నీతి ఆయోగ్
హైదరాబాద్ లో ప్రపంచ వ్యవస్థాపకత శిఖరాగ్ర సదస్సు ను రేపు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
-జిఇఎస్ లో పాల్గొనే వారిలో 52.5 శాతానికి పైగా మహిళలు
-యుఎస్ఎ అధ్యక్షుని సలహాదారు ఇవాంకా ట్రంప్ నాయకత్వంలో తరలి రానున్న యుఎస్ ప్రతినిధివర్గం
Posted On:
27 NOV 2017 2:13PM by PIB Hyderabad
ప్రపంచ వ్యవస్థాపకత శిఖరాగ్ర సమావేశాలు (గ్లోబల్ ఆంత్రప్రన్యోర్ షిప్ సమిట్- జిఇఎస్) దక్షిణాసియా లో మొట్టమొదటి సారిగా భారతదేశం లోని హైదరాబాద్ లో నవంబర్ 28వ, 29వ, 30వ తేదీలలో జరుగనున్నాయి. సంయుక్త రాష్ట్రాలు (యుఎస్) మరియు భారతదేశం ప్రభుత్వాల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న ఈ సమావేశాలను భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. జిఇఎస్ కు హాజరయ్యే యుఎస్ ప్రతినిధిబృందానికి అధ్యక్షుని సలహాదారు శ్రీమతి ఇవాంకా ట్రంప్ నాయకత్వం వహించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు మరియు మద్దతుదారులు గుమికూడే ఈ జిఇఎస్ పరంపరలో తాజా సమిట్ ఎనిమిదో శిఖరాగ్ర సమావేశం కానుంది. ‘‘మహిళలకు పెద్ద పీట, అందరికీ అభ్యుదయం’’ (Women First, Prosperity for All) ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ జిఇఎస్ లో పాలుపంచుకొనే వారిలో అధికులు- 52.5 శాతం కన్నా ఎక్కువగా- మహిళలు ఉండబోవడం కూడా ఇదే తొలి సారి.
అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా మరియు ఇజ్రాయల్ లతో సహా 10కి పైగా దేశాల నుండి అందరూ మహిళలే ప్రతినిధులుగా జిఇఎస్ కు తరలి వస్తున్నారు. అనేక మంది ప్రముఖ మహిళలు వారి అభిప్రాయాలను వివిధ సర్వసభ్య సదస్సులు, మాస్టర్ క్లాసులు, కార్యశాలల్లో వెల్లడించనున్నారు. వక్తలలో టెన్నిస్ చాంపియన్ శ్రీమతి సానియా మీర్జా, గూగల్ కు చెందిన నెక్స్‌ట్ బిలియన్ యూజర్స్ ఉపాధ్యక్షురాలు డయానా లూయీస్ పేట్రీసియా లేఫీల్డ్, ఇంకా అఫ్గాన్ సిటడల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సిఇఒ రోయా మహబూబ్ ల వంటి వారు ఉంటారు. మహిళలకు ఆర్థికంగా అధికారాన్ని దత్తం చేసినప్పుడు, ఆయా సముదాయాలు మరియు దేశాలు వర్థిల్లుతాయన్న సిద్ధాంతం పట్ల భారతదేశం మరియు యుఎస్ ప్రభుత్వాల నిబద్ధతను ఈ సంవత్సర శిఖరాగ్ర సమ్మేళనం యొక్క ఇతివృత్తం చాటి చెబుతోంది. మహిళా వ్యవస్థాపకులు నవకల్పనకు మరియు ఉద్యోగాల సృష్టికి జోరును అందించడంతో పాటు ప్రపంచం యొక్క అత్యంత క్లిష్టమైన సవాళ్ళకు పరిష్కారాలను కనుగొనడంలో కూడా తోడ్పడగలుగుతారు.
మూడు రోజుల పాటు జరిగే శిఖరాగ్ర సమావేశాలలో ప్రారంభిక సర్వసభ్య సమావేశం మంగళవారం నాడు హైదరాబాద్ ఇంటర్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ ఐసిసి) లో జరుగనుంది. ఆ తరువాత నెట్ వర్కింగ్ మెంటారింగ్, ఇంకా వర్క్ షాప్ లతో పాటు ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవడానికి వ్యవస్థాపకులకు సహకార పూర్వక వాతావరణాన్ని కల్పించడం, నెట్ వర్క్ లను ఏర్పరచడం, అంతేకాకుండా వారి తృష్ణలను పై మెట్టుకు తీసుకు వెళ్ళడం వంటి అంశాలపై మిగిలిన రెండు రోజులు చర్చలు కొనసాగుతాయి. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 4.30కు జరిగే సర్వసభ్య సదస్సులో
‘బి ద ఛేంజ్: విమెన్స్ ఆంట్రప్రెన్యోరియల్ లీడర్ షిప్’ అంశం పై ప్రసంగాలు ఉంటాయి.
- ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ,
- తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు,
- యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షునికి సలహాదారు శ్రీమతి ఇవాంకా ట్రంప్ లు ప్రసంగిస్తారు.
ఆ తరువాత వివిధ దేశాలలో మహిళా వ్యవస్థాపకులకు అవకాశాల కల్పనపై ప్యానల్ సెషన్ ఉంటుంది.
· ఈ సమావేశానికి పరిశీలకునిగా సిస్కో ఛైర్మన్ గౌరవాధ్యక్షుడు శ్రీ జాన్ ఛాంబర్స్ వ్యవహరిస్తారు.
· ప్యానలిస్టులలో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షునికి సలహాదారు శ్రీమతి ఇవాంకా ట్రంప్, భారతదేశ ప్రభుత్వ రక్షణ శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారమణ్, ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ & ఎస్ఆర్ఎస్ పెట్రోలియమ్ మేనేజింగ్ డైరెక్టర్ శిబాంగిలె శాంబో, స్కాండినేవిస్కా ఎన్‌స్కిల్‌డా బ్యాంకిన్ (ఎస్ఇబి) ఛైర్మన్ శ్రీ మార్కస్ వాలెన్‌బర్గ్ లు ఉంటారు.
నవంబర్ 29వ తేదీ నాడు ఉదయం 9 గంటలకు ‘వుయ్ కెన్ డూ ఇట్! ఇన్నోవేశన్స్ ఇన్ వర్క్ ఫోర్స్ డివెలప్‌మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్’ అంశం పై సభా కార్యక్రమాలు ఉంటాయి.
శ్రామిక వర్గంలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్న ధోరణి పై చర్చ ను నిర్వహిస్తారు. పని ప్రదేశాలలో మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడానికి ఏఏ చర్యలు చేపట్టాలన్న అంశంపై జరిగే చర్చలో శిక్షణలోనూ, శ్రామికుల విషయాలలోనూ వినూత్న పద్ధతులను ఆవిష్కరించిన వారు పాల్గొని తమ తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకొంటారు.
· ఈ చర్చా కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మ్యునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డివెలప్ మెంట్, పరిశ్రమలు & వాణిజ్యం, గనులు, జియాలజి, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ మరియు ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కె.టి. రామారావు పరిశీలకునిగా ఉంటారు.
· ప్యానలిస్టులలో చెరీ బ్లయర్ ఫౌడేషన్ ఫర్ విమెన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి చెరీ బ్లేయిర్, ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ శ్రీమతి చందా కొచర్, డెల్ ఇఎమ్‌సి చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కరెన్ కిన్‌తోస్, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షునికి సలహాదారు శ్రీమతి ఇవాంకా ట్రంప్ లు ఉంటారు.
· నవంబర్ 30వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు ‘వెన్ విమెన్ విన్, వుయ్ ఆల్ విన్: ప్రమోటింగ్ ఇన్‌క్లూజివ్ ఎన్వైరన్‌మెంట్స్ ఫర్ విమెన్ ఆంట్రప్రెన్యోర్స్’ అంశంపై సభా కార్యక్రమం ఉంటుంది.
· మహిళా వ్యవస్థాపకులకు ఆర్థికంగా అండదండలు అందించడం, వారిని ప్రోత్సహించడం వంటి అంశాలపై జిఇఎస్ ముగింపు సమావేశం దృష్టి ని సారిస్తుంది. వ్యాపారాలను ప్రారంభించడం లోను, వాటి అభివృద్ధి లోను మహిళలు ఎటువంటి అవరోధాలనైనా సమర్ధంగా ఎదుర్కొని నాయకత్వ స్థానాలకు పురోగమించ గలిగేటట్లుగా తగిన ప్రయత్నాలను చేయడాన్ని గురించి ప్యానలిస్టులుఈ సందర్భంగా వివరిస్తారు.
· ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభు పరిశీలకునిగా వ్యవహరిస్తారు.
· ప్యానలిస్టులలో ఐయూరోప్ క్యాపిటల్ ఎల్ఎల్‌సి సహ వ్యవస్థాపకురాలు & మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీనా పెర్కిన్ డేవిసన్ , వెల్‌స్పన్ ఇండియా సిఇఒ & జాయింట్ డైరెక్టర్ దీపాలి గోయంకా, యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్ నేషనల్ డివెలప్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ మార్క్ గ్రీన్, పెట్రోలింక్ వ్యవస్థాపకురాలు & సిఇఒ లెరాటో మోత్ సమయ్ లతో పాటు టీమ్ లీజ్ ఛైర్మన్ శ్రీ మనీష్ సబర్వాల్ లు పాల్గొంటారు.
ఈ సర్వ సభ్య సదస్సులలో పాలుపంచుకొనే వారే గాక, ఇతర సమావేశాలలో పాల్గొనే వక్తలు, మరియు నిపుణులలో ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు/ప్రాంతాలకు చెందిన వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు మరియు నూతన పారిశ్రామిక సంస్థల మద్ధతుదారులు 1500 మంది సైతం జిఇఎస్ కు విచ్చేస్తారు.
పేర్లు నమోదు చేసుకొన్న ప్రతినిధులు అందరికీ నిరంతరాయ ప్రాతిపదికన నెట్ వర్క్ సంబంధిత సేవలను అందించేందుకుగాను ఒక మొబైల్ అప్లికేషన్ ను ఈ సమిట్ సందర్భంగా ప్రవేశ పెట్టారు. ఈ యాప్ ను జోడించిన ఒక పరికరాన్ని ప్రతినిధులు అందరికీ అందజేస్తున్నారు. ఈ పరికరాన్ని శిఖరాగ్ర సమ్మేళనం కాలంలో, ఆ తరువాత కూడా ఉపయోగించవచ్చు. ఇంతవరకు ఈ యాప్ ను 1500 మంది ప్రతినిధులు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే 500 సమావేశాలకు రంగం సిద్ధం చేయడమైంది.
ప్రపంచం అంతటి నుంచీ తమ తమ ప్రస్తానాన్ని మరియు వినూత్న ప్రాజెక్టులను గురించి వివరించేందుకు తరలివస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్, భారత ప్రభుత్వ రక్షణ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారమణ్ లు కూడా గ్లోబల్ ఆంట్రప్రెన్యోర్ షిప్ సమిట్ లో పాల్గొనబోతున్నారు. జిఇఎస్ లో పాలుపంచుకొనే వక్తలు మరియు ఈ శిఖరాగ్ర సమావేశాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి www.ges2017.gov.in ను సందర్శించవచ్చు.
శిఖరాగ్ర సమావేశాలకు సంబంధించిన ప్రసార మాధ్యమాలకు కావలసిన అదనపు విచారణల కోసం అభ్యర్థనలను summitmedia@state.gov కు పంపగలరు.
***
(Release ID: 1511025)
Visitor Counter : 154