కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
విద్యకు, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ
- “జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ. 1200 కోట్లు మంజూరు చేసిన కేంద్రం’’
Posted On:
07 JUL 2017 7:13PM by PIB Hyderabad
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు దత్తాత్రేయ ఈ రోజు హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సిజిహెచ్ఎస్) వెల్ నెస్ సెంటర్ - 5 పనితీరును పరిశీలించారు. హైదరాబాద్ లోని సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ల నిర్వహణ తీరుపై సిజిహెచ్ఎస్ అధికారులతో కేంద్ర మంత్రి సమగ్ర చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్య, ఆరోగ్య విభాగాలకు రూ. 1200 కోట్లను కేంద్రం మంజూరు చేసినట్లు తెలిపారు. వరంగల్ లోని కెఎమ్ సి కి రూ. 72 కోట్లు, ఆదిలాబాద్ లోని ఆర్ఐఎమ్ఎస్ కు రూ. 72 కోట్లు మంజూరైనట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారత వైద్య శాస్త్ర విజ్ఞాన సంస్థ ఎఐఐఎమ్ఎస్ ను ఏర్పాటుచేసే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించినట్లు ఆయన చెప్పారు.
దేశంలోని ప్రతి జిల్లాలోను కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను నెలకొల్పడానికి ఎన్ డిఎ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని మంత్రి అన్నారు. వైద్యుల కొరతను, అనుభవజ్ఞులైన ప్రభుత్వ వైద్యుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ వైద్యుల పదవీ కాలాన్ని 3 సంవత్సరాలపాటు పెంచడం జరిగిందన్నారు. హైదరాబాద్ నగరంలో 1.5 లక్షల మంది సిజిహెచ్ఎస్ కింద లబ్ది పొందుతున్నారని మంత్రి చెప్పారు. హిమయత్ నగర్ లోని సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ పరిధిలో 4 వేల మంది లబ్దిదారులుగా ఉన్నారని ఆయన వివరించారు. విశాల ప్రయోజనాల రీత్యా డిస్పెన్సెరీని పాలీ క్లినిక్ గా మార్చడం జరుగుతుందని చెప్పారు. 2 ఎకరాల 97 గజాల స్థలం హిమయత్ నగర్ సిజిహెచ్ఎస్ నియంత్రణలో ఉందని కూడా ఆయన వెల్లడించారు. ప్రజలందరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకొని నగరాన్ని పరిశుభ్రంగాను, పచ్చదనంతోను విలసిల్లే విధంగా మార్చాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. స్థానిక శాసనసభ్యుడు శ్రీ చింతల రామచంద్రా రెడ్డి, సిజిహెచ్ఎస్ అడిషనల్ డైరక్టర్ డాక్టర్ విజయ భాస్కర్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1494853)
Visitor Counter : 97