నాడు పోస్టు చేయడమైనది:
28 NOV 2026 4:51PM by PIB Hyderabad
భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్), హైదరాబాద్ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ (ఎస్ఓసీ) 100వ ఎడిషన్ నవంబర్ 29న ఆదివారం హైదరాబాద్‌లోని నార్సింగి స్మార్ట్ బైక్ వద్ద ఘనంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సైక్లింగ్, శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో సుమారు 200 మంది క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులు, ఫిట్‌నెస్‌పై ఆసక్తి కలవారు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ క్రీడాకారులు, అర్జున అవార్డు గ్రహీత, మాజీ ఒలింపియన్ అథ్లెట్ జె.జె. శోభ, ఆసియా క్రీడల పతక విజేత నందిని అగసర ముఖ్య అతిథులుగా హాజరవుతారు. వీరి భాగస్వామ్యం యువ క్రీడాకారులు, పాల్గొనేవారిలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు, ఫిట్‌నెస్‌ను జీవితంలో భాగంగా చేసుకునేందుకు స్ఫూర్తిని కలిగిస్తుంది.
ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుండగా, పాల్గొనే వారందరూ ఉదయం 9 గంటలకే వేదిక వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ సందర్భంగా సైక్లింగ్ ర్యాలీతో పాటు వివిధ ఫిట్‌నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో కీలక కార్యక్రమాన్ని పురస్కరించుకుని క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రజలు ఎత్తున పాల్గొననున్నారు.
జాతీయ స్థాయిలో 100వ ఎడిషన్ వేడుకలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల కేంద్రమంత్రి గౌరవ డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ పుణెలోని పింప్రి-చించ్వాడ్‌లో నాయకత్వం వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ, ఫిట్ ఇండియా ఉద్యమం, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్), మై భారత్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రముఖులు, క్రీడా దిగ్గజాలు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు, 1.5 లక్షలకు పైగా మై భారత్ వాలంటీర్లు ఈ వేడుకల్లో భాగస్వాములు అవుతారు. ఈ సందర్భంగా నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కూడా చేయనున్నారు.
"పెడల్లింగ్ టువార్డ్స్ ఇండియాస్ ఒలింపిక్ డ్రీమ్" అనే ఇతివృత్తంతో ఒలింపిక్ ప్రధాన విలువలైన 'శ్రేష్ఠత, గౌరవం, స్నేహభావం'కు ఈ 100వ ఎడిషన్‌ను అంకితం చేశారు. దేశంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయటం, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం, భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే భారతదేశ ఆకాంక్షలను బలోపేతం చేయటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. సుపరిపాలన, సమగ్రత, నైతిక విలువలు, సమ్మిళితత్వం, క్రీడాకారుల సంక్షేమం, లింగ సమానత్వం, పారా-అథ్లెట్లకు అవకాశాలు, సుస్థిరత పట్ల ఒలింపిక్ ఉద్యమ నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెబుతుంది. క్రీడలు, ఫిట్‌నెస్‌ను నిత్యజీవితంలో భాగం చేసుకునేలా యువతకు స్ఫూర్తిని కలిగిస్తుంది.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ మార్గదర్శకత్వంలో డిసెంబర్ 2024లో ప్రారంభమైన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నేడు దేశవ్యాప్తంగా ప్రతి వారం నిర్వహించే గొప్ప ఫిట్‌నెస్ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన "ఫిట్‌నెస్ కా డోస్, ఆధా ఘంటా రోజ్" సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు, ఊబకాయానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచార కార్యక్రమంపై ఇది అవగాహన కల్పిస్తుంది.
దేశవ్యాప్త ఫిట్‌నెస్ ఉద్యమంలో ఈ 100వ ఎడిషన్ కీలక ఘట్టంగా నిలవనుంది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు సైక్లింగ్‌ను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవటం పర్యావరణ పరిరక్షణకు సహకరించటం, ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించటం ఈ కార్యక్రమ లక్ష్యం.
క్రీడాకారులు, యువత, సైక్లింగ్ అభిమానులు, ప్రజలందరూ ఈ వేడుకలో పాల్గొని, ఈ చరిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవ్వాలని భారత క్రీడా ప్రాధికార సంస్థ ఆహ్వానిస్తోంది.
పెడల్ ఫర్ ఫిట్‌నెస్! పెడల్ ఫర్ హెల్తీ ఇండియా! పెడల్ టువార్డ్స్ ఇండియాస్ ఒలింపిక్ డ్రీమ్!
***