నాడు పోస్టు చేయడమైనది:
26 NOV 2026 2:42PM by PIB Hyderabad
రాజ్యాంగం ప్రతి పౌరుడిదని, అందులోని ఆదర్శాలను అర్థం చేసుకోవాలని, పరిరక్షించాలని, నిత్యజీవితంలో ఆచరించాలని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఈ రోజు హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ విద్యాసంస్థలో నిర్వహించిన ఫొటో ప్రదర్శన & అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
_20261126145443_cbe5a5.jpeg)
భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాదని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే సజీవ సాధనమని ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ మౌలిక సూత్రాలను అర్థం చేసుకొని, వాటిని కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పౌరులకు పిలుపునిచ్చారు. డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్, రాజ్యాంగ సభలోని ఇతర సభ్యుల కృషిని గుర్తుచేస్తూ, రాజ్యాంగ రూపకల్పనకు దారితీసిన విస్తృత చర్చలు, సమాలోచనలను ఆయన వివరించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారని, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని చెబుతూ ఆ తేదీల ప్రాధాన్యాన్ని వివరించారు.

రాజ్యాంగ పీఠిక ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. భారత రాజ్యాంగ విలువలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులని అని ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రాథమిక హక్కులు, రాజ్యాంగబద్ధ పాలన, న్యాయవ్యవస్థ స్వతంత్రత, మౌలిక స్వరూప సిద్ధాంతం ప్రాధాన్యాన్ని కూడా ఆయన వివరించారు.
సామాజిక పరివర్తనలో రాజ్యాంగం పాత్రను ప్రస్తావిస్తూ.. వ్యవస్థాగత అసమానతలను పరిష్కరించడం, వివక్షను తొలగించడం, పౌరులందరికీ గౌరవం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగ నిబంధనల లక్ష్యమని ఆయన అన్నారు. రాజ్యాంగంపై అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. రాజ్యాంగాన్ని చదవడం, రాజ్యాంగ సభ చర్చలను అర్థం చేసుకోవడం అలవాటుగా చేసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించారు. రాజ్యాంగ అవగాహన ప్రాథమిక హక్కులకే పరిమితం కాకుండా ప్రాథమిక విధులు, ప్రజాస్వామ్య ప్రక్రియలో బాధ్యతాయుత భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ చొరవను ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు అభినందించారు. భారత రాజ్యాంగ చరిత్ర, విలువలు, ప్రాధాన్యాన్ని యువతకు పరిచయం చేయడంలో అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. రాజ్యాంగంపై అవగాహన పెంపొందించేందుకు విద్యాసంస్థలు, పౌర సమాజ సంస్థలు చురుగ్గా కృషి చేయాలని ఆయన కోరారు.
పౌరులు తమ ప్రాథమిక హక్కులు, విధులను అర్థం చేసుకునేలా రాజ్యాంగంపై అవగాహన కల్పించాలని, అందులోని నిబంధనలను సులభంగా వివరించాలని డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ జీ. వినోద్ పేర్కొన్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కృషిని ఆయన కొనియాడారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని, దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించిందని తెలిపారు.
_20261126145355_cfb734.jpeg)
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్ ప్రారంభోపన్యాసం చేశారు. 'అవర్ కాన్‌స్టిట్యూషన్, అవర్ ప్రైడ్' ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో రాజ్యాంగ రూపకల్పన, రాజ్యాంగ సభ సభ్యుల కృషి, ముఖ్యంగా మహిళా సభ్యుల సేవలు, ప్రాథమిక హక్కులు, విధులు, మూల రాజ్యాంగ ప్రతిలో ప్రతిబింబించే సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం మనందరి ఉమ్మడి వారసత్వమని, ఉమ్మడి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను అర్థం చేసుకొని, వాటిని కాపాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
_20261126145256_830f6f.jpeg)
సుమారు 40 సమాచార ఫలకాలతో కూడిన ఈ ప్రదర్శనలో భారత రాజ్యాంగ రూపకల్పనలోని ముఖ్యాంశాలు, రాజ్యాంగ రూపకర్తల కృషి, పీఠికలో పొందుపరిచిన రాజ్యాంగ విలువలను ప్రదర్శించారు. రాజ్యాంగ ప్రాధాన్యం, బాధ్యతాయుత పౌరులుగా తమ రాజ్యాంగబద్ధ హక్కులు, విధులపై విద్యార్థులు, సందర్శకులకు అవగాహన కల్పించడం ఈ ప్రదర్శన లక్ష్యం.

***