మంత్రిమండలి
మాదక ద్రవ్యాల డిమాండ్ తగ్గింపు- మత్తుమందులు, మానసిక ప్రభావం చూపే పదార్థాలు, ముడి రసాయనాలు తదితరాల అక్రమ రవాణా నిరోధం, సంబంధిత అంశాలపై భారతదేశం మరియు నేపాల్ ల మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
23 AUG 2017 6:50PM by PIB Hyderabad
భారతదేశం, నేపాల్ ల మధ్య మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు- మత్తుమందులు, మానసిక ప్రభావం చూపే పదార్థాలు, ముడి రసాయనాలు తదితరాల అక్రమ రవాణా నిరోధం, సంబంధిత అంశాలపై అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎంఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మాదకద్రవ్యాల విషయంలో రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అంశాలను ఈ ఒప్పందంలో పొందుపరిచారు. అలాగే సమాచార ఆదాన ప్రదాన యంత్రాంగం గురించి కూడా ఒప్పందంలో పేర్కొన్నారు. దీంతో పాటు ఎంఒయు అమలు, సమాచార ఆదాన ప్రదానంపై బాధ్యత వహించే సముచిత అధికార స్థానాలను కూడా వివరించారు. ఈ విధమైన సహకారం ద్వారా రెండు దేశాల మధ్య మాదక ద్రవ్యాలు, మానసిక ప్రభావం చూపే పదార్థాలు, ముడి రసాయనాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని రెండు ప్రభుత్వాలూ ఆశిస్తున్నాయి.
ఈ ఒప్పందం కింద ఉభయ పక్షాలు కృషి చేయాల్సిన అంశాలు కింది విధంగా ఉన్నాయి:-
(i) మత్తుమందులు, మానసిక ప్రభావం చూపే పదార్థాలు, ముడి రసాయనాలు తదితరాల అక్రమ రవాణా సమస్యను సమర్థంగా పరిష్కరించే దిశగా పరస్పర సహకారాన్ని విస్తృతం చేసుకోవడం. అలాగే మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు లక్ష్యంగా నిరోధం, అవగాహన, విద్యా-సామాజిక ప్రాతిపదిక గల కార్యక్రమాలు, వ్యసనపరులకు చికిత్స, పునరావాసం తదితరాలపై సహకారం.
(ii) కార్యకలాపాలు, సాంకేతికత సహా మాదకద్రవ్యాలకు సంబంధించిన సాధారణ సమాచార ఆదాన ప్రదానం. దీంతో పాటు మత్తుమందులు, మానసిక ప్రభావం చూపే పదార్థాలు, ముడి రసాయనాలు తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రెండు దేశాలలో ప్రస్తుతం అమలవుతున్న చట్టాలు, నిబంధనలు, విధానాలు, ఉత్తమ ఆచరణలు, పద్ధతులు సహా భవిష్యత్తులో ఏదైనా సవరణలు చేస్తే సంబంధిత సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం.
పూర్వరంగం:
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న కృషికి భారతదేశం సదా మద్దతు పలుకుతూ వస్తోంది. అంతేకాకుండా ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యం లోని చర్యలతో పాటు అనేక బహుళ పక్ష ఒప్పందాలలోను, ద్వైపాక్షిక ఒప్పందాలలోను భాగస్వామిగా ఉంది. ఐక్య రాజ్య సమితి తీర్మానాల స్ఫూర్తికి అనుగుణంగా ఇరుగుపొరుగు దేశాలతో పాటు మాదకద్రవ్యాలకు సంబంధించి మన దేశంలో పరిస్థితులపై ప్రత్యక్ష ప్రభావం చూపే దేశాల తోనూ ద్వైపాక్షిక/అవగాహనపూర్వక ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని దేశాలతో అటువంటి ద్వైపాక్షిక/అవగాహనపూర్వక ఒప్పందాలు పూర్తి అయ్యాయి. మాదకద్రవ్య సంబంధిత అంశాలలో ద్వైపాక్షిక సహకారం దిశగా నేపాల్ తో ప్రస్తుతం కుదుర్చుకోనున్న ప్రతిపాదిత అవగాహనపూర్వక ఒప్పందం కూడా అలాంటిదే.
***
(Release ID: 1500505)
Visitor Counter : 90