PIB Headquarters
‘క్విట్ ఇండియా’ ఉద్యమం 75వ వార్షికోత్సవానికి గుర్తుగా హైదరాబాద్ లో ఈ రోజు వివిధ సంస్థలలో “సంకల్పంతో సాధిస్తాం” ప్రతిజ్ఞ
Posted On:
09 AUG 2017 6:39PM by PIB Hyderabad
“క్విట్ ఇండియా” ఉద్యమానికి నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతుండటాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి హైదరాబాద్ లోని పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) సిబ్బంది చేత పిఐబి డైరక్టర్ జనరల్ శ్రీ ఎమ్.వి.వి.ఎస్. మూర్తి “సంకల్పంతో సాధిస్తాం” (హిందీలో ‘సంకల్ప్ సే సిద్ధి’) పేరిట ‘నవ భారత సంకల్పం’ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కవాడిగూడ లోని సిజిఒ టవర్స్ లో ఉన్న పిఐబి కార్యాలయంలో జరిగింది.
హైదరాబాద్ కోఠిలోని కేంద్రీయ సదన్ లో ఉన్న క్షేత్ర ప్రచార విభాగం (డిఎఫ్‌పి) అధికారులు మరియు సిబ్బంది చేత డిఎఫ్‌పి జాయింట్ డైరక్టర్ శ్రీ ఎం. దేవేంద్ర ‘నవ భారత సంకల్పం’ ప్రతిజ్ఞా పాఠాన్ని చదివించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని డిఎఫ్‌పి యూనిట్ల సిబ్బంది ఈ ప్రతిన పూనారు.
సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ అధీనంలోని పబ్లికేషన్స్ డివిజన్ కు చెందిన యోజన తెలుగు కార్యాలయం మరియు సేల్స్ ఎంపోరియమ్ సిబ్బంది సైతం “సంకల్పంతో సాధిస్తాం” ప్రతిజ్ఞ పూనారు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో ఈ రోజు క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని వారు ఈ ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం, ఒఎస్డి ప్రొఫెసర్ లింబా రెడ్డి, విశ్వవిద్యాలయ ప్రధాన లైబ్రేరియన్ శ్రీ పవన్ కుమార్, యోజన తెలుగు వరిష్ఠ సంపాదకుడు శ్రీ విజయకుమార్ వేదగిరి, యోజన తెలుగు సంపాదకుడు శ్రీ మహ్మద్ సిరాజుద్దీన్ లు పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సిబ్బంది మరియు విద్యార్థులు సైతం స్వచ్ఛమైన, పేదరికానికి చోటుండని, అవినీతి రహిత, ఉగ్రవాద ముక్త, మతతత్వ రహిత, కుల రహిత ‘నవ భారత’ నిర్మాణానికి పాటుపడతామంటూ ఈ రోజు ఒక ప్రతిజ్ఞను చేశారు. విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఇ. సురేశ్ కుమార్ వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఇ. సురేశ్ కుమార్ ప్రసంగిస్తూ, పేదలు మరియు అణగారిన వర్గాల వారి జీవితాలను, పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
***
(Release ID: 1499083)
Visitor Counter : 64