ్‌డిఆర్ చార్జీలలో ఆర్థిక సహాయం చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
15 DEC 2017 5:56PM by PIB Hyderabad
రూ. 2000 కన్నా తక్కువ విలువ కలిగిన అన్ని డెబిట్ కార్డ్/బిహెచ్ఐఎమ్ యుపిఐ/ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఎఇపిఎస్) లావాదేవీలకు వర్తించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎమ్‌డిఆర్) ను 2018 జనవరి 1వ తేదీ నాటి నుండి రెండు సంవత్సరాల కాలం పాటు- అవే బ్యాంకులకు తిరిగి చెల్లింపు పద్ధతిలో- ప్రభుత్వమే భరించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అటువంటి లావాదేవీల తాలూకు పరిశ్రమ వ్యయ స్వరూపాన్ని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్ & ఐ.టి. మంత్రిత్వ శాఖ కార్యదర్శి మరియు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) లతో కూడిన ఒక సంఘం పరిశీలిస్తుంది.
ఈ ఆమోదం ఫలితంగా, రూ. 2000 కన్నా తక్కువ విలువ కలిగిన అన్ని లావాదేవీల విషయంలో వినియోగదారు మరియు వర్తకుడు ఎమ్‌డిఆర్ రూపంలో ఎటువంటి అదనపు భారాన్ని వహించబోరు. తద్వారా, ఆ తరహా లావాదేవీలకు డిజిటల్ చెల్లింపు విధానాలను మరింత విస్తృతంగా అంగీకరించేందుకు మార్గం సుగమం కాగలదు. లావాదేవీల పరిణామంలో గణనీయమైన శాతం లావాదేవీలు ఆ తరహావే అయినందువల్ల, నగదు తక్కువ స్థాయిలో చెలామణి అయ్యే ఆర్థిక వ్యవస్థ దిశగా సాగేందుకు ఈ చర్య తోడ్పడుతుంది.
రూ. 2000 లోపు విలువ కలిగిన లావాదేవీల విషయంలో బ్యాంకులకు తిరిగి ఇవ్వవలసిన ఎమ్‌డిఆర్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,050 కోట్లుగాను, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,462 కోట్లు గాను ఉండవచ్చని అంచనా వేయడమైంది.
ఒక మర్చంట్ యొక్క పాయింట్ ఆఫ్ సేల్ వద్ద చెల్లింపు చోటు చేసుకొంటే, వర్తకుడు బ్యాంకుకు ఎమ్‌డిఆర్ ను చెల్లించవలసి ఉంటుంది. దీనిని కారణంగా చూపుతూ, చాలా మంది ప్రజలు వారి వద్ద డెబిట్ కార్డులు ఉన్నప్పటికీ నగదు చెల్లింపులకే మొగ్గు చూపుతారు. ఇదే విధంగా, బిహెచ్ఐఎమ్ యుపిఐ ప్లాట్ ఫార్మ్ మరియు ఎఇపిఎస్ ద్వారా వర్తకులకు జరిపే చెల్లింపుల పైన కూడా ఎమ్‌డిఆర్ ను వసూలు చేస్తున్నారు.
***
(Release ID: 1512850)
Visitor Counter : 143